అమరావతి: మహాత్మా గాంధీపై హిందూ మిత వాద సంస్థ శ్రీ శివ్ ప్రతిష్టాన్ హిందూస్థాన్ నేత శంభాజీ భిడే చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయి వివాదానికి దారితీశాయి. మహారాష్ట్రలోని అమరావతి, యవత్‌మాల్‌లలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. గాంధీజిని కించపరుస్తూ ఈ నేత ఇష్టానుసారం మాట్లాడారని ఒక్కరోజు క్రితం రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. శంభాజీ వ్యాఖ్యలపై ఆగ్రహిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలకు దిగారు. భిడేపై దేశద్రోహ నేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ దశలోనే శనివారం రాజపీఠ్ పోలీసులు భిడేపై విద్వేషకర వ్యాఖ్యల పరిధిలో ఐపిసి సెక్షన్ 153 ఎ పరిధిలో కేసు పెట్టారని అధికారులు తెలిపారు. గురువారం అమరావతి జిల్లాలో భిడే ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ జాతిపితపై పరుష పదజాలం వాడారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎల్‌పి నేత బాలాసాహెబ్ థోరాట్ డిమాండ్ చేశారు. కొందరు రాజకీయ స్వార్థాలతో ఇటువంటి శక్తులను ప్రేరేపిస్తున్నారని, ఈవైఖరిని అరికట్టాల్సి ఉందని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.