Monday, December 23, 2024

దేశమంతటా చెరుకు పంటకు ఒకే ధర

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశమంతటా చెరకు పంటకు ఒకే ధరను ప్రకటించాలని జాతీయ రైతుసంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. చెరకు రికవరీ పద్దతిని రద్దు చేసి టన్నుల విధానం అమలు చేయాలని కోరాయి. దేశంలోని చెరుకు రైతుల సమస్యలు పరిష్కారానికై దక్షిణాది రాష్ట్రాల రైతు నాయకులు భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామానాగేశ్వరరావు అధ్వర్యంలో పలు రాష్ట్రాల ఎంపీలను వెంటబెట్టుకుని మంగళవారం నాడు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను కలిశారు. దేశవ్యాప్తంగా చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించి వాటిని పరిష్కరించాలని కేంద్రమంత్రిని కోరారు. ప్రధానంగా చెరుకు రికవరీ గతంలో8.5శాతం గా ఉండేది. ఇటీవల దీన్ని 10.25శాతంగా నిర్ణయించడం వలన రైతులు ప్రతి టన్నుకు వేలాది రూపాయలు నష్టపోతున్నారు.

చెరుకు రైతును ఈ నష్టాలనుంచి తప్పించేందుకు గతంలో ఉన్నటువంటి 8.5శాతాన్నే తిరిగి నిర్ణయించాల్సిందిగా కోరారు.చెక్కర కర్మాగారాల వద్ద చెరుకు పంట తూకాల్లో జరిగే మోసాలను కూడా అరికట్టాలని కోరారు. ఫెయిర్ రెమ్యునరేటివ్ ప్రైస్ క్వింటాలుకు రూ.305నుండి రూ.350కి పెంచాలని డిమాండ్ చేశారు. చక్కర ఫ్యాక్టరీల యాజమాన్యాలు రైతులకు చెరుకు పంట విక్రయాలకు సంబంధించిన డబ్బులు చెల్లించటంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని కోరారు. అగ్నిప్రమాదాలు ఇతర ప్రకృతి విపత్తుల వల్ల చెరుకు రైతులు పంటనష్టపోకుండా బీమా సదుపాయం కల్పించి ఆదుకోవాలని విజ్ణప్తి చేశారు. కేంద్ర మంత్రితో జరిగిన ఈ సామవేశంలో ఎంపి నామాతోపాటు తమిళనాడు ఎంపి గణేష్ మూర్తి, కర్ణాటక ఎంపి సుమలత అంబరీష్ తదితరులు చెరుకు రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కేంద్ర మంత్రి తోమర్‌కు విజ్ణప్తి చేశారు.

అంతకు ముందు రైతు నేతల బృందం కేంద్ర ఎరువులు ,రసాయనాల శాఖ మంత్రి భగవంత్ కుమార్ కుభాను ఆయన కార్యాలయంలో కలిసి చెరుకు రైతుల సమ్సయలపై వినతి పత్రం అందజేశారు. జాతీయ స్థాయిలో రైతు నాయకుల బృందాన్ని ఢిల్లీ వరకు రప్పించి చెరుకు రైతుల సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తేవడంలో దక్షిణా భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు, ప్రధాన కార్యదర్శి పికె దైవ శిగామని , సభ్యులు నల్లమల్ల వెంకటేశ్వర్ రావు తదితరులు ప్రధాన పాత్ర పోషించారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో చెరుకు రైతుల సంఘం నాయకులు కురుబురు శాంతా కుమార్, కె.ఎం. రామా గౌండర్, కె.. బాల సుబ్రహ్మణ్యం, స్వస్తి సిర తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News