Wednesday, January 22, 2025

గుజరాత్ అగరియాల అగచాట్లు

- Advertisement -
- Advertisement -

salt farming in gujarat

అగరియాలు ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుండి వలస వచ్చి గుజరాత్‌లో స్థిరపడ్డ ముస్లిం గిరిజనులు. వీరి పూర్వీకులు సంప్రదాయ మోతుబరి రైతులు. కొందరు భూమి లేని వ్యవసాయ కూలీలు. అగరి తెగ ముస్లింలుగా మతాంతీకరించబడ్డారట. వీరు తమ సమూహాల బయట పెళ్ళి చేసుకుంటారు. సున్నీ ముస్లింలైనా జానపద నమ్మకాలతో జీవిస్తారు. కచ్చి, గుజరాతీ భాషలు మాట్లాడతారు. ఆరోగ్య సౌకర్యాలు, రాజకీయ ప్రాతినిధ్యం లేక గుజరాతీ సమాజానికి దూరంగా అనాగరికులుగా జీవిస్తున్నారు. వీరి నిరక్షరాస్యత భావి తరాల అభివృద్ధి అవకాశాలను తుడిచేసింది.

గుజరాత్ ఉప్పును దేశమంతా తింటోందని రాష్ట్రపతి ముర్ము (గుజరాత్ ఎన్నికల ముందస్తు ప్రచారంలో) అన్నారు. పస్మంద (వెనుకబడ్డ) ముస్లింల సంక్షేమాన్ని సంఘ్ చూడాలని హైదరాబాద్ సంఘ్ సభలో ప్రధాని ప్రవచించారు. ముస్లింలు, క్రైస్తవులు, అనుసూచిత కులాలు, తెగలు, వెనక్కు నెట్టబడ్డవారు, స్త్రీలు సంఘ్ సంస్కృతిలో బహిష్కృతులు. ఉప్పును తయారు చేసే గుజరాత్ అగరియాలు ముస్లింలు. లక్షద్వీప్ ముస్లింలలాగే వీరు అనుసూచిత్ తెగ. మతసమీకరణతో హైందవ రాజకీయం నడిపే సంఘ్‌కు వీరి ఓట్లు అక్కర లేదు. వీరిని దుర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఓటమి భయం తో రాష్ట్రపతి, ప్రధానిల ఈ మాటలు.

అగరియాలు ఉత్తరప్రదేశ్ ఆగ్రా నుండి వలస వచ్చి గుజరాత్‌లో స్థిరపడ్డ ముస్లిం గిరిజనులు. వీరి పూర్వీకులు సంప్రదాయ మోతుబరి రైతులు. కొందరు భూమి లేని వ్యవసాయ కూలీలు. అగరి తెగ ముస్లింలుగా మతాంతీకరించబడ్డారట. వీరు తమ సమూహాల బయట పెళ్ళి చేసుకుంటారు. సున్నీ ముస్లింలైనా జానపద నమ్మకాలతో జీవిస్తారు. కచ్చి, గుజరాతీ భాషలు మాట్లాడతారు. ఆరోగ్య సౌకర్యాలు, రాజకీయ ప్రాతినిధ్యం లేక గుజరాతీ సమాజానికి దూరంగా అనాగరికులుగా జీవిస్తున్నారు. వీరి నిరక్షరాస్యత భావి తరాల అభివృద్ధి అవకాశాలను తుడిచేసింది. అరేబియా సముద్ర తీరాన థార్ ఎడారిలో కచ్చి జిల్లా బురద నేలల్లో ఉప్పు తయారీ వృత్తితో శతాబ్దాలుగా, తరతరాలుగా బతుకుతున్నారు. నవంబర్ -ఆగస్టు మధ్య 10 నెల్ల పాటు దారుణ ఎడారి వాతావరణ పరిస్థితుల్లో నివసిస్తారు. 7,505.22 చ.కి.మీ. విస్తీర్ణపు ఈ ఉప్పు ఎడారి ప్రపంచంలో అతి పెద్దది. దేశ ఉత్పత్తిలో 76% ఉప్పును తయారు చేస్తున్నా వీరు నిరుపేదలే. ఈ తెగ ప్రజలు పెద్ద కచ్, చిన్న కచ్ అన్న రెండు ప్రాంతాల్లో నివసిస్తారు. చిన్న కచ్‌లో 175 గ్రామాల్లో 15 వేల కుటుంబాల్లో 70 వేల అగరియాలున్నారు. వీరిలో10వేల కుటుంబాల్లో 45 వేల మంది ఈ వృత్తిలో జీవిస్తున్నారు.

