‘ఏం మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సుందరి సమంత. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత కొద్దికాలంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇటు తెలుగు, అటు తమిళంలో స్టార్ హీరోలతో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అయితే నటుడు నాగచైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్ని సంవత్సరాల తర్వాత అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయడం తగ్గించి బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది ఈ భామ.
బాలీవుడ్‌లో రాజ్ అండ్ డికె కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్‌తో భారీ సక్సెస్‌ని అందుకున్న సమంత.. అదే దర్శక ద్వయం తెరకెక్కించిన సిటాడెల్: హనీ బన్నీ సిరీస్‌తో రీసెంట్‌గా పలకరించింది. ఈ సిరీస్‌లో సమంత వరుణ్ ధవన్‌కు జోడీగా నటించింది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా.. సమంత నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.
తాజాగా ఈ సిరీస్‌కి గాను ఉత్తమ హీరోయిన్‌గా సమంత ప్రతిష్టాత్మక ఐకానిక్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాక.. ఈ సిరీస్‌కి కూడా బెస్ట్ వెబ్ సిరీస్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా దర్శకుడు డికె మాట్లాడుతూ.. ‘‘ఈ వెబ్‌సిరీస్ వెనుక ఎంతో కష్టం ఉంది. అవార్డుల రూపంలో మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’’ అని అన్నారు. అవార్డు గెలిచినందుకు సమంతకు అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.