Thursday, January 23, 2025

రాహుల్ గాంధీ నేటి మీర్ జాఫర్: సంబిత్ పాత్ర

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర మంగళవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని నేటి కాలపు ‘మీర్ జాఫర్’ అన్నారు. యూకెలో చేసిన ప్రసంగానికి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి. మేము దీనికోసం మా గళం ఎత్తుతూ ఉంటాం’ అన్నారు.
‘రాహుల్ గాంధీ నేటి రాజకీయాల్లో మీర్ జాఫర్ వంటి వాడు. నవాబ్ కావడానికి మీర్ జాఫర్ ఏమి చేశాడో అలాగే రాహుల్ గాంధీ లండన్‌లో చేశారు. విదేశీ శక్తుల సహకారంతో యువరాజైన మీర్ జాఫర్ నవాబ్ కావాలనుకున్నాడు’ అని సంబిత్ పాత్ర తెలిపారు.

‘రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించారు, విదేశీ జోక్యాన్ని కోరారు. ఇదో సమస్య కాదని, ఇదో కుట్ర అని మేము భావిస్తున్నాము. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే. క్షమాపణలు కోరకుండా రాహుల్ గాంధీ తప్పించుకోలేరు. రాఫెల్ కేసులో, అలాగే కేంబ్రిడ్జ్‌లో చేసిన వ్యాఖ్యలకు పార్లమెంటులో రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే’ అని సంబిత్ పాత్ర అన్నారు.

రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో తన ప్రసంగంలో ‘భారత ప్రజాస్వామ్యం ముప్పులో ఉంది. దాడికి గురవుతోందని అందరికీ తెలుసు. పైగా ఇది వార్తల్లో ఉంది. నేను భారత్‌లో ప్రతిపక్ష నాయకుడిని. మేము ప్రతిపక్షం వైపున ఉన్నాము. ప్రజాస్వామ్య పార్లమెంటుకు కావలసిన సంస్థాగత చట్రం(ఇనిస్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్), స్వేచ్ఛాయుత పత్రికా వ్యవస్థ, న్యాయవ్యవస్థ, సమీకరణ ఆలోచన అన్నింటినీ చుట్టుముట్టి నిర్బంధిస్తున్నారు. కనుక మేము భారత ప్రజాస్వామ్యం మూలాలపై దాడిని ఎదుర్కొంటున్నాం’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News