లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాది పార్టీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ విమర్శలు గుప్పించారు. ముజఫర్‌నగర్ అల్లర్ల సమయంలో 60 మందికి పైగా హిందువులను ఊచకోత కోశారని, 1500 మందికి పైగా హిందువులను జైళ్లోకి నెట్టారని తీవ్రంగా ఆరోపించారు. సమాజ్‌వాది పార్టీ టోపీని అమాయక రామభక్తుల రక్తంతో పెయింట్ చేశారని ఎద్దేవా చేశారు. బాగ్‌పట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో యోగి ఆదిత్యనాధ్ మాట్లాడుతూ నేరగాళ్లకు వాళ్లు (ఎస్పీ) టికెట్లు ఇచ్చారని చెప్పారు. మొరాదాబాద్‌లో ఆ పార్టీ అభ్యర్థులను ఆయన ఈ సందర్భంగాఉదహరించారు.
వారిలో ఒకరు అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లను చూడటం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. మానవత్వానికి వ్యతిరేకులైన తాలిబన్లను సపోర్టు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఎస్పీ, బీఎస్‌పిల మధ్య పోటీని ఆయన వివరిస్తూ ఎవరు ఎంత పెద్ద నేరస్తులకు టికెట్లు ఇచ్చారనే విషయం లోనే వారి మధ్య పోటీ ఉందని చెప్పారు. ఈ నేరగాళ్లే ఎమ్‌ఎల్‌లైతే వాళ్లు తయారు చేసేది తుపాకులే కానీ, ఫ్లవర్స్ కాదని వ్యంగాస్త్రాలు సంధించారు. ఇలాంటి వాళ్లకు జేసీబీలు, బుల్‌డోజర్లతో సమాధానం చెప్పాలని అన్నారు. యూపీలో 2017 కు ముందు శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా ఉండేదని, మహిళలకు భద్రత ఉండేది కాదని, ఆ కారణం గానే ఆడపిల్లలు స్కూళ్లకు కూడా వెళ్లలేక పోయేవారని యోగి పేర్కొన్నారు.