లక్నో: ఉత్తరప్రదేశ్ లోని సతారా గ్రామంలో సమాజ్‌వాదీ పార్టీ నేత, అతని భార్య, తల్లిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన బడౌన్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ మాజీ బ్లాక్ చీఫ్ రాకేష్ గుప్తా (58), అతని భార్య శారదాదేవి (54). తల్లి శాంతిదేవి (80)లను సోమవారం హత్య చేశారు. ఈ హత్యలపై సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో సమాచారం అందినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) ఓపీ సింగ్ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై వచ్చి గుప్తా ఇంటి వెనుకవైపు నుంచి లోపలికి చొరబడినట్టు చెప్పారు. గుప్తా పైన, ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరిని ఆగంతకులు కాల్చి చంపిన ఘటనపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌ను సమాజ్‌వాదీ పార్టీ తప్పు పట్టింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Samajwadi Leader and his Family shot dead in UP