జాతీయ మీడియా ఇంటర్వ్యూలో బిజెపిపై చురకలు
లఖ్‌నవూ : తనకుటుంబ సభ్యులను చేర్చుకున్నందుకు బిజెపికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ పార్టీలని తమను విమర్శించే వారు ఆ మరకల్ని తుడిపేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో అఖిలేశ్ మాట్లాడుతూ ఒకవైపేమో బీజేపీ నేతలు ఎస్పీవైపుకు వస్తుంటే మరోవైపు ములాయం కుటుంబ సభ్యులు ఎస్పీ నుంచి బీజేపీ వైపుకు వెళ్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ్‌వాది పార్టీలో ఆయారాం.. గయారాం రాజకీయాలు ఎక్కువ అయ్యాయి. వీటిని మీరెలా మేనేజ్ చేస్తున్నారు ? అని ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు అఖిలేశ్ స్పందించారు. ముందుగా బిజెపికి ధన్యవాదాలు. ఎందుకంటే మమ్మల్ని వారసత్వ రాజకీయ నాయకులని, మా పార్టీని వారసత్వ రాజకీయ పార్టీ అని విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు వారసత్వమే లేకుండా మా నేతల్ని బీజేపీ లోకి తీసుకుంటున్నారు. మా వారసత్వాన్ని అంతం చేస్తున్నారు. అపర్ణను బీజేపీ లోకి తీసుకొని మంచి పని చేశారు. నిజానికి సమాజ్‌వాది పార్టీ ఆలోచనా విధానం ఇప్పుడు మరింత బలపడింది. సమాజ్‌వాదీ పార్టీ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రాజకీయ విలువల్ని కాపాడుతుంది అని అన్నారు.