పెద్ద ఉప్పు తయారీ కంపెనీల్లో, మధ్యవర్తుల ఆధ్వర్యంలో ఎక్కువ మంది అగరియాలు ఉప్పు ఉత్పత్తి కూలీలుగా పని చేస్తారు. జనరేటర్లతో సహా అన్ని యంత్రాలను మనుషులే తోసుకొని, మోసుకొని పోవాలి. మంచినీటి కోసం ఉప్పు మళ్ళ నుండి 6 కి.మీ.కు పైగా నడిచి వెళ్ళాలి. సూదులతో పొడిచి, మంటలతో కాల్చే ఎడారి ఎండల నుండి తప్పించుకోడానికి కార్మికులు తెల్లవారు జామున్నే పనిలో దిగుతారు. ప్రతి టన్ను ఉప్పు తయారీకి వీళ్ళకు రూ.25 35 లు చెల్లిస్తారు. ఈ ప్రాంతంలో ‘ధిరాన్’ అనే అనధికార రుణ వ్యవస్థ ఉంది. సీజన్ మొదలవగానే చిన్నకారు ఉప్పు ఉత్పత్తిదారులు ఈ సంస్థ నుండి అప్పు తీసుకుంటారు. ఉప్పు అమ్మగానే అప్పు తీరుస్తారు. ఏడాదిలో 3 వేల టన్నుల ఉప్పు తయారు చేస్తారు. అప్పులు పోనూ రూ.40 వేలు మిగులుతుంది. ‘దేవ్ సాల్ట్’ లాంటి సంస్థలు సముద్రపు నీటిని యంత్రాలతో మళ్ళించి ఎండబెడతాయి. వరదల్లో ఉప్పు కొట్టుకుపోతుంది. అకాల వర్షాలతో ఉప్పు మళ్ళు ఆరవు. ఉత్పత్తి ఆలస్యమవుతుంది. కార్పొరేట్ కంపెనీలు మార్కెట్లలో టన్ను ఉప్పు రూ.4 వేలకు అమ్ముతారు. కార్మికులకు చెల్లించేది టన్నుకు రూ. 60లే. ఈ శ్రమ జీవుల పిల్లలు పదేళ్ళ వయసు నుండే ఉప్పు ఉత్పత్తి పనుల్లో దిగుతారు. స్త్రీలు, పిల్లలు ఉప్పు కర్మాగారాల్లో పని చేస్తారు. వారికి వెయ్యి పాకెట్లకు రూ.80 లు ఇస్తారు. అల్పాదాయం, విద్యావకాశాలలేమి ఈ పేదకార్మికుల పిల్లల అభివృద్ధి మార్గాలను మూసేశాయి. వాళ్ళు కూడా అదే రొచ్చులో పేదరికం, అనారోగ్యాల చట్రంలో ఇరుక్కుపోయారు. తరాల తరబడి శ్రమ దోపిడీతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

13 ఏండ్ల మోడీ అభివృద్ధి- నమూనాలో, తర్వాతి బిజెపి పాలనలో అగరియాలకు విద్యుత్తు, నీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు లభించలేదు. బిజెపి ప్రభుత్వం కచ్ ప్రాంతం మీదుగా స్థాపించిన సుదీర్ఘ విద్యుత్ లైన్లు వాణిజ్యవేత్తలకు విద్యుత్తునిచ్చాయి గాని వీరి చీకటి బతుకుల్లో వెలుగు నింపలేదు. ప్రసిద్ధ మోర్బి జిల్లా, మాలియా తాలూకాలోనే సరైన పాఠశాలలు, నీటి వసతి, చెత్తను ఎత్తేసే ఏర్పాట్లు, విద్యుత్తు లేవు. ఉప్పు తయారీ ప్రాంతానికి దగ్గరలో ఉండిన బస్ షెల్టర్, 2001 భుజ్ భూకంపంలో కూలింది. దాన్ని బాగు చేయలేదు. ఎన్నికల సందర్భంలో కూడా మోడీ ఈ ప్రాంతానికి రాలేదు. ఇక్కడి కష్టజీవుల ఇక్కట్లను విచారించ లేదు. ఎన్నికల్లో ముస్లింలను పోటీ చేయించని, ముస్లింల ఓట్లే అక్కరలేదనే మోడీ, ఈ అనుసూచిత జాతి ముస్లింల మొహం చూస్తారా? ఈ ఉప్పు కార్మికులకు 20 నుండి 100 కి.మీ. దూరంలోని మోర్బి నగర ఆస్పత్రులే గతి. రోగులు ఆస్పత్రులకు పోడానికి రోడ్లు, రవాణా సౌకర్యాలు లేవు. మండు వేసవిలో ఉప్పు ఎడారుల్లో కఠోర కష్టం చేసే ఈ శ్రామికులు తీవ్ర జ్వరాలు, క్షయ, నిర్జలీకరణ (డీహైడ్రేషన్), శరీర కాల్పులు, గాయాల బారిన పడుతున్నారు. 2012లో మొత్తం 8 శాసనసభ స్థానాలను గెలుచుకున్న బిజెపి వీరిని పట్టించుకోలేదు. ఈ ప్రాంతంలో నివసించే వారే అక్కడి దార్లు గుర్తించలేరు. ప్రభుత్వం ఈ ప్రాంతంలో 2009లో తొలి సర్వే జరిపింది. కార్మికులకు రబ్బరు జిగురు బూట్లు, చేతి తొడుగులు, కళ్ళ జోళ్ళు, టోపీలు ఇస్తామని వాగ్దానం చేసింది. అయితే గుర్తింపు పత్రాలు తప్పనిసరి అంది.

