సమాజ్‌వాదీ పార్టీపై యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాఫియాలను ప్రోత్సహించిందని.. ఇప్పుడు మహా కుంభమేళాను వ్యతిరేకిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్కిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం అయోధ్యలోని పాలియా కూడలి సమీపంలోని హారింగ్‌టన్‌గంజ్ మార్కెట్‌లో జరిగిన ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యోగి మాట్లాడుతూ.. సంపద ముసుగులో చిక్కుకునే ఎవరైనా నిజమైన సోషలిస్టులు కాదని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఒకప్పుడు సోషలిస్టుల గురించి చెప్పారని గుర్తు చేశారు. నేటి సోషలిస్టులు ఆస్తి విషయాలలో మాత్రమే చిక్కుకుంటున్నారని.. వారి జెండాలు ప్రతిచోటా ఖాళీ ప్లాట్లలో నాటుతున్నారని మండిపడ్డారు. మహాకుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌వైపు దేశం, ప్రపంచ ప్రజలు ఆకర్షితులవుతుండగా.. నేరస్థులను, మాఫియాలను రక్షించేందుకు వారి జెండాలు ఉన్నాయని విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు.. మహాకుంభమేళాపై రోజూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఉప ఎన్నికల కోసం ఎస్పీ అవధేష్ ప్రసాద్ తనయుడు అజిత్ ప్రసాద్‌ను రంగంలోకి దింపింది. భారతీయ జనతా పార్టీ ఈ స్థానం నుంచి చంద్రభాన్ పాశ్వాన్‌ను బరిలో నిలిపింది. అంతకుముందు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపి అవధేష్ ప్రసాద్ మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్‌పిని గెలిపించి చరిత్ర సృష్టించాలని ప్రజలు పూర్తిగా నిర్ణయించుకున్నారని అన్నారు.