Sunday, January 19, 2025

సలాం పోలీస్

- Advertisement -
- Advertisement -

ములుగుజిల్లా : ప్రకృతి వైపరీత్యంతో భారీ వర్షాలు ములుగు జిల్లాను అతలాకుతలం చేశాయి. ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక్క రోజులో కురవడంతో జిల్లాలోని ఏటూర్ నాగారం మండలం కొండాయి, మల్యాల, దొడ్ల, అల్లం వారి ఘణపురం, ఎక్కేల, బుటారం, గుర్రాల బావి తాడ్వాయి లోని ఊరట్టం, మేడారం గ్రామాలు నీట మునిగి ప్రజలు నిరాశ్రయులయ్యారు. జనజీవనం స్తంభించింది. వరద బాధితులను ఆదుకోవడంలో పోలీస్ బాస్ జిల్లా ఎస్పీ గాష్ ఆలం ఆదర్శంగా నిలిచారు.
80 మంది పర్యాటకులను కాపాడిన పోలీసులు
ఓవైపు జోరు వానలు, పొంగి పొర్లతున్న వాగులు వంకలు, జలపాతాల సందర్శనకు అనుమతి లేదు అని తెలియజేసిన పట్టించుకోని కొందరు యువకులు జిల్లాలోని వెంకటాపురం సమీపంలో ఉన్న ముత్యంధార జలపాతాన్ని సందర్శించడానికి వచ్చిన 80 మంది పర్యాటకులు తిరుగుప్రయాణంలో వాగు పొంగడంతో బయటపడే దారిలేక కారడివిలో చిక్కుకున్నారు. పర్యాటకులు అడవిలో చిక్కుకున్న విషయం తెలుసుకున్న ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని రాత్రికి రాత్రి జిల్లాలో తాను 30 మందితో స్వయంగా ఏర్పాటు చేసుకున్న పోలీస్ విపత్తు రక్షణ బృందాన్ని వెంటనే రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. జోరున కురుస్తున్న వాన, ఉరుములు, మెరుపులు, దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదరుచూస్తున్న సందర్శకులు బతికి బయట పడతామా అనే సందేహం, జిల్లా ఎస్పీ మిమ్మిల్ని కాపాడుతాం అని ఇచ్చిన మాట గుండె నిండా ధైర్యం నింపుకుని రక్షణ బృందం కోసం ఎదురుచూపులు, అప్పటికే అర్థరాత్రి 3 గంటలు అవుతుండగా బయటకు రావడంలో భాగంగా కొత్తదారులు వెతుక్కుంటూ 30 నిమిషాలు నడవగా అడవిలో కొద్ది దూరంలో చీకట్లో టార్చ్ లైట్ వెలుగులు ఎదురుగా ఎస్పీకి పర్యాటకులకు కనిపించారు. అప్పటికే వాన, చలి, ఆకలితో బాధపడుతున్న సందర్శకులకు ఎస్పీ ఆహారం, బిస్కెట్స్, మంచినీరు అందించి వారి గమ్య స్థానాలకు సురక్షితంగా పంపించారు.
కొండాయి ప్రజలకు అన్నీ తానై…
వరదలో కొట్టుకుపోయిన మృతదేహాలను స్వయంగా అన్వేషించి
భారీ వర్షాలు కురవడంతో కొండాయి గ్రామానికి చెందిన కుటుంబం ప్రాణాలు కాపాడుకోవడానికి కొండాయి నుండి మల్యాల వైపు వాగు దాటే సమయంలో దరదృష్టవశాత్తు వరదలో 8 మంది కొట్టుకుపోవడంతో మృతిచెందారు. వాగు ప్రవాహానికి చాలా దూరం కొట్టుకుపోయి మరణించిన శవాలను కడసారి చూపు అయిన వారి కుటుంబాలకు దక్కాలని నిర్ణయించుకున్న ఎస్పీ గాష్ ఆలం రక్షక దళం తనవెంట లేకున్నా స్వయంగా ఒక్కడే గ్రామంలోని కొందరిని వెంటపెట్టుకుని మూడు గంటలపాటు కాలు కదలని బురదలో నిర్విరామంగా మూడు కిలోమీటర్ల పరిధిలోని కుంటలు, పొలాలు, పొదలు, చెరువు గట్లు లాంటి ప్రదేశాలలో అన్వేషించి శవాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు. అంతటితో ఆగక కొండాయి ప్రజలకు ఆహారం, మంచినీరు అందించే దిశగా ఉన్నతాధికారులు ప్రభుత్వంతో మాట్లాడి రవాణా స్తంభించినందుకు హెలికాప్టర్ ద్వారా బాధితులకు అందించారు.
గర్భిణీలను గుర్తించి ఇబ్బందులు తలెత్తకుండా: జులై 27 నుండి కురిసిన వర్షాలకు జంపన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తుండంతో ఎలిశెట్టిపల్లి, కొండాయి, మేడారం తదితర ప్రాంత గ్రామాలలో 8 మంది గర్భిణీలను గుర్తించి వారికి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సదుపాయం కోసం స్వయంగా చొరవ తీసకుని బోట్స్ ద్వారా తరలించి అంబులెన్స్ రప్పించి ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా గుండె సమస్య, కలుషిత నీరు తాగడం వలన గొంతు సమస్య, ఫిట్స్ వంటి అనారోగ్య సమస్యతో ఉన్న 80 మందిని ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా వాగు దాటించి ఆస్పత్రికి తరలించారు.
డి డి ఆర్‌ఎఫ్ రెస్కూ ఆపరేషన్ సక్సెస్: ములుగు జిల్లా కు వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్నందున గమనించిన జిల్లా ఎస్పీ గాస్ ఆలం వరదలలో తక్షణ సహాయం కోసం ములుగు జిల్లాకు సొంత రెస్కూ ఉండాలని ఒక్క ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశ్యంతో చురుకైన 30మంది (ఇద్దరు రిజర్వ్ ఇన్స్‌పెక్టర్లతో) పోలీస్‌లను ఎన్నుకుని అన్ని రకాల విపత్తులను ఎదుర్కొనేలా నిపుణులతో శిక్షణ ఇప్పించారు. జిల్లాలో అనుకోని రీతిలో ఒకే రోజులో భారీ వర్షపాతం నమోదు కావడంతో ఏటూర్ నాగారం ఏజెన్సీ లోని కొండాయి, మల్యాల, మేడారం, ఎలిశెట్టిపల్లి గ్రామాలు నీట మునిగి ప్రజలు వరదలో కొట్టుకుపోగా ప్రాణాలకు సైతం తెగించి ఎన్డీఆర్‌ఎఫ్ బృదంతో కలిసి 53 మంది ప్రాణాలను రక్షించారు.
 ఎస్పీ పై జనం ప్రశంసల వర్షం: భారీ వర్షాల కారణంగా ఏటూర్‌నాగారం ఏజెన్సీ ప్రాంతంలోని ముత్యంధార జలపాతం చూడటానికి 80 మంది పర్యాటకులు వెళ్లి తిరుగు ప్రయాణంలో వాగులు పొంగి దారులు మూసుకుపోవడంతో అడవిలో పర్యాటకులు చిక్కుకున్న విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ గాష్ ఆలం స్వయంగా తానే వెళ్లి పర్యాటకులను రక్షించారు. అదేవిధంగా కొండాయి గ్రామంలో వరదలలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు వెలికితీయడానికి స్వయంగా వెళ్లి నిద్రహారాలు లేకుండా శ్రమించి మృతదేహాలను వెలికితీయడంతో తను పోషించిన పాత్రకు జనం నీరాజనాలు పడుతున్నారు. ఒక జిల్లా పోలీస్ బాస్ ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్లి రాత్రింబవళ్లు సేవలు చేయడం పట్ల ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News