గుర్తింపు పత్రాలు పొందడం అతి కష్టం. అందుకే అందరికీ ఆ పరికరాలు అందలేదు. ఓడు గ్రామస్థుడు 33ఏళ్ళ బాబుభాయి రాథోడ్ ఝింఝువాడ ప్రాంతంలో పదేళ్ళ నుండి ఉప్పు తయారీ పని చేస్తున్నారు. ప్రభుత్వ పరికరాలు అందని ఆయన కేవలం బూట్లు, గ్లోవ్స్ రూ. 900 పెట్టి కొన్నారు. 53 -54 సెల్సియస్ డిగ్రీల వేసవిలో రోజుకు 14 గంటలు పని చేయాలి. వర్షాకాలంలో ఈ ప్రదేశమంతా బురద మళ్ళుగా మారుతుంది. బురదలో మోటర్ సైకిళ్ళు నడవవు. నడక నరక యాతన. ‘మోర్బి జిల్లా ఎడారి ప్రాంతం గుల్బాడిలో గోనె సంచులు, తార్పాలిన్లతో గుడిసెలు వేసుకున్నాము. వాన కురిసి గుడిసె లోపలంతా నీరే. నిలవడానికి చోటు లేదు’ అని కార్మికురాలు సవితా ధీరుభాయి కోలి అన్నారు. చలికాలంలో ఉష్ణోగ్రత 2 డిగ్రీలకు పడిపోతుంది. చలి నుండి రక్షణ ఉండదు. ఈ అభాగ్యులు పిల్లాపాపలతో చలిలో ఆ గుడిసెల్లోనే ముడుక్కుంటారు. ప్రభుత్వం ఈ నిరుపేదలను మరిచిపోయింది. నగరాల్లో ఎత్తైన భవనాల నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు పెట్టే బిజెపి ప్రభుత్వం ఈ దురదృష్టవంతులకు ఇల్లు నిర్మించలేదు. నివాస ప్రాంతాల్లో రోడ్లు వేయలేదు. సాహస కార్యాలకు పేరు మోసిన మోడీ 2006లో ఉప్పు మైదానాలను కంచర గాడిదల సంరక్షణ స్థలాలుగా మార్చారు. ఉప్పు ఉత్పత్తిదారులకు ఖాళీ చేయమని నోటీసిచ్చారు. వ్యాజ్యం కొనసాగుతూ ఉంది. అగరియాల ఏకైక జీవనాధారం ప్రమాదంలో పడింది. భవిష్యత్తు అనిశ్చితమయింది.

ప్రయాణ సౌకర్యాలలేమి అగరియాలు 15- 30 కి.మీ.ల దూరమెళ్ళి ఓట్లెయ్యలేరు. మోడీ వరాలలో ఇదీ ఒకటి. గుజరాత్‌లో ముస్లింల, క్రైస్తవుల, ఆదివాసీల, అనుసూచిత కులాల జాతుల భవిష్యత్తు అంధకారమే. యజమాని గొంగళిని తమ ఉన్నితోనే నేశారని గొర్రెలకు తెలియదు. గుజరాత్ ఆర్థిక అభివృద్ధిలో తమ శ్రమ శక్తి పాత్ర ప్రధానమని అగరియాలు గుర్తించలేదు. ఇప్పుడు బోధపడింది. అసంతృప్తి పెరిగింది. అందుకే సంఘ్ ప్రముఖుల మాట మార్పు.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి- 9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News