స్టాక్హోమ్ (స్వీడన్): 2023 లో స్వీడన్లో ముస్లింల పవిత్ర గ్రంధం అయిన ఖురాన్ ప్రతులను తగులబెట్టి ముస్లిం దేశాల్లో తీవ్ర నిరసనలు, ఆందోళనలకు కారణమైన సాల్వన్ మోమికా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం స్వీడన్ లోనే గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో అతడు మరణించాడు. ఈ విషయాన్ని స్వీడన్ మీడియా వెల్లడించింది. అక్కడి పోలీసులు కూడా కాల్పుల్లో సాల్వన్ మోమికా మృతి చెందిన విషయాన్ని ధ్రువీకరించారు. క్రిష్టియన్ ఇరాకీ అయిన సాల్వన్ మోమికా నాడు ఖురాన్ ప్రతులను తగులబెట్టి సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టారే కేసులో స్టాక్హోమ్ కోర్టు గురువారం తీర్పు వెలువరించాల్సి ఉంది. ఇంతలో మోమికా హత్యకు గురి కావడంతో తీర్పును ఫిబ్రవరి 3 వ తేదీకి వాయిదా వేసింది. సొదర్దల్లీ నగరంలో కాల్పులు జరుగుతున్నాయనే సమాచారం అందడంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మోమికా నివాసం ఉండే ఇంటి లోపల ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు వెళ్లే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడి ఒంటిపై తూటాల గాయాలు ఉన్నాయి. హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారు. సాల్వన్ మోమికా ఇస్లాం మతంపై ద్వేషంతో 2023లో స్వీడన్ లోని పలు ప్రాంతాల్లో ఖురాన్ ప్రతులను తగులబెట్టి తన నిరసన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో గురువారం ఆయన హత్యకు గురయ్యాడు.
ముస్లిం ఆందోళనలకు కారణమైన సాల్వన్ మోమికా హత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -