Friday, November 22, 2024

చిట్టీల పేరుతో సామాన్యులకు కోట్లలో కుచ్చుటోపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చిట్టీల పేరుతో సామాన్యులకు కుచ్చుటోపి పెట్టి దాదాపుగా రూ.200 కోట్లు మేర మోసానికి పాల్పడ్డ మాదాపూర్ ప్రాంతంలోని సమతామూర్తి చిట్‌ఫండ్ డైరెక్టర్లు ఇ.శ్రీనివాస్, ఇ.రాకేష్‌వర్మలను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో డైరెక్టర్ గణేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. ఆరు నెలల క్రితం సమతామూర్తి చిట్ ఫండ్ పేరిట ఓ సంస్థను నెలకొల్పి, ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు మాదాపూర్, ఎల్‌బినగర్, కూకట్‌పల్లిలో బ్రాంచ్‌లను నెలకొల్పి విస్తృత ప్రచారం నిర్వహించి సామాన్య ప్రజల్లో ఆసక్తిని నింపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకునే రీతిలో 5.10,25.50 లక్షలతో పాటు కోటి రూపాయల మేర చిట్స్ నిర్వహించారు. వీరి ప్రచార ఆర్భాటానికి, నమ్మబలికిన విధానానికి అమాయక ప్రజలు ఆకర్షితులయ్యారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అమాయక ప్రజలు వీరి ఉచ్చులో పడ్డారు. ఇదే అదనుగా సదరు చిట్‌ఫండ్ కంపెనీ అందినంత దోచుకుని ఉడాయించింది.

ఇది తెలియని అమాయక ప్రజలు ఆనక విషయం తెలుసుకుని తాము మోసపోయామని గ్రహించి తమకు న్యాయం చేయాలని కోరుతూ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ దృష్టికి సైతం బాధితులు ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. దీంతో ఈ కేసులో స్పీడు పెంచిన మాదాపూర్ పోలీసులు ఈ మోసానికి పాల్పడిన సమతామూర్తి చిట్‌ఫండ్ డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారీలో ఉన్నాడు. ప్రజలు చిట్టీల విషయంలో జాగ్రత్త వహించాలని సదరు చిట్‌ఫండ్ కంపెనీ రిజిస్టర్ అయ్యిందా? లేదా? అన్న విషయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. ఇలాంటి ప్రైవేట్ చిట్టిల వల్ల మోసాల బారిన పడివద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇటువంటి మోసాలు దృష్టికి వస్తే డయల్ 100 లేదా 9490617444 నెంబర్‌కు సమాచారాన్నందించాలని, సమాచారం నందించిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల జాగరూకతతో వ్యవహరించాలని మాదాపూర్ జోన్ డిసిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News