సలేశ్వరం దర్శనానికి నిర్ణీత వేళల్లో వాహనాలకు అటవీశాఖ అనుమతి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నల్లమల అభయారణ్యంలోని సలేశ్వరం దర్శనానికి పగటి పూటనే వాహనాలకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా సలేశ్వరం జాతర పేరొందింది. ఈ ఏడాది ఉత్సవాలకు మూడు రోజులు పాటు సలేశ్వరం వెళ్లేందుకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అడవిలోకి వాహనాలు ప్రవేశించేందుకు అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది. హైదరాబాద్, మహబూబ్ నగర్ మార్గాల గుండా వచ్చే భక్తులు మన్ననూరు నుంచి 16 కి.మీలు దాటాక ఫరాబాద్ బేస్ క్యాంపు వద్ద గల చెక్ పోస్టు నుంచి మట్టి మార్గంలో మరో 16 కి. మీలు ప్రయాణించాలి. రాంపూర్ పెంట వస్తుంది. అక్కడి నుంచి మరో ఆరు కిలోమీటర్లు కాలినడకన కొండలు దిగితే సలేశ్వరం క్షేత్రం వస్తుంది.
మరో మార్గం లింగాల మండలం అప్పాయిపల్లి నుంచి గుండాల వరకు వాహనాలు రానుండగా అక్కడి నుంచి కాలినడకన సలేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది. ఎత్తైన కొండ నుంచి జాలువారే జలపాతం. కొండలోని గుహలో కొలువుదీరిన లింగమయ్య . ఇవన్నీ అమ్రాబాద్ పులుల అభయారణ్య ప్రాంతంలోని సలేశ్వర క్షేత్ర సందర్శనకు వస్తే కనిపిస్తాయి. ఈ నెల 17 వరకు ఉత్సవాలు జరిపేందుకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏటా చైత్ర పౌర్ణమి రోజున లింగమయ్య దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తారు. దర్శనానికి వెళ్లే భక్తులు ప్లాస్టిక్ నీటి సీసాలను, ప్లాస్టిక్ వస్తువులను అడవిలోకి తీసుకెళ్లకుండా పూర్తిగా అటవీశాఖ నిషేధం విధించింది.