Monday, November 18, 2024

ప్రాణాలతో ఉండాలంటే రూ. 5 కోట్లు ఇవ్వు

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నుంచి రూ. 5 కోట్లు కోరుతూ ఒక బెదరింపు సందేశాన్ని ముంబయి ట్రాఫిక్ పోలీసులు అందుకున్నట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ. 5 ఇవ్వాలని కోరుతూ ఆగంతకులు సల్మాన్‌పై బెదరింపులకు పాల్పడ్డారు. ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సాన్ నంబర్‌కు ఈ మెసేజ్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు ఈ సందేశం వచ్చింది. ‘ఈ బెదరింపులను తేలికగా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ. 5 కోట్లు చెల్లించాలి. ఆ డబ్బులు ఇవ్వకపోతే (ఇటీవల హత్యకు గురైన) మాజీ ఎంఎల్‌ఎ సిద్ధిఖీ కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉంటుంది’ అని దుండగులు అందులో బెదరించారు. దానిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ జరుపుతున్నామని ముంబయి పోలీసులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో బాంద్రాలోని సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, సల్మాన్ ఖాన్‌కు ఇలా బెదరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోను పలు మార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయనకు బెదరింపులు వచ్చాయి. ఈ ఏడాది నవంబర్‌లో సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రా గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం విదితమే. అంతకు ముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించడం అప్పట్లో కలకలం రేపింది. నటుడి ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నిరుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రత పెంచింది. బెదరింపు, బలవంతంగా సొమ్ము కోరడానికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) కింద ఒక కేసును వర్లి పోలీసులు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా, సల్మాన్ హత్యకు జూన్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ పన్నిన కుట్రను నవీ ముంబయి పోలీసులు గురువారం బహిర్గతం చేసినట్లు, ఆ గ్యాంగ్ షూటర్లలో ఒకడైన హర్యానా పానిపట్‌కు చెందిన సుఖ్‌బీర్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News