ఉగ్రవాదులను ‘ జీ ’ అని సంబోధిస్తారు
సమాజ్‌వాది, కాంగ్రెస్‌లపై ప్రధాని మోడీ ధ్వజం
హర్దోయ్ ( యూపీ): అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో కోర్టు 49 మందికి మరణశిక్ష విధించిన కొన్ని రోజుల తరువాత ఆనాటి దుర్ఘటనను గుర్తుకు తెచ్చుకుంటూ నేరస్తులు పాతాళంలో దాగినా వాళ్లను శిక్షిస్తానని తాను ఆనాడే ప్రతిజ్ఞ చేశానని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం వెల్లడించారు. కానీ ఇలాంటి నేరస్తుల విషయంలో సమాజ్‌వాది పార్టీ సానుభూతితో ఉందని మోడీ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్‌లో బిజెపి ప్రచార ర్యాలీని ఉద్దేశించి ఆదివారం ఆయన ప్రసంగించారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ ప్రభుత్వహయాంలో అనేక మంది నిందితులైన ఉగ్రవాదులపై కేసులు ఉపసంహరించుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్ పేలుళ్లు జరిగాయని, ఆ దుర్దినాన్ని తాను మరిచిపోలేదన్నారు. ఆరోజుల్లో నా ప్రభుత్వం దోషులు ఎక్కడ దాగున్నా శిక్షపడేలా చేయాలని సంకల్పం (ప్రతిజ్ఞ) తీసుకున్నామని చెప్పారు. 2006లో వారణాసిలో సంకత్ మోక్షణ్ ఆలయం, కాంట్ రైల్వేస్టేషన్ల వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో నిందితుడైన షమీమ్ అహ్మద్ పై కేసును ఉపసంహరించుకోడానికి అప్పటి సమాజ్‌వాది ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు.
అయోధ్య, లక్నోల్లోని కోర్టు ఆవరణల్లో 2007 లో పేలుళ్లు జరిగాయని, నిందితుడు తారిక్ కజ్మీపై సమాజ్‌వాది ప్రభుత్వం కేసు ఉపసంహరించుకోగా, సమాజ్‌వాది ప్రభుత్వ కుట్రను కోర్టు సాగనీయలేదని, చివరికి నిందితునికి శిక్ష పడిందని గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఉగ్రవాద దాడులకు సంబంధించి 14 కేసుల్లో అనేక మంది ఉగ్రవాదులపై కేసులను ఉపసంహరించుకునేలా సమాజ్‌వాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆరోపించారు. నాటుతుపాకీలను, తూటాలను వినియోగించేవారికి సమాజ్‌వాది ప్రభుత్వం ఎలా స్వేచ్ఛనిచ్చిందో ఇక్కడి ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. తన ఆరోపణలకు మరింత పదును పెడుతూ సమాజ్‌వాది, కాంగ్రెస్ పార్టీల నేతల వైఖరి చాలా ప్రమాదకరమని ధ్వజమెత్తారు.
ఒసామా బిన్‌లాడెన్ వంటి ఉగ్రవాదులను భయంకరమైన ఉగ్రవాదులుగా ఎవరినైతే ప్రజలు పిలుస్తారో వారిని ఈ పార్టీల నేతలు జీ అని గౌరవప్రదంగా పిలుస్తుంటారని వ్యాఖ్యానించారు. బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్‌తో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులు మృతి చెందితే ఈ నాయకులు కన్నీరు కారుస్తుంటారని పేర్కొన్నారు. అలాంటి నాయకులు, పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోడీ హెచ్చరించారు. కుర్చీకోసం దేశాన్నయినా పణంగా పెట్టడానికి వారు వెనుకాడరని వ్యాఖ్యానించారు. విపక్షాలను ఉద్దేశించి బుజ్జగింపు రాజకీయాలను ఎండగట్టారు. ఈ రాజకీయాల కోసం మన పండగలను ఎవరైతే ఆపివేశారో వారు మార్చి 10న ఉత్తరప్రదేశ్ ప్రజల నుంచి తగిన సమాధానం పొందుతారని ధ్వజమెత్తారు.