మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుం ది. దీనికి సంబంధించి ధరణి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పోర్టల్లో సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారాలను బదిలీ చేస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. తహసీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సిసిఎల్‌ఏలకు అధికారాల బ దిలీ ప్రక్రియను చేపట్టింది. అందులో భాగంగానే మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు ధరణి సమస్యలపై ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ధరణి పోర్టల్ సమస్యలు, పరిష్కారాలపై ఇప్పటికే కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జిల్లా క లెక్టర్ల వద్ద ఉన్న ధరణి పోర్టల్ అధికారాలు ఇప్పు డు తహసీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సిసిఎల్‌ఏలకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.17 రకాల మాడ్యుల్స్‌కు సంబంధించి ధరణిలో సవరింపుల కోసం వచ్చిన పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 2,45,037 చేరుకుంది. పట్టాదా రు పాస్ పుస్తకాల్లో డేటా కరెక్షన్ కోసం లక్షకుపై గా అప్లికేషన్లు వచ్చాయి. రికార్డుల అప్‌డేషన్ పే రుతో నిషేధిత జాబితా పార్ట్-బిలో 13.38 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఎలాంటి కారణాలు లే కుండా నిషేధిత జాబితాలో 5.07 లక్షల ఎకరాలను అప్పట్లో చేర్చారు.
నేపథ్యంలోనే వీటిని వెంటనే క్లియర్ చేయాలని ఫిబ్రవరి 29వ తేదీ గు రువారం కలెక్టర్లకు సిసిఎల్‌ఏ గైడ్‌లైన్స్ జారీ చే సింది. నేటి నుంచి 9వ తేదీ వరకు ధరణి సమస్య ల పరిష్కారానికి రెవెన్యూ శాఖ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.రెవెన్యూ అధికారులందరూ దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది. మండల తహసీల్దార్ ఏడు రోజులు, ఆర్డీఓకు మూడు రోజులు, అదనపు కలెక్టర్‌కు మూడు రోజులు, కలెక్టర్ ఏడు రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పే ర్కొంది. దీంతోపాటు ప్రతి మండలంలో 2-3 బృందాలను నియమించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఈ బృందంలో పారాలీగల్స్, డిఆర్డీఏలో పని చేస్తోన్న కమ్యూనిటీ సర్వేయర్లు, అగ్రికల్చర్ విస్తరణాధికారులు, పంచాయతీ సెక్రటరీలు కూడా ఉండనున్నారు. గ్రామాల వారీగా, మాడ్యూళ్ల వారీగా జాబితాలను సిద్ధం చేసి ఈ బృందాలకు తహసీల్దార్ అందజేస్తారు. ప్రతి దరఖాస్తుదారుడికి వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందజేస్తారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ఈ బృందాలు పని చేయనున్నాయి.
కలెక్టర్లు ప్రతిరోజు మానిటరింగ్
ప్రతి దరఖాస్తును పరిశీలించి అవసరమైతే ఫీల్డ్ ఇన్‌స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇస్తారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉంటారు. ఏ ఒక్కటి పెండింగ్‌లో ఉంచొద్దని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ భూములను తప్పనిసరిగా పరిరక్షించే విధంగానే ఈ డ్రైవ్ ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. తహసీల్దార్లు, ఆర్డీఓల ద్వారా కలెక్టర్లు ప్రతి రోజూ దీనిని మానిటరింగ్ చేయనున్నారు.
తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల ఆధ్వర్యంలో….
ఫిబ్రవరి 24న ధరణి కమిటీతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీలైనంత తొందరగా ధరణి దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములపై కఠినంగా వ్యవహారించాలని అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని రేవంత్ కమిటీని ఆదేశించారు. ఈ క్రమంలోనే తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి ఈ ప్రత్యేక సదస్సులను నిర్వహించనున్నారు.
పలు రికార్డులను పరిశీలించే అధికారం అధికారులకు…
అలాగే సేత్వార్, ఖాస్రా, సెస్సాలా పహానీ, పాత పహానీ, 1 బి రిజిస్ట్రర్, ధరణి డేటాను అధికారులు పరిశీలిస్తారు. అసైన్డ్‌మెంట్, ఇనాం, పీఓటీ రిజిస్టర్స్, భూదాన్, వక్ఫ్, ఎండోమెంట్ ల్యాండ్ రికార్డులు అవసరమైతే వెరిఫై చేసే అధికారాన్ని ఈ బృందాలకు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు స్థానికంగా విచారణ చేసి వాస్తవాలు తెలుసుకొని నివేదికను సమర్పించాలి. ఫీల్డ్ విచారణ పూర్తయిన తర్వాత దరఖాస్తుపై రిపోర్ట్ సమర్పిస్తారు. దానిని పై అధికారి ఆమోదించొచ్చు లేదా తిరస్కరించొచ్చు. ప్రతి రిపోర్ట్‌ను తప్పనిసరిగా అప్రూవల్ ఇచ్చే అథారిటీకి పంపిస్తారు. అప్రూవల్ చేసే అథారిటీ వాటిని నిర్ధేశించిన ఫార్మాట్ ద్వారా ఆమోదించడం లేదా తిరస్కరిస్తున్నట్లు పేర్కొంటూ ఉన్నతాధికారులను సమర్పిస్తారు. మార్చి 1 నుంచి 9 తేదీ వరకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్‌లోని ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని, ఏ ఒక్కటీ పెండింగ్‌లో ఉంచొద్దని ప్రభుత్వం ఆదేశించింది.
అయితే అధికారులకు అప్పగించిన బాధ్యతలు ఇలా…
తహసీల్దార్ అధికారాలు….
టిఎం4: విరాసత్ (అసైన్డ్ భూములతో సహా)
టిఎం10: జిపిఏ, ఎస్పీఏ
టిఎం14: స్పెషల్ ల్యాండ్ మ్యాటర్స్
టిఎం 32: ఖాతా మెర్జింగ్
ఆర్డీఓకు:
టిఎం 7: పాసు పుస్తకం లేకుండా నాలా కన్వర్షన్
టిఎం 16: ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు
టిఎం 20: ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించిన సమస్యలు
టిఎం 22: సంస్థలకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు
టిఎం 26: కోర్టు కేసులు, సమాచారం
టిఎం 33: డేటా కరెక్షన్స్, మిస్సింగ్ సర్వే నంబర్లు, విస్తీర్ణం, సర్వే నంబర్ మిస్సింగ్స్ (ఎకరం రూ.5 లక్షల లోపు ఉన్న ఏరియాలో చేయాలి).
కలెక్టర్ స్థాయి అధికారికి:
అన్ని మాడ్యూళ్లకు సంబంధించిన దరఖాస్తులను రిపోర్టుల ఆధారంగా అప్రూవల్ చేయాలి. అలాగే మ్యుటేషన్, సక్సెషన్, పిఓబి సమస్యలు, సెమీ అర్భన్ ఏరియాలో పట్టాదారు పాసు పుస్తకాల సమస్యలు, కోర్టు తీర్పుల ఆధారంగా పాసు పుస్తకాల జారీ, ఇళ్లు లేదా నివాస స్థలాలుగా మారిన భూముల నాలా కన్వర్షన్ వంటివి కలెక్టర్ చూస్తారు.
టిఎం 33: ఈ మ్యాడ్యూల్ కింద వచ్చిన పాసు బుక్ డేటా కరెక్షన్‌లో పేరు మార్పు, ధరణి రాకముందే చ.గ.ల్లో అమ్మేసిన భూములు.
ఎకరం రూ.5 లక్షలకు పైగా ఉన్న భూముల్లో విస్తీర్ణం, సర్వే నెంబరు మిస్సింగ్ వంటి సమస్యల పరిష్కారాన్ని కలెక్టర్లకు అప్పగించారు.
సిసిఎల్‌ఏ స్థాయి:
టిఎం 33: ఈ మ్యాడ్యూల్ కింద డేటా కరెక్షన్, నోషనల్ ఖాతా ట్రాన్సఫర్, క్లాసిఫికేషన్ మార్పు, రూ.50 లక్షలకు పైగా విలువజేసే భూముల్లో డేటా కరెక్షన్ వంటివి సిసిఎల్‌ఏ చేయనుంది.