Thursday, January 23, 2025

నేను ఇంతే… నాలో ఆ పట్టుదల ఉంది

- Advertisement -
- Advertisement -

‘యశోద’లో సమంత భావోద్వేగభరిత పాత్ర చేశారు. తనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయట పడటం కోసం పోరాటం చేసే మహిళగా కనిపించనున్నారు. రియల్ లైఫ్‌లో కూడా సమంత ఫైటర్. మయోసైటిస్‌తో పోరాటం చేస్తూ ’యశోద’ డబ్బింగ్ పూర్తి చేశారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…
ఇదొక యుద్ధం…
ప్రస్తుతం నేను మయోసైటిస్ నుంచి కోలుకుంటున్నాను. త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నాను. ఈ క్షణం నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఈ రోజు ‘యశోద’ విడుదల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మద్దతుకు థాంక్స్. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇదొక యుద్ధం. ఈ యుద్ధంలో పోరాటం చేయడానికి అందరూ చూపిస్తున్న ప్రేమ, మద్దతే కారణం.
అంతిమంగా విజయం సాధిస్తాం…
కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కో రోజు ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తోంది. కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఇంత దూరం వచ్చానా? అనిపిస్తోంది. చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అంతిమంగా మనమే విజయం సాధిస్తాం.
ఏం ఉందో అదే చూపించాం…
‘యశోద’ టీజర్, ట్రైలర్‌కు వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తే చాలా సంతోషంగా ఉంది. టీజర్, ట్రైలర్‌లో మేము చూపించినది నిజమే. సినిమాలో ఏం ఉందో అదే చూపించాం. ప్రేక్షకులకు టీజర్, ట్రైలర్ నచ్చాయి. సినిమా కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను.
అంత పవర్ ఉంది…
సాధారణంగా నేను ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ ‘యశోద’ను వెంటనే ఓకే చేశా. ఇందులోని క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పవర్‌ఫుల్ స్టోరీ ఇది. అందుకని ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
సినిమాలో ప్రతిదీ సూపర్…
సరోగసీ మీద నాకు బలమైన అభిప్రాయం లేదు. తల్లిదండ్రులు కావాలని అనుకునే వాళ్ళకు అదొక పరిష్కారం మాత్రమే. వాళ్ళ ఆశలకు ఆయువు పోస్తుంది. సరోగసీపై తెరకెక్కిన ‘యశోద’ ఒక మంచి థ్రిల్లర్. థియేటర్లలో చూసేటప్పుడు తర్వాత ఏం జరుగుతుందోనని కుర్చీ అంచుకు వచ్చేస్తారు. దర్శకులు కథ, స్క్రీన్ ప్లే రాసిన విధానం… స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన తీరు… ఫైట్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్… ప్రతిదీ సూపర్. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది. వెండితెరపై ఎంజాయ్ చేయాలి.
యాక్షన్ పరంగా కూడా కొత్తగా…
సినిమా యాక్షన్ పరంగా కూడా కొత్తగా ఉంటుంది. యాక్షన్ చేయడం ఎంజాయ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ’ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజీ రోల్ కోసం యాక్షన్ చేశా. నిజం చెప్పాలంటే యాక్షన్ చేసేటప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటుంది.
అందరికీ నచ్చుతుందని…
కథలో, సినిమాలో గొప్ప ఎమోషన్ ఉంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉంటుందని అర్థమైంది. బిగినింగ్ నుంచి కథలో పొటెన్షియల్ ఉందని మాకు అర్థమైంది. షూటింగ్ చేసేటప్పుడు మా నమ్మకం మరింత పెరిగింది. ఎమోషనల్ పాయింట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. ఇప్పుడు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం.
స్లైన్ బాటిల్‌తో డబ్బింగ్ చెప్పా…
’యశోద’కు డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచి అనుకున్నాను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే చేయాల్సిందే. ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే.. వాళ్ళే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటారు. నేను ఇంతే… నాలో ఆ పట్టుదల ఉంది. నాకు మొండితనం ఎక్కువ. అందుకే సెలైన్ బాటిల్‌తో డబ్బింగ్ చెప్పాను. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది.

Samantha Interview About ‘Yashoda’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News