Monday, January 20, 2025

జంతుమేళా మాలేగాం జాతర

- Advertisement -
- Advