Monday, January 20, 2025

నాలుగు రెక్కల కవిత్వం

- Advertisement -
- Advertisement -

ఇటీవల ఏ పత్రికలో చూసినా సాంబమూర్తి లండ కవిత్వమే. మామూలు వాక్యానికి కూడా కవిత్వం అత్తరు అద్దే కళ అతని దగ్గర ఉంది. ఉద్దానం విషాదంపైనైనా,ఢిల్లీలో రైతుల పోరాటాలపైనైనా, స్త్రీల సమస్యలపైనైనా,కార్పొరేట్ సంస్కృతి గురించైనా, శుష్క వాగ్దానాలు చేసే రాజకీయ నాయకులపైనైనా,కొత్తగా కట్టుకున్న ఇల్లు గురించైనా తక్షణమే స్పందిస్తారు. ఇతని కవిత్వంలో అరిగిపోయిన మాటలు, మూసపోసిన వాక్యాలూ, రొడ్డకొట్టుడు పదబంధాలు ఉండవు.జవ జీవాలతో తొణికిసలాడే వాక్యాలు.తొలకరి చినుకులకు అప్పుడే తడిసిన మట్టిలో నుంచి వచ్చే పరిమళాలు. నారుమడిలో నవ్విన పచ్చని మొలకలు ఆయన అక్షరాలు. దారి పొడుగునా అక్షరాలు విత్తుకుంటూ మానవతా మహాకావ్యానికి శ్రీకారం చుడుతూ నాలుగు రెక్కలతో నలు మూలలకూ విహరిస్తూ కవిత్వాన్ని పంచిపెడుతున్నారు.

చాలామందికి సొంత ఇల్లు ఒక కల.ఇల్లు కట్టుకోవడంలో ఎన్ని కష్టాలను అనుభవించినా కట్టాక దానిపై మమకారం చెప్పలవి కాదు. ఆ మమకారానికి ‘అతిథుల్లారా!/కొంచెం మెత్త మెత్తగా నడవండి/ఇంట్లో నేలంతా నా గుండెను తాపడం చేసాను/ కిటికీల్ని సున్నితంగా తెరవండి/ నా కనురెప్పల్ని కర్టెన్లుగా వేసుంచాను‘ అని అక్షర రూపమిస్తున్నారు. అసలు శీర్షికే అద్భుతం … మొలకెత్తుతున్న ఇల్లు.ప్రాచీన అలంకారికులు కవికి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం ఉండాలని అంటారు.ప్రతిభ పుష్కలంగా ఉన్న కవి. దేనినైనా కవిత్వం చేయగల పరుసవేది ఇతనికి సొంతం. ఇటీవల కే్ంరద్రభుత్వం కొత్తగా సాగు చట్టాలను తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా రైతులందరూ ఢిల్లీ వీధుల్లో పోరాడారు. అక్కడే వంటలు చేసుకున్నారు. అక్కడే వీధి పరుపులపై నిద్రించారు. ఈ సందర్భంలో సాంబమూర్తి – ‘బువ్వనవ్వింది‘ కవితలో ‘నాగళ్ళన్నీ కలిసి/నెత్తుటి అంచుల బారికేడ్లను దున్నేసాయి/జల ఫిరంగుల తలలు తెగిపడ్డాయి/రోడ్లుమీద మేకులు నాటించిన చేతులు/లెంపలేసుకున్నాయి/ముఖం చెల్లక లాఠీలు దూరంగా నిలబడ్డాయి‘ అని రైతులు సాధించిన విజయాన్ని కీర్తిస్తారు.

సింహాసనానికి రాక ముందు ప్రజల ముందుకు వచ్చిన నాయకులు అధికారంలోకి రాగానే ప్రజాపోరాటాల్ని ఆయుధాలతో అణచివేస్తారు. బువ్వ పెట్టిన రైతుల్నే రక్తాలుకారేలా కొట్టారు. ప్రభుత్వ హింస ఎంత దారుణమైందో ‘ఒకప్పుడు ప్రతి గింజా చెమట వాసనేసేది/కొన్నేళ్లుగా కన్నీటి వాసనేస్తోంది/ఏడాదిగా ఐతే,నెత్తుటి వాసన/తొలిసారిగా ఇవ్వాళే/బువ్వ.. గెలుపు వాసనేస్తోంది‘ అని ప్రభుత్వం ఎంత దాష్టీకం చెలాయించినా విజయాన్ని సాధించిన రైతులను అభినందిస్తారు. నాయకులు అధికారంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేస్తారు. కానీ, ఎన్నికల్లో గెలవగానే దేశ సంపదను దోపిడీ చేస్తారు. ‘విధ్వంస గీతం‘లో – ‘సరైన గిరాకీ దొరకాలే కానీ/నదులకు తెలియకుండా జలాల్ని/తీరాలకు తెలియకుండా అలల్ని/కనురెప్పలకు తెలియకుండా కలల్నీ/కొంతమొత్తానికి ఎవరికో కట్టబెట్టేయొచ్చని‘ దేశాన్ని అభివృద్ధి చేయడానికి బదులు నాశనం చేస్తున్నారని పాలకులను ఎండగడతారు.

పుట్టుట గిట్టుట కొరకేననీ జీవితం బుద్బుదప్రాయం అనీ అంటారు. మరణ రహస్యాన్ని చేధించడానికి యోగులు, మునులు తమ జన్మలు ధారపోసినా మరణం ఎప్పటికీ తెలియని బ్రహ్మ పదార్థమే. కవులకు తాత్వికదృష్టి ఎక్కువ. చాలా మంది కవులు తము కావ్యాల్లో మరణాన్ని గురించి వర్ణించారు. సాంబమూర్తి మానవ జీవన తాత్వికత బాగా వంటపట్టించుకున్నారు. ’అనుభవం’ కవితలో మృత్యువును వర్ణిస్తూ ‘ రాత్రులున్నవి/కొద్ది కొద్దిగా/మరణాన్ని అలవాటు చేయడానికేనని తెలిసొచ్చాక/ రాత్రులతో ప్రేమలో పడ్డాను‘ అంటూ ‘అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన పిల్లాడిని/వెదికి పట్టుకుని/ గుండెల్లో పొదువుకుంటూ/బోరున ఏడవడం లాంటి/ ఒక అనుభవమేగా మరణమంటే‘ అని ఆర్ద్రంగా చిత్రీకరిస్తారు. ఏ వస్తువునైనా కొత్తగా చెప్పడం ఈ కవి ప్రత్యేకత.
ఏ చిన్న విషయమూ కవి దృష్టి నుండి తప్పించుకుపోదు. పంటలు సరిగా పండక, ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది వలసలు వెళ్తుంటారు. కన్నతల్లి, ఉన్నవూరును వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లాలంటే ఎక్కడలేని బాధే ఎవరికైనా. కానీ కడుపు నింపుకోవడం కోసం వలసలు తప్పవు.’వలస రైలుబండి’లో.. ‘నా పల్లెలో ప్రతి బిడ్డా/ రెండు గుండెలతో పుడతాడు/ ఒక గుండెను గూట్లో వదిలి పెట్టి/మరో గుండె పట్టుకుని/వలస పిట్టై ఎగిరిపోతాడు//పోర్టుల్లో షిప్పుల్లో/బాల్యాలూ యవ్వనాలూ కరిగిపోతాయి/కన్నీళ్లకు రాసిచ్చేసిన ఊళ్లు/వలసలనే పురుడోస్తాయి ‘ అని కవి తన ప్రాంతపు వలస బతుకుల్ని అక్షరీకరిస్తారు. అనేక మంది బుద్ధి జీవులకు పుస్తకాలంటే ప్రాణం. కొత్త పుస్తకంలో పేజీలు తెరిస్తే, ఆ వాసన ఎంతో బాగుంటుంది.

ఆ పుస్తకాల పరిమళం గురించి ‘పేగుల నిండా ఆకలివాగు/పరుగులు పెడుతున్నప్పుడు/పొయ్యి మీద ఉడికే బువ్వ వాసనలా/ చెమర్చిన కళ్లతో/తొలిచూలు బిడ్డను/గుండెలకు హత్తుకున్నప్పటి పురిటి వాసనలా/ఎంత బాగుంటుందో/కొత్త అక్షరాల వాసన‘ అని ’పుస్తకాల వాసన’ లో అనుభూతిని పలికిస్తారు. చాలామంది పురుషులలో స్త్రీ హృదయం వుంటుంది. ముఖ్యంగా కవుల్లో. వీరు స్త్రీలను అభిమానిస్తారు, ప్రేమిస్తారు. త్రిమూర్తులలో ఒకడైన శివుడు తన శరీరంలో అర్ధ భాగాన్ని పార్వతికి ఇస్తాడు. కానీ ఇక్కడ సాంబమూర్తి మాత్రం ‘సగాన్ని మాత్రమే ఆమెకిచ్చే/లోభత్వం నాలో లేదు/అందుకనేనేమో నా వాక్యాలు స్త్రీ వాసనేస్తుంటాయి/గంటో గడో/స్త్రీలు కాలేకపోతే/ఎవరైనా కవిత్వాన్నెలా రాస్తారు?‘ అని ’వానై పుడతాను’ కవితలో ఎదురు ప్రశ్నిస్తారు.
ఈ సంపుటిలో స్త్రీవాద కవితలు ఎన్నో ఉన్నాయి. ఆధునిక యుగంలో స్త్రీలది ద్విపాత్రాభినయం. ఇటు ఇంట్లో పనులూ చేయాలి,అటు బయట పనులూ చేయాలి. ఈ రెండు పనులతో అలసిపోయే స్త్రీలకు సాహిత్యం మీద ఎంత అభిలాష ఉన్నా వారికి పుస్తకాలు చదువుకోవడానికే తీరిక ఉండదు. పుస్తకం ముట్టుకున్నప్పుడల్లా ఏ కుక్కరో పిలుస్తుంది. ఆరేసిన బట్టలు తడిసిపోతాయని వానజల్లు హెచ్చరిస్తుంటుంది. కవి గారి భార్య మొదట్లో భర్త ఏం రాసినా చదివే తొలి పాఠకురాలు. ఆ తర్వాత ఇంటి పనులలో తీరికలేక చదవడం మానేసిందని ’మొదట్లో తను’ కవితలో వాపోయాడు.

‘ఇప్పుడిప్పుడు తను/నా పాపాయిల్ని ముద్దు చేసేపుడే/ఏ కుక్కరో కేకేసి పిలుస్తోంది/ఏ వానజల్లో/డాబా మీద ఆరేసిన బట్టల్ని తడిపేస్తానని బెదిరిస్తోంది/ఏ పాచిపాత్రలో స్నానం చేసించమని/మారాం చేస్తున్నాయి‘ అని ఇంటి పనులు ఆమె పఠనాసక్తికి ఎలా ఆటంకాలు కల్పిస్తున్నాయో చెప్తున్నారు. కాలమెంత మారినా స్త్రీల పరిస్థితి మారలేదు.స్త్రీలపై దాడులు,అణచివేతలు,ఐదారేళ్ళ పసిమొగ్గల దగ్గర నుండి పండు ముసలివాళ్ళ వరకూ అఘాయిత్యాల పంజాలు విసురుతున్నారు. ఇటీవల చిన్నపిల్లలపై దారుణాలు పెరిగిపోయాయి. అందుకనే బాల్యంలోనే ఆడపిల్లలకు మంచి స్పర్శ,చెడు స్పర్శల గురించి పాఠాలు చెప్పమంటున్నారు. ’నీలి స్పర్శలు’లో చిన్నారులకు కవి జాగ్రత్తలు చెబుతున్నారు. ‘చిట్టి తల్లీ జాగ్రత్త!/ముద్దులన్నీ ఒకేలా ఉండవు/ కొన్ని పెదవుల చివర చురకత్తులుంటాయి/నీలిస్పర్శలుంటాయి/ముద్దు పొదల్లోనూ తోడేళ్ళు నక్కివుంటాయి/‘ అ

ని అంటూ ‘తల్లీ,గుర్తుంచుకో../ముద్దురాకాసి మీద పడగానే/ బేలవు కావొద్దు/ నీ గోళ్ళు విభాగినులవ్వాలి/అచ్చంగా నువ్వొక చిరుతపులివి కావాలి‘ అని నీలి స్పర్శ నిన్ను తాకగానే నీ గోళ్లను ఆయుధాలుగా మార్చుకో. చిరుతపులిలా ఎదుటి వాళ్ళను చీల్చిచెండాడు అని ఉద్భోద చేస్తున్నారు. ఈ సంపుటిలో మరో ముఖ్యమైన,బలమైన స్త్రీవాద కవిత ’ఆ రోజుల్లో’. స్త్రీ నెలసరి సమస్యపై రాసిన కవిత ఇది. ఇప్పుడు పురుషులు కూడా స్త్రీల మూడు రోజుల బాధ గురించి నొప్పి గురించి తెలుసుకుంటున్నారు. సహానుభూతి చూపిస్తున్నారు. ‘కొత్తేమీ కాదు/ నా పుట్టుకకు పూర్వమే/ నేను సంతకం చేసిన మోసపు ఒప్పందం ఇది//శత్రువెవరో/పొత్తికడుపు దేశం మీద/ శూలాలతో భీకర దాడికి తెగబడతాడు/రక్తనాళాలు బద్దలై కురిసే కుంభవృష్టిలో/ కొద్ది కొద్దిగా క్షయమవుతుంటాను/గుల్లబారుతున్న బొవికలు/నిరసన రాగాన్ని అందుకుంటాయి‘…. ‘అమ్మతనంలోని/ ఒకే ఒక్క అలౌకిక పులకింత కోసం/జీవితాంతం గాయాల నదిలా ప్రవహిస్తూ వుంటాను‘ అంటారు. ఈ కవిత నిజంగా ఒక స్త్రీ రాసినట్టే వుంది.
అమ్మ గురించి అక్షరార్చన చేయని కవి ఉండడు. ’రెండు కన్నీటి చుక్కలు’ లో అమ్మ మీద తన ప్రేమను వ్యక్తీకరిస్తారు. ‘అమ్మా! నను కన్నందుకు విప్లవాభివందనాలు‘ అంటారు శివసాగర్. ఈ కవి – ‘ఒక్కోసారి నువ్వు గుర్తొస్తే ఊపిరాడదు/అప్పుడు నీ గర్భాన్ని/నా పసికాళ్ళతో తట్టినప్పుడు/ నువ్వెన్ని పూలతోటలై నవ్వేవో/తెలీదు కానీ/ఇప్పుడు నీ జ్ఞాపకాలు/ నా గుండెల్ని తడుముతుంటే/కన్నీటి మేఘాన్నవుతున్నాను/… అప్పుడెప్పుడో రాసుకున్నట్టు గుర్తు/అమ్మంటే రెండక్షరాలు కాదు/రెండు సముద్రాలని/ఇప్పుడు?/అమ్మంటే రెండు కన్నీటిచుక్కలనిపిస్తుంది‘. ఈ ప్రపంచంలో మనల్ని నిస్వార్ధంగా ప్రేమించేది అమ్మ ఒక్కటే. కానీ ఆమె జీవితం ఎప్పుడూ కష్టాల కడలి,కన్నీటి మేఘమే అని కవి అంటున్నారు. కవి దృష్టి సునిశితమైనది. మానవుల్లో రోజురోజుకీ పెరుగుతున్న ధన వ్యామోహం,కలహాలు, కార్పణ్యాలు,ద్వేషాలు,ప్రపంచంలో విస్తరిస్తున్నయుద్ధకాంక్ష,కార్పొరేట్ సంస్కృతి, హత్యారాజకీయాలు ఇవన్నీ కవిని కలవర పెట్టాయి. ‘గుప్పిళ్ళ నిండా ప్రేమను పట్టుకుని/చిరునవ్వు కవచాన్ని ధరించి/ఈసారైనా/ రూపాయి మీద గెలవాలి//ఓడిపోయిన రూపాయిని/ పళ్ళెంలో పెట్టి/వచ్చే పుట్టిన రోజు కు భూగోళానికి/ కానుకగా ఇవ్వాలి‘ అని అంటారు. ‘ ఎపుడూ లేంది/అమ్మ వాసనేయాల్సిన అన్నంముద్ద/ఆకలి వాసనేస్తుంది/పాలరంగులో మెరవాల్సిన బువ్వ మెతుకు/చావురంగులో మెరుస్తోంది ‘ అని వర్తమాన భారతాన్ని కళ్ళ ముందు దృశ్యీకరిస్తారు. మన ఏలికలు ఎన్నో మాటలు చెబుతారు. ప్రజాక్షేమమే తమ క్షేమం అంటారు. మనది అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. కానీ నిజం పలికితే కారాగారంలో బంధిస్తారు.

ఈ ద్వంద్వ నీతుల నాయకుల గోముఖ వ్యాఘ్ర రూపాన్ని ‘ రైతుల్లారా/కార్మికుల్లారా/ఈ దేశపు పవిత్ర మట్టిలో/ఏ పోరాటాల్ని విత్తకండి/ఈ దేశపు గోడల మీద/ఏ నినాదాల్నీ రాయకండి/తలా పిడికెడు బానిసత్వాన్నిస్తాను/తృప్తిగా నిద్రపొండి‘ అని ’ఒకే రంగు ఆకాశం’లో అంటారు.చివరలో వ్యంగ్యం గుండెల్లో గుచ్చుకుంటుంది.
ప్రజల ఓట్లతో గెలిచిన రాజకీయ నాయకులు ప్రజలకు చెప్పకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాత్రికి రాత్రే పెద్ద నోట్లు రద్దు చేస్తారు. మాటి మాటికీ పెట్రోలు ధర పెరుగుతుంది.రెండు నెలలకోసారి గ్యాస్ ధర పెరుగుతుంది. ప్రతిదానికీ పన్నులు వేస్తారు. బతుకులు దుర్భరమైనా ప్రజలు పెదవి విప్పరు. దీని గురించి ’మెతకరంగు పూలు’ లో ‘ఎక్కడైనా కనబడతాయి/వాసనలేని తేలికరంగు కాగితం పూలు/రేపట్నుంచి పెట్రోల్ మండిపోతుందంటే/రాత్రికి రాత్రే బంకు దగ్గర లైన్లో నిలబడతాయి/మోస్తున్నామన్న స్పృహ లేకుండా/దేశానికి దేశాన్నే మోసుకుంటూ../నిర్ధాక్షిణ్యంగా..

నిశ్శబ్దంగా రాలిపోతూ‘. ఎన్ని అన్యాయాలకు గురవుతున్నా ప్రభుత్వాన్ని ఎదిరించలేని సామాన్యుల గురించి చెప్తారు. కవికి ఏం రాయాలో తెలుసు. ఎవరి వైపు నిలబడాలో తెలుసు. దారి పొడుగునా అక్షరాల్ని విత్తుకుంటూ వెళ్తున్నారు. మనుషులలో పెరిగిపోయిన స్వార్థాన్ని,రాజకీయ నాయకుల ఒంటెత్తు పోకడలనీ నియంతృత్వ స్వభావాన్ని,మద్ధతు ధరలు కూడా పొందని రైతుల వ్యథలను, ఉద్దానం ప్రజల దుఃఖాలను,ఉత్తరాంధ్ర ప్రజల వలస జీవితంలోని కన్నీటిని, జనాభాలో సగభాగమైన స్త్రీల వేదనలను ఈ కవి ఒడిసిపట్టుకున్నారు. రాజ్యం పెట్టే హింసలో బాధితులైనా తిరగబడలేని మెతక మనుషుల గురించి కవి అనంత దుఃఖితుడౌతున్నాడు. ఆ దుఃఖంలో ముంచి రాసిన అక్షరాలివి.ఇతడు కవిత్వమే జీవితమైన కవి. సాంబమూర్తి అపారమైన సృజనశక్తితో క్షణక్షణం చిగురించే కవిత్వం మొక్క.

గుండెలు తడిమే వాక్యాలతో మహాకావ్య రచనా యజ్ఞంలో నిమగ్నుడైన కవి. ’ముఖం చెట్టు’ ’మీసాల చివుళ్లు’, ’చెమట రెక్కలు’, ’వాక్యపుష్పం’, ’కన్నీటి ఖడ్గం’,’వంకర చెట్ల అడవి’, ’చెక్కిలి కాగితం’, ’కార్పోరేట్ కాళీయుడు’ మొదలగు రూపకాలతో కొత్త కొత్త ఉపమానాలతో ఎక్కడ ముట్టుకున్నా తడి తగులుతున్న వాక్యాలతో సాంబమూర్తి కవిత్వం కవితా ప్రేమికులను పరవశింపజేస్తుంది. నాలుగు రెక్కలతో తెలుగు కవిత్వాకాశంలో ఎగురుతున్న ఈ పిట్ట భవిష్యత్తులో మరిన్ని రెక్కలతో తన ఉనికిని, తెలుగు కవిత్వపుటల్లో తనదైన సంతకాన్ని నిలుపుకోవాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను.

మందరపు హైమావతి
94410 62732

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News