న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి కోట్లాది భక్తులు వెళ్తున్నారు. అయితే ఈ వెళ్లే క్రమంలో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘోర ప్రమాదమే ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి 9.30 గంటలకు తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది.
ఫాట్‌ఫాం నెం.16 దగ్గర బీహార్ సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో చోటు కోసం ప్రయాణికులు మరోసారి ఎగబడ్డారు. భారీ లగేజీలతో రైలు ఎక్కేందుకు ఒకరిని ఒకరు తోసుకుంటూ గందరగోళం సృష్టించారు. ఒక ముసలావిడను ఎమర్జెన్సీ కిటికి ద్వారా రైలు లోపలికి పంపించే ప్రయత్నం చేయడంతో ఆమె అందులో ఇరుక్కుపోయిందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దర్బంగా వెళ్లే రైలు వద్ద కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇంత జరుగుతున్న అక్కడ రైల్వే ప్రొటెక్షన్ పోలీసులు లేకపోవడం గమనార్హం.