Monday, December 23, 2024

పెళ్ళి- కొత్త దృక్పథం!

- Advertisement -
- Advertisement -

స్వలింగ జంటల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఆసక్తిదాయకమైన చర్చకు తెర లేచింది. ఈ పిటిషన్లను భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వం ఈ పిటిషనర్ల డిమాండ్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. వారి పిటిషన్లను విచారణకు స్వీకరించడాన్నే కేంద్ర ప్రభుత్వం తరపున పాల్గొన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆక్షేపించారు. అటువైపు ఐదుగురు, ఇటు వైపు ఐదుగురు కూచొని మధ్యలో ఐదుగురు విజ్ఞులతో కూడిన ధర్మాసనం వుండి జాతి యావత్తుకు వర్తించే ఇటువంటి విషయాలను తేల్చడం సమంజసం కాదని, ఇది చాలా సున్నితమైన వ్యవహారమని తుషార్ మెహతా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని ధర్మాసనం తీవ్ర స్వరంతో తిప్పికొట్టింది. విచారణను ఎలా జరపాలో మాకు మీరు పాఠాలు నేర్పవలసిన పని లేదంటూ సొలిసిటర్ జనరల్‌ను సిజెఐ మందలించారు.

వివాహమనేది భిన్న జననాంగాలు కలిగిన వారి మధ్య జరగవలసిన వ్యవహారమని ఒకే రకమైన జననాంగాలున్న వ్యక్తుల మధ్య అది చెల్లదని సొలిసిటర్ జనరల్ వాదించగా, స్త్రీ లేదా పురుషుడు అనే భావన జననాంగాలకు పరిమితమైనది కాదని ధర్మాసనం స్పష్టం చేయడం విశేషం. ఆధునిక సామాజిక దృక్పథంతో అది ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నదని దీనిని బట్టి అర్థమవుతున్నది. వివాహ బంధానికి సమాజం నుంచి ఆమోదం అవసరమని తుషార్ మెహతా చేసిన వాదనలోని యథాతథ వాద దృష్టిని ధర్మాసనం తిరస్కరించింది. దీనిని ఆమోదించినట్లయితే భారత రాజ్యాంగ చైతన్యంతో మనం వేసే ప్రతి ఒక్క ప్రగతిశీల అడుగుకు సమాజం చెప్పనలవికాని ప్రతిబంధకంగా మారుతుంది. రాజ్యాంగం స్త్రీ, పురుష సమానత్వాన్ని ప్రసాదించినా గృహ వ్యవస్థలో పురుషుడి ఆధిపత్యాన్నే సమాజం ఇప్పటికీ ఆమోదిస్తున్నది, అది అప్రతిహతంగా కొనసాగేలా చేస్తున్నది. బహు భార్యాత్వాన్ని కూడా అనుమతించే ధోరణులు సమాజంలో కొనసాగుతున్నాయి. మహిళలు చదువుకోడాన్ని, స్వతంత్రులు కాడాన్ని వ్యతిరేకిస్తూ తీర్పులిచ్చే ఖాప్ పంచాయతీలు కొనసాగుతున్న సమాజం మనది. 2019లో జరిపిన ఒక సర్వే ప్రకారం 62% మంది భారతీయులు స్వలింగ వివాహాలను వ్యతిరేకించారు. అటువంటి సమాజాన్ని ప్రగతి బాటలోకి మళ్ళించడానికే ఆధునిక రాజ్యాంగాన్ని రచించుకున్నాము.

సమాజం అనుమతించకుండా ఏదీ జరగరాదనడం బిజెపి తిరోగామి అజెండాకు మాత్రమే అనుగుణంగా వుంది. స్వలింగ సంపర్కుల పెళ్ళిళ్లకు చట్టబద్ధత కల్పించాలన్న పిటిషన్లపై విచారణలో తాను మతపరమైన వివాహ చట్టాల జోలికి పోదలచుకోలేదని స్పష్టం చేయడం ద్వారా ధర్మాసనం ఈ ఆధునికమైన ఆలోచనకు ప్రాథమికమైన అడ్డంకిని ముందుగానే తొలగించుకొన్నది. కులాంతర, మతాంతర వివాహాలను అనుమతించే 1954 నాటి ప్రత్యేక వివాహ చట్టం పరిధిలో స్వలింగ పెళ్ళిళ్ళకు అనుమతి ప్రసాదించే విషయం పరిశీలించడానికి అది నిర్ణయించుకొన్నట్టు స్పష్టపడుతున్నది. ఒకప్పుడు కులాల్లో, మతాల్లో అంతర్వివాహాలను మాత్రమే అంగీకరించి అందుకు భిన్నమైన వాటిని కఠినాతి కఠినంగా తిరస్కరించిన చరిత్ర మన సమాజానికున్నది. కులాంతర, మతాంతర వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించి వాటిని అరికట్టడానికి హత్యలకు కూడా వెనుకాడని దుష్ట సంప్రదాయ ధోరణి ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే వ్యతిరేకిస్తున్న స్వలింగ వివాహాలను సమాజం సుళువుగా అంగీకరించబోదు. అందుచేతనే ప్రత్యేక వివాహ చట్టాన్ని ధర్మాసనం ఎంచుకొన్నదని అనుకోవాలి.

వివాహం స్త్రీ, పురుష జననాంగాలకు మాత్రమే పరిమితమైన భావన కాదనడంలో ప్రపంచ సమాజాల్లో స్వలింగ సంపర్కుల సహ జీవనాలు పెరుగుతున్న వాస్తవాన్ని ధర్మాసనం దృష్టిలో పెట్టుకొన్నదని బోధపడుతున్నది. స్వలింగ జంటల సహ జీవనాన్ని నేరంగా పరిగణించే గతం నుంచి వారికి సుప్రీంకోర్టు విముక్తి కలిగించిన విషయం తెలిసిందే. స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావిస్తున్న భారతీయ శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్‌ను సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ 6న రద్దు చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే అది మరొక మెట్టు పురోగామి చర్య అవుతుంది. ఇప్పటికే 30 దేశాలు ఈ వివాహాన్ని చట్టబద్ధం చేశాయి.వాటిలో జర్మనీ, తైవాన్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఫిన్‌లాండ్, బ్రెజిల్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, స్వీడన్, నార్వే, దక్షిణాఫ్రికా వంటి దేశాలున్నాయి. కలిసి జీవించే తాము పిల్లలను దత్తత తీసుకొని పెంచి పెద్దవారిని చేయాలంటే తమ వివాహాలకు గుర్తింపు అవసరమని స్వలింగ సంపర్కులు వాదిస్తున్నారు. మారుతున్న కాలాన్ని బట్టి, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులను బట్టి సమాజ నియమాలు కూడా మారడమే మానవీయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News