Monday, November 18, 2024

శకటాల వివాదం

- Advertisement -
- Advertisement -

 

సంపాదకీయం: స్వాతంత్య్ర పోరాటమంటే ఎరుగని పార్టీకి అందుకు సంబంధించిన ఇతివృత్తాలు ఎలా నచ్చుతాయి? అలాగే కుల వ్యవస్థ, స్త్రీ పురుష అసమానతలు కొనసాగాలని కోరుకొనే రాజకీయ పక్షానికి వాటికి వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుల గాథలు ఎందుకు సహిస్తాయి? రాజ్యాంగ విహితమైన పరిపాలనకు దేశం దూరమై చాలా కాలమైంది. రాజ్యాంగం పేరు చెప్పి దానికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోడం కేంద్రంలోని పాలకులకు మంచినీళ్ల ప్రాయమైపోయింది. ఇంత వరకు దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు రాష్ట్రాల మనోభావాలను ఎంతో కొంత మన్నిస్తూ కేంద్రీకృత విధానాలను అప్పుడప్పుడు అమలు పరుస్తూ వుండేవి.

అందుకు పూర్తి విరుద్ధంగా రాష్ట్రాల అభీష్టాలను కాలరాస్తూ ఏడేళ్లుగా బిజెపి దేశాన్ని పరిపాలిస్తున్నది. జనవరి 26న దేశ రాజధానిలో ఆనందోత్సాహాలతో అట్టహాసంగా నిర్వహించే రిపబ్లిక్ దినోత్సవాలలో ప్రదర్శించడానికి అన్ని రాష్ట్రాల నుంచి అలంకృత శకటాలను ఏటా కేంద్రం ఆహ్వానిస్తుంది.రాష్ట్రాలు తమ చరిత్ర, సంస్కృతి, అభివృద్ధి, సంక్షేమం తదితర అంశాలను ఇతివృత్తాలుగా చేసుకొని వాటిని చిత్రాలలో, కదిలే బొమ్మల్లో తదితర మాధ్యమాల్లో వివరిస్తూ ప్రతిపాదనలు పంపిస్తాయి. కేంద్ర ప్రభుత్వ కమిటీ వాటిని పరిశీలించి ఎంపిక చేస్తుంది. ఏటా ఎటువంటి పేచీ లేకుండా జరిగిపోయే ఈ కార్యక్రమం ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల విషయంలో వివాదాస్పదమైంది. అవి కీలక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కావడం విశేషం. ఈ మూడు రాష్ట్రాలు సంస్కరణ, స్వాతంత్య్ర ఉద్యమాల్లో తమ ఘనతను చాటే ఇతివృత్తాలను ప్రతిపాదించగా అవి తిరస్కరణకు గురయ్యాయి. కేరళ సమర్పించిన శకటం ప్రఖ్యాత సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక ఏకత సాధనకై జీవితాన్ని అర్పించిన వాడు కుల వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు, 19-20 శతాబ్దాల్లో కింది కులాలవారి ఆలయ ప్రవేశ ఉద్యమాన్ని విజయవంతంగా నడిపించిన మహానుభావుడు నారాయణగురుకు సంబంధించినది. ఈయనను, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మాగాంధీ కూడా కొనియాడారు.

అలాగే తమిళనాడు రాష్ట్రానికి చెందిన శకటం స్వాతంత్య్ర ఉద్యమంలో తమిళులు వహించిన ఘనమైన పాత్రకు సంబంధించినది. ఇందులో 1906లో బ్రిటిష్ వారికి పోటీగా స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ నెలకొల్పి, దేశద్రోహ ఆరోపణపై జైలు శిక్షకు పాత్రుడైన వివొ చిదంబరనార్, ప్రఖ్యాత తమిళ కవి, అనుపమాన స్వాతంత్య్ర యోధుడు సుబ్రహ్మణ్య భారతితో పాటు ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాడిన మహిళా యోధురాలు రాణి వేలు నాచియర్ విగ్రహం ఉన్నాయి. బెంగాల్ శకటం సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని చాటుతూ తయారు చేసినది. గొప్ప దేశభక్తులకు చెందిన ఈ మూడు రాష్ట్రాల శకటాలూ తిరస్కరణకు గురయ్యాయి.

దేశ భక్తి ఖ్యాతి తమదేనని, అందులో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు ఏమాత్రం చోటు ఇవ్వరాదని కేంద్ర పాలకులు భావించి వీటిని తిరస్కరించారా? అన్నిటినీ కేంద్రీకృతం చేస్తున్నవారు అసలు దేశభక్తుల చరిత్రను చెరిపేద్దామనుకోడంలో వింతలేదు. తమ శకటాల ప్రతిపాదనలను తిరస్కరించినందుకు నిరసన తెలుపుతూ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు ప్రధాని మోడీకి లేఖలు రాశారు. తక్షణం కలుగజేసుకొని వాటిని అనుమతించేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ శకటంలో రవీంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, స్వామి వివేకానంద, శ్రీ అరబిందో వంటి గొప్పవారున్నారని, కేంద్రం తమ చరిత్రను, సంస్కృతిని, ఘనతను వొక పద్ధతి ప్రకారం పదేపదే అవహేళన చేస్తున్నదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం తెలిపారు.

తమిళ స్వాతంత్య్ర సమర యోధులకు సంబంధించి పంపించిన ఏడు ప్రతిపాదనలనూ తిరస్కరించడం తమ ప్రజల మనోభావాలను గాయపరచడమేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధానికి రాసిన లేఖలో ఆక్షేపణ వ్యక్తం చేశారు. తమ శకట ప్రతిపాదనను తిరస్కరించడం తమను అవమాన పర్చడమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఇవేవీ కేంద్రం చెవికెక్కినట్టు కనిపించడం లేదు. నిపుణల కమిటీ తిరస్కరించిందని, తాము చేయగలిగిందేమీ లేదని అమాయకత్వం నటించింది. ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవాల కోసం రాష్ట్రాలు, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి 56 శకటాల ప్రతిపాదనలు అందగా అందులో 21ని మాత్రమే కమిటీ అమోదించింది. నిపుణుల కమిటీ నిష్పక్షపాతంగా చేసిన ఎంపికను కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదంగా ఉపయోగించుకొంటున్నారని కేరళ, తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులను కేంద్ర ప్రభుత్వం విమర్శించింది. ఇంతకంటే కల్లబొల్లి ఆరోపణ మరొకటి వుండదు. దేశ వైవిధ్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాలరాయదలచడం దేశద్రోహమేగాని దేశభక్తి ఎంత మాత్రం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News