Thursday, December 19, 2024

సమ్మక్క అసలు చరిత్ర

- Advertisement -
- Advertisement -

మేడారంలో సమ్మక్క జాతర జరగని సంవత్సరం ఆమె తల్లిగారి ఊరు అయిన సిరిమల్లె (చిరుమళ్ళ)లో జాతర జరుగుతుంది. ఆమె తల్లిగారి వంశీయులైన చందావారు ఈ జాతర జరుపుతారు. ఈసారి జాతర జరుగుతున్న సందర్భంగా చందా లింగయ్య దొర (మాజీ ఎమ్మెల్యే, సమ్మక్క వంశీయులు) సమ్మక్క చరిత్ర అందరూ వక్రీకరిస్తున్నారని వాపోయి నాతో చెప్పిన సమ్మక్క నిజ చరిత్రను ఈ సందర్భంగా అందరి దృష్టికి తీసుకు వస్తున్నాను. కోయ, గోండు మీదలైన కోయతుర్ జాతులకు మొదటి దేవత మహారాష్ట్రలోని చందా/ చంద్రగిరిలో ఉన్న మాంకాళి కాగా, రెండో దేవత తెలంగాణలోఉన్న సమ్మక్క, మూడో దేవత చత్తీస్‌గఢ్‌లోని మావ్లీ / దంతేశ్వరి, నాలుగో దేవత ఒడిశాలోని గౌరి. సమ్మక్కది ద్రౌపది అంశ. ఆమెకు పంచ పాండవుల్లో సంవత్సరానికొకరితో సంసారం చేసేది. ఆమెకు భీముడు అంటే ఎక్కువఇష్టం.

అయినా, ఓ అర్ధరాత్రి ఆయన పక్కలో నుంచి లేచిపోయి ఓ గిరిజన జాతరకు హాజరై దున్నపోతును బలి ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చింది. భీముడు నిలదీయగా తన విశ్వ/శక్తి స్వరూపాన్ని చూపించింది. భీముడు ఆమె కాళ్ళు పట్టుకోగా ‘నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి వచ్చే జన్మలోనూ నువ్వు నా భర్తవై పుడుతావు’ అని వరమిచ్చింది. భీముడు జరాసంధునితో యుద్ధం చేసి ఓడించినప్పుడు జరాసంధుడు కూడా అతడి బలాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని మెచ్చుకొని భీముడుతో ‘వచ్చే జన్మలో నువ్వు నా కొడుకువై పుడుతావు’ అన్నాడు. జరాసంధుని వారసులు చత్తీస్‌గఢ్ లోని కొత్తపల్లి / పాలమొత్తలో నివసిస్తుండగా వారిలో ఒకరికి భీముడు ద్రౌపది, జరాసంధుడి వరాల / కోరికల ఫలితంగా పగిడిద్దరాజుగా పుట్టాడు. ఈ పగిడిద్దరాజుది భీముని అంశ కాబట్టి పాలమొత్తలోని కోయలు ఇప్పటికీ ముందు భీముని పూజ చేసిన తరువాతనే పగిడిద్దరాజు పూజ చేస్తారు. తెలంగాణలోని చిరుమళ్లకు చెందిన చందంబోయిరాలుకు సంతానం లేకపోతే ఒక శక్తి (పార్వత్రి) ని కొలిచేది. అయినా పిల్లలు కలుగకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది.

ఆ రాత్రి ఆమె కలలో శక్తి కనిపించి ఫలానా అడవిలో ఒక చెట్టు కింద మట్టి తవ్వితే ఒక పెట్టెలో ఒక పాప కనిపిస్తుంది. తెచ్చి పెంచుకో. ఆ తరువాత నీకు సంతానమవుతుంది అని చెప్పింది. అలా చందంబోయురాలు తెచ్చుకున్న పాపకు పంచాంగం చూపించి తేలిన మొదటి అక్షరం ‘స’ తో సమ్మక్క అని పేరు పెట్టింది. ఆ తరువాత ఆమెకు నాగులమ్మ పుట్టింది. ఇద్దరినీ ఒకే పురుషుడు పగిడిద్దరాజుకిచ్చి పెండ్లి చేశారు. సమ్మక్కకు, పగిడిద్దరాజుకు కూతురు సారలమ్మ పుట్టింది. సారలమ్మ పెరిగి పెండ్లీడుకు వచ్చిన తరువాత సమ్మక్క నిర్వహించిన స్వయంవరంలో ఎవరూ ఎంపిక కాకపోవడంతో ఆమె తన బిడ్డతో పాటు తన తల్లి చందంబోయురాలు ఇల్లు ఉన్న చిరుమళ్ళకు వచ్చింది. చిరుమళ్ళలో ఉన్నంత కాలం అందరికీ మంచి చేసి తన ముక్కు పోగు, కుంకుమ భరిణను చందా వారికిచ్చి తను సమీపంలో ఉన్న గుట్టపైకి వెళ్లి మాయమైంది. ఆ సమ్మక్క గుట్ట (మేడారం మీదగా) బయ్యక్కపేట వరకు కొనసాగుతుంది.

ఆ రెండు సమ్మక్క ఆనవాళ్ళను పూజిస్తూ సమ్మక్క – పగిడిద్దరాజుల పెండ్లి వేడుకలు చేసుకునే చందావారు (దాయాదులు) కొంత కాలానికి కొట్లాడుకొన్నారు. ఒక సోదరుడు భరిణతో బయ్యక్కపేటకు వలసపోయాడు. అక్కడ కొంతకాలం సమ్మక్క పెండ్లి వేడుకల సమయంలో చందావారికి నిజరూపంలో కనిపించేది. కాని కొంత కాలానికి వారు జాతర జరుపలేక (ఖర్చులు భరించలేక) తమ వడ్డెవారైన (పూజారులైన) సిద్ధబోయినవారికి ఇవ్వజూపారు. దాంతో కోపగించిన సమ్మక్కపై వారూ కోపగించుకొని భరిణను సిద్ధబోయినవారికి ఇచ్చేసి ఆ భరిణ, ఇతర సామాన్లను సాగనంపుతున్న రెండు ఎడ్ల బండ్లు పొలిమేర దాటగానే బయ్యక్కపేట కాలిపోయి ఐదు సంవత్సరాల దాకా చందావారికి అన్నం కూడా దొరకడం కష్టమయ్యింది. ‘మా తల్లిని మాకు ఇయ్యండి’ అని చందావారు అడిగిన క్రమంలో ఎనిమిది దశాబ్దాల కిందట సిద్ధబోయినవారికి, చందావారికి గొడవయి విషయం ఆనాటి నిజాం కోర్టు దాకా వెళ్ళింది.

కోర్టు వారు సిద్ధబోయిన వడ్డెలు 20 శాతం, చందావారు 20 శాతం, ప్రభుత్వం 60 శాతం ఆదాయం పంచుకోవాలని తీర్పిచ్చింది. చిరుమళ్ళ చందావారు ఒక యేడు, మేడారం సిద్ధబోయినవారు ఒక యేడు జాతర జరుపుకోవాలని కూడా అప్పుడే అంగీకారమయ్యింది. ఈ అంగీకారం మేరకు ఈయేడు చిరుమళ్ళ, కరకగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనవరి 31 నుండి ఫిబ్రవరి 4 వరకు సమ్మక్క జాతర జరుగుతుంది. జాతరలో భాగంగా 31 జనవరి 2023 మంగళవారం అర్ధరాత్రి వరకు గుడి మేలుకొలుపు జరుగగా, ఫిబ్రవరి 1 బుధవారం సమ్మక్క తల్లి దగ్గరికని చుట్టుపక్కల ఇలవేల్పులు (పడిగెలు, దైవిక సామాన్లు) డోలి చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా వస్తాయి. ఫిబ్రవరి 2 గురువారం నాడు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వనదేవత సమ్మక్క తల్లిని తీసుకొస్తారు. ఆమెకు ఎదుర్కోలు పలకడమే ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఆ రాత్రి ఒకటిన్నర గంటలకు సమ్మక్క – పగిడిద్దరాజుల పెండ్లి జాతర జరుగుతుంది. ఫిబ్రవరి 3 శుక్రవారం నాడు భక్తులు సమ్మక్కను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 4 శనివారంనాడు సమ్మక్కను తిరిగి గుట్టపైకి సాగనంపుతారు.

డా. ద్యావనపల్లి
సత్యనారాయణ
9490957078

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News