దార్ ఎస్ సలాం: టాంజానీయ దేశానికి తొలిసారిగా మహిళ అధ్యక్షురాలు అయ్యారు. సమియా సులూహ్ హసన్ శుక్రవారం దేశాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక స్టేట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖానికి ముసుగు ధరించి, చేతిలో ఖురాన్ పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఇబ్రహీం జుమవోవింగ్ ఈ కార్యక్రమం నిర్వహించారు. తాను దేశ రాజ్యాంగ విలువలను కాపాడుతానని ఈ సందర్భంగా నూతన అధ్యక్షురాలు ప్రతిన వహించారు. ఈ తూర్పు ఆఫ్రికా దేశపు అధ్యక్ష పదవికి ప్రమాణస్వీకార ఘట్టం కొవిడ్ నేపథ్యంలో అతి కొద్ది మంది సమక్షంలో జరిగింది. ప్రముఖులు మాస్క్‌లు పెట్టుకుని కార్యక్రమానికి వచ్చారు. ప్రెసిడెంట్ జాన్ మగుఫులి మరణించినట్లు రెండు రోజుల క్రితమే ప్రకటన వెలువడింది. టాంజానియాలో కొవిడ్ సమస్య పట్ల ఈ అధ్యక్షులు నిర్లక్ష ధోరణి వహించడం వివాదాస్పదం అయింది. పైగా దేశంలో అసలు ఈ సమస్యే లేదని కూడా ప్రకటించారు. ప్రార్థనలతో కరోనా మటుమాయం అయిందన్నారు. దీనిపై దుమారం చెలరేగింది. ఆ తరువాత రెండు వారాలుగా ఆయన బహిరంగంగా కన్పించకుండా పొయ్యారు.