హైదరాబాద్: డ్రగ్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న కేసులో సమీర్ ఆస్పత్రి చైర్మన్, డైరెక్టర్‌తోపాటు మరో ముగ్గురు నిందితులను రాజేంద్రరనగర్, ఎస్‌ఓటి, టిఎస్ నాబ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయగా వైద్యుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం…డ్రగ్స్ ఇంజక్షన్లు ఫెంటనేయిల్ సిట్రస్ ఇంజక్షన్లు వైద్య దంపతులు డ్రగ్స్‌కు బానిసగా మారిన వ్యక్తికి విక్రయిస్తున్నట్లు టిస్‌నాబ్ పోలీసులకు తెలిసింది. వెంటనే రాజేంద్రనగర్ ఎస్‌ఓటి, టిఎస్‌నాబ్ పోలీసులు ఫెంటనేయిల్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న వైద్యుడి ఇంటిపై దాడి చేశారు. మత్తు వైద్యులుగా సమీర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ ఆషాన్ ముస్తాఫా, అతడి భార్య లుబ్‌నా నజీబ్ ఖాన్‌ను అరెస్టు చేశారు. తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు బయటికి వచ్చాయి. దీంతో పోలీసులు ఆస్పత్రిపై దాడి చేసి ఆస్పత్రి చైర్మన్ సోయబ్ సుభాని,
డైరెక్టర్ ఎండి. అబ్దుల్ ముజీబ్, ఫార్మసిస్ట్ సయిద్ నసీరుద్దిన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎండి జాఫర్, డిస్ట్రిబ్యూటర్ గోపు శ్రీనివాస్ కలిసి ఫెంనేయిల్ ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఫెంటనేయిల్ ఇంజక్షన్లు విక్రయించేందుకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి, కాని సమీర్ ఆస్పత్రి వారు ఎలాంటి లైసెన్స్ లేకుండానే ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే అందరు కలిసి ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.57లకు కొనుగోలు చేసి రూ.5,000లకు విక్రయిస్తున్నారు. నిందితులు డాక్టర్ షేక్ సలీం సంతకాన్ని ఫోర్జరీ చేసి డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇంజక్షన్లను ఆర్డర్ చేసి విక్రయిస్తున్నారు. నిందితులు 100 ఇంజక్షన్లను కోనుగోలు చేసి అందులో 43 ఇంజక్షన్లను డ్రగ్స్ వాడుతున్న వారికి విక్రయించగా, 57 ఇంజక్షన్లను మత్తు వైద్యుడి భార్య వద్ద నుంచి రికవరీ చేశారు. కానీ వాటికి సంబంధించిన రోగుల వివరాలు ఆస్పత్రిలో నమోదు చేయలేదు. రాజేంద్రగనర్ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.