Friday, November 22, 2024

సమీర్ వాంఖడేను ఆర్యన్‌పై దర్యాప్తు నుంచి తప్పించిన ఎన్‌సిబి

- Advertisement -
- Advertisement -

Sameer Wankhede removed from investigation of drugs case

దర్యాప్తు ఢిల్లీ యూనిట్‌కు బదిలీ

ఇది ఆరంభం మాత్రమే : మహారాష్ట్ర మంత్రి నవాబ్‌మాలిక్

న్యూఢిల్లీ: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్‌సిబి) ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను క్రూయిజ్‌షిప్ డ్రగ్స్ కేసు దర్యాప్తు నుంచి తొలగించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆర్యన్‌ఖాన్‌కు విముక్తి కల్పించడం కోసం రూ.8 కోట్లు సమీర్ వాంఖడేకు ఇవ్వాల్సి ఉన్నదంటూ ఆరోపణలొచ్చిన విషయం తెలిసిందే. ఆర్యన్‌తోపాటు ఈ కేసులోని మరో ఐదుగురిపై దర్యాప్తు చేస్తున్న వాంఖడేను తప్పించి ఆ బాధ్యతను ఢిల్లీలోని ఎన్‌సిబి ఆపరేషన్స్ యూనిట్‌కు అప్పగిస్తున్నట్టు వాయువ్య ప్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్‌జైన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ఎన్‌సిబి డైరెక్టర్ జనరల్ ఎస్‌ఎన్ ప్రధాన్ జారీ చేశారని జైన్ తెలిపారు. ఢిల్లీ యూనిట్ శనివారం నుంచి దర్యాప్తు ప్రారంభిస్తుందని తెలిపారు. ముంబయి యూనిట్‌తో పరస్పర సహకారంతో పని చేస్తుందన్నారు.

ఎన్‌సిబిలోని సిట్ సీనియర్ అధికారి సంజయ్‌సింగ్‌కు ఆర్యన్ కేసుతోపాటు మరో ఐదు కేసుల్ని అప్పగించినట్టు తెలుస్తోంది. కేసుల దర్యాప్తును బదిలీ చేసినప్పటికీ జోనల్ డైరెక్టర్‌గా వాంఖడే కొనసాగుతారు. తాజా పరిణామంపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ స్పందించారు. ఇది ఆరంభం మాత్రమే. మరో 26 కేసుల్లోనూ దర్యాప్తు జరగాలన్నారు. వ్యవస్థను(ఎన్‌సిబిని) ప్రక్షాళన చేయడానికి ఎంతో జరగాల్సి ఉన్నదని మాలిక్ అన్నారు.

ఆర్యన్‌కు కేసు నుంచి విముక్తి కల్పించడం కోసం మొత్తం రూ.25 కోట్లు డిమాండ్ చేయగా, అందులో రూ.8 కోట్లు వాంఖడేకు ఇవ్వాలంటూ మధ్యవర్తులు చెప్పారని స్వతంత్ర సాక్షిగా ఉన్న ప్రభాకర్‌సాయిల్ ఆరోపించారు. మరోవైపు వాంఖడేపై నవాబ్‌మాలిక్ పలు ఆరోపణలు చేశారు. దాంతో, కేసు దర్యాప్తు బాధ్యతల నుంచి వాంఖడేను తప్పించినట్టు భావిస్తున్నారు. వాంఖడేపై వచ్చిన ఆరోపణలపై ఎన్‌సిబి అంతర్గత దర్యాప్తు జరుపుతోంది. అందుకు ఎన్‌సిబి డిప్యూటీ డైరెక్టర్ జ్ఞానేశ్వర్‌సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. మరోవైపు వాంఖడే నిష్కళంక అధికారి అంటూ ఎన్‌సిబి సమర్థించుకున్నది.

ఎన్‌సిబి ముందు హాజరైన ఆర్యన్

ముంబయి: ఆర్యన్‌ఖాన్ శుక్రవారం ఎన్‌సిబి అధికారుల ముందు హాజరయ్యారు. ఆర్యన్ తన న్యాయవాది నిఖిల్ మానేషిండేతో కలిసి దక్షిణ ముంబయిలోని ఎన్‌సిబి కార్యాలయానికి వైట్‌రేంజ్ రోవర్ కారులో వెళ్లారు. బాంబే హైకోర్టు ఆర్యన్‌తోపాటు మరో ఇద్దరికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా విధించిన 14 షరతుల్లో వారానికోసారి ఎన్‌సిబి ముందు హాజరు కావాలన్నది కూడా ఒకటి. 22 రోజులపాటు ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైలులో గడిపిన ఆర్యన్ అక్టోబర్ 30న విడుదలయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News