Thursday, January 30, 2025

అమ్మకానికి రాజీవ్ స్వగృహ ఇళ్లు, ప్లాట్లు

- Advertisement -
- Advertisement -

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలు (ప్లాట్లు), ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలను వేలంలో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దశల వారీగా వాటి అమ్మకాలు చేపట్టేందుకు గృహ నిర్మాణ సంస్థ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విక్రయాలతో రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2007లో అప్పటి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణంతో పాటు ప్లాట్ల విక్రయం చేపట్టాలని నిర్ణయించి భూములను బదలాయించింది.

అనంతరం పలు నిర్మాణాలు చేపట్టి అమ్మింది. అప్పట్లో పెద్ద మొత్తంలో ఇళ్లు, స్థలాలు మిగిలిపోయాయి. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఈ పథకం అమలుకు నిధులను సమకూర్చుకునేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆస్తులను విక్రయించాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో స్థలాల, నిర్మాణాల ఎలా ఉన్నాయో అధ్యయనం చేసేందుకు మూడు ఉన్నతస్థాయి కమిటీలను నియమించింది. ఆయా కమిటీలు ఇటీవల ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. వాటిపై సమీక్షించిన అనంతరం దశల వారీగా విక్రయాలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

గతేడాది పోచారంలో చ.అ. ధర రూ.1650 చొప్పున ఖరారు
మార్కెట్ ధరతో పోలిస్తే ఇవి చాలా తక్కువని అధికారులు పేర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో భూమి ధర, ఇళ్ల ప్రస్తుత కండీషన్ ఆధారంగా చదరపు అడుగు ధరను నిర్ణయిస్తూ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అధికారికంగా ధరను ఖరారు చేయాల్సి ఉంది. గతేడాది పోచారంలో చ.అ. ధర రూ.1650 చొప్పున ఖరారు చేశారు. వాటిని కొన్నవారు చ.అ.కు రూ.1050 ఖర్చు చేసి ప్రైవేటు బిల్డర్లతో ఇళ్లను సిద్ధం చేయించుకున్నారు. దీంతో ఆ ప్లాట్‌కు చ.అ. ధర రూ. 2,700 పలికింది. ఆ ప్రాంతంలో ప్రైవేటు నిర్మాణదారులు రూ.4,500 నుంచి రూ.5 వేలు చొప్పున అమ్ముతున్నారు. గాజులరామారంలో గతేడాది చ.అ.కు రూ.1,600 చొప్పున కొన్నవారు చ.అ.కు మరో రూ.1,150 ఖర్చు చేసి ప్రైవేటు బిల్డర్లతో ఇళ్లను సిద్ధం చేయించుకున్నారు. ఆ ప్రాంతంలో మార్కెట ధర దాదాపు రూ.6,500 పలుకుతోంది. ఇప్పుడు కూడా ఇంచుమించు ఇదే ధరలను నిర్ణయిస్తున్నట్టుగా తెలిసింది. పాత ధరలకు 5 శాతం కలిపి కొత్త ధరలు ఖరారు చేస్తారని తెలుస్తోంది.

జీహెచ్‌ఎంసిలో రూ.1,600ల నుంచి రూ.1,700ల కోట్ల ఆదాయం
విక్రయానికి సిద్ధం చేస్తున్న వాటిల్లో ఎక్కువ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలోనే ఉన్నాయి. ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయంలో రూ.1,600 కోట్ల నుంచి రూ.1,700 కోట్ల వరకు జీహెచ్‌ఎంసి పరిధిలోనే రానుంది. ఇక్కడ 760 ఫ్లాట్లు ఉండగా, పలు ప్రాంతాల్లో అపార్టుమెంట్లు కూడా నిర్మించారు. వాటిల్లో 36 అసంపూర్తిగా ఉన్నాయి. 26 టవర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గాజులరామారం, జవహర్‌నగర్‌లో, పోచారంలో ఎనిమిది టవర్లు, ఖమ్మం పట్టణంలో ఉన్నాయి.

అసంపూర్తిగా ఉన్న ఇళ్లు, ప్లాట్లు మొత్తం కలిపి 1,703
అసంపూర్తిగా ఉన్న ఇళ్లు, ప్లాట్లు మొత్తం కలిపి 1,703 ఉన్నట్టుగా అధికారుల గణాంకాలను బట్టి తెలుస్తోంది. అందులో మహబూబ్‌నగర్, కామారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్‌లలో 1,361, మేడ్చల్- రంగారెడ్డి జిల్లాల్లో 342 ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న 136 ఎకరాల భూమిని కూడా వేలం వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 65 ఎకరాలు, మేడ్చల్-మల్కాజిగిరిలో 53 ఎకరాలు, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో 18 ఎకరాల భూమి ఉంది.

సింగిల్ బెడ్రూం ప్లాట్లు పోచారంలో 255
ప్రస్తుతం చిన్నచిన్న పనులు, మరమ్మతులు మినహా మిగతా మొత్తం సిద్ధంగా ఉన్న ఇళ్లు నాగోలు సమీపంలోని బండ్లగూడ, ఘట్‌కేసర్ దారిలోని పోచారం, ఖమ్మంలలో మాత్రమే ఉన్నాయి. సింగిల్ బెడ్రూం ప్లాట్లు బండ్లగూడలో 105, పోచారంలో 255, 2 బిహెచ్‌కే ఇళ్లు బండ్లగూడలో 19, పోచారంలో 340 ఉన్నాయి. 3 బిహెచ్‌కే ప్లాట్లు బండ్లగూడలో 8, పోచారంలో 4, 3 బిహెచ్‌కే డీలక్స్ ప్లాట్లు బండ్లగూడలో 3, పోచారంలో 4, సీనియర్ సిటిజన్స్ ప్లాట్లు బండ్లగూడ 24 సిద్ధంగా ఉన్నాయి. ఒక్కోక్కటి 8 అంతస్తులుగా 5 టవర్లు ఇక్కడున్నాయి. వీటిల్లో 3 బిహెచ్‌కే ప్లాట్లతో 3 టవర్లు, 2బిహెచ్‌కే ప్లాట్లతో 2 టవర్లు ఉన్నాయి. పోచారంలో పూర్తయిన ఇళ్లకు సంబంధించి జీ ప్లస్ 9 అంతస్తులతో కూడిన 19 టవర్లుంటే, చాలా పనులు చేసుకోవాల్సిన అసంపూర్తి ఇళ్ల టవర్లు ఎనిమిది ఉన్నాయి.

గతేడాది రెండు టవర్లను అమ్మగా ఇంకా ఆరున్నాయి. వీటిల్లో పైకప్పులు నిర్మించినవి 376 ఉన్నాయి. మిగతా టవర్లలో పైకప్పులు నిర్మిస్తే మొత్తం 694 ప్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. జవహర్‌నగర్‌లో 9 అంతస్తుల 17 టవర్లు ఉన్నాయి. వీటిల్లో 2,856 ప్లాట్లున్నాయి. టవర్ల మధ్యలో 19 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఖమ్మం పట్టణం శివారులోని మున్నేరు కాలువ ఒడ్డు ప్రాంతంలో జీ ప్లస్ 9 అంతస్తులతో కూడిన ఎనిమిది టవర్లు నిర్మించారు. వాటిల్లో 3బిహెచ్‌కే సాధారణ ప్లాట్లు నాలుగుంటే, 3 బిహెచ్‌కే డీలక్స్ ఇళ్లు నాలుగుండగా వాటిలో 576 ప్లాట్లున్నాయి. వాటిని అమ్మితే సుమారుగా ప్రభుత్వానికి రూ.2 నుంచి రూ.3 వేల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News