వదంతిని ఖండించిన సమంతా అక్కినేని
ముంబయి: అదేమిటో కాని సమంతా అక్కినేని మీద ఇటీవల తెగ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆమె ప్రతి విషయాన్ని, కదలికని వదంతిగా అల్లేస్తున్నారు. ఈ మధ్యకాలంలోనైతే నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ఊదరగొట్టేశారు. ఇదిలావుండగా, సమంత ఇటీవల తన ఫ్యాన్స్ తో ప్రశ్నోత్తర సెషన్ నిర్వహించింది. తన క్లాతింగ్ లైన్ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఈ ప్రశ్నోత్తరాల ఇంటరాక్ష న్ నిర్వహించింది.
అందులో ఓ అభిమాని, ‘మీరు ముంబయికి మకాం మార్చేస్తున్నారన్న వార్త వినిపిస్తోంది, నిజమేనా?’ అని అడుగగా, సమంతా ‘‘ ఇలాంటి వందలాది వదంతులు ఎక్కడి నుంచి పుడుతున్నాయనేది నాకు అర్థం కావడంలేదు. అది నిజం కాదు. హైదరాబాదే నా నివాస స్థలం. నాకు కావలసినవన్నీ హైదరాబాద్ లో దొరుకుతున్నాయి. నేను అక్కడే హాయిగా ఉంటున్నాను, ఉంటాను’’ అని జవాబిచ్చింది. టాలీవుడ్, కోలివుడ్ తన ప్రాధాన్యతలని కూడా ఆమె స్పష్టంచేసింది.