శాన్‌ఫ్రాన్సిస్కో: ఈ సాంకేతిక యుగంలో పెను సంచలనంగా మారిన కృత్రిమ మేధస్సు( ఐ)ఆధారిత టెక్నాలజీ చాట్‌జిపిటిని రూపొందించిన శామ్ ఆల్ట్‌మన్‌ను సిఇఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ ఎఐ సంస్థ సంచలన నిర్ణయం తీసుకొంది. మైక్రోసాఫ్ట్ ఆర్థిక మద్దతు గల ఓపెన్ ఎఐ సంస్థ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటీ సిఇఓగా వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఆల్ట్‌మన్ తొలగింపు నిర్ణయం టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఓపెన్ ఎఐ సంస్థ బోర్డు శుక్రవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది.‘ ఆల్ట్‌మన్ బోర్డుతో జరుపుతున్న చర్చల్లో నిజాయితీ పాటించడం లేదు.
సరయిన సమాచారం పంచుకోవడం లేదు. బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతను అడ్డుపడుతున్నాడు. ఓపెన్ ఎఐకి నాయకత్వం వహించే అతనిపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదు’ అని ప్రకటించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ నిర్ణయంపై ఆల్ట్‌మన్ ఎక్స్ వేదికగా స్పందించారు.‘ ఓపెన్ ఎఐ సంస్థలో పని చేయడాన్ని ఎంగానో ఇష్టపడ్డాను. వ్యక్తిగతంగా నేను మారడానికి ఉపయోగపడింది. ప్రపంచం కొంచెం మారిందనడాన్ని నేను విశ్వసిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో మంది ప్రతిభావంతులతో కలిసి పని చేయడాన్ని ఇష్టపడ్డాను’ అని ఆల్ట్‌మన్ పేర్కొన్నారు.
వైదొలగిన ఓపెన్ ఎఐ సహవ్యవస్థాపకుడు
కాగా శామ్ ఆల్ట్‌మన్‌ను సిఇఓ బాధ్యతలనుంచి తొలగించిన కొద్దిగంటల వ్యవధిలోనే కంపెనీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓపెన్ ఎఐ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్ తన పదవికి రాజీనామా చేశారు. శామ్ ఆల్ట్‌మన్‌ను పదవినుంచి తొలగించిన కారణంగానే గ్రెగ్ తన పదవినుంచి వైదొలిగారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.‘ గత ఎనిమిదేళ్లనుంచి మేమంతా కలిసి సృష్టించిన అద్భుతాల పట్ల నేను గర్వంగా ఉన్నా. మేము ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొన్నాం. గొప్ప క్షణాలను ఆస్వాదించాం.అసాధ్యమన్న వాటిని ఎన్నో సాధించి చూపించాం. కానీ ఈ రోజు చూసిన వార్తతో (శామ్ తొలగింపును ఉద్దేశిస్తూ)నేను కంపెనీని వీడాలని నిర్ణయించుకున్నా’ అని గ్రెగ్ తన పోస్టులో రాసుకొచ్చారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ ఆధారంగా పని చేసే చాట్‌జిపిటిని ఇటీవలి కాలంలో పరిచయం చేసినప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోయింది.ఈ చాట్‌బోట్ సహాయంతో కేవలం సెకన్లలో మనకు కావలసినకచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు. చాట్‌జిపిటి ఉపయోగాలు ఎన్నో ఉన్నప్పటికీ అంతే సంఖ్యలో నష్టా కూడా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. పలు రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్నారు.ఆల్ట్‌మన్ సైతం ఎఐతో పెనుప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. చాట్‌జిపిటికన్నా శక్తివంతమైన ఎఐని డెవలప్ చేసే సత్తా ఓపెన్‌ఎఐకి ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడే విడుదల చేసేందుకు తాము సుముఖంగా లేమని గతంలో ఆయన చెప్పారు. యూజర్లు కూడా సిద్ధంగా లేరని, తద్వారా తలెత్తే పరిణామాలను ఊహించడం కూడా కష్టమని గతంలో ఆల్ట్‌మన్ అన్నారు. ఇక ఓపెన్ ఎఐ సంస్థకు వెన్నెముకగా ఉన్న మైక్రోసాఫ్ట్ సంస్థలో బిలియన్లలో పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం దీన్ని తన సెర్చ్ ఇంజిన్ బింగ్‌లో వాడుతున్నారు.