తాడ్వాయి: ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం సమ్మక్క సారలమ్మ దేవత ప్రధాన పూజారుల్లో ఒకరైన సిద్ధబోయిన దశరథం (38) మంగళవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దశరథం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మేడారం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేసి చికిత్స చేస్తుండగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య విజయ, కుమారుడు అశ్విత్, కూతురు సాత్విక ఉన్నారు.
నాడు అన్న.. నేడు తమ్ముడు
10 నెలల క్రితం మృతుడి అన్న సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు అనారోగ్యంతో మృతి చెందాడు. కొద్ది నెలల్లోనే ఒకే ఇంట్లో ప్రధాన పూజారులు ఇద్దరూ మృతి చెందడంతో మేడారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మేడారంలో సమ్మక్క పూజారి సిద్ధబోయిన దశరథం మృతి వార్త తెలిసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. దశరథం చిన్న వయస్సులోనే అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని, ఆయన కుటుంబ సభ్యులకు వన దేవతలు సమ్మక్క సారలమ్మ దీవెనలు ఎప్పటికీ ఉంటాయని విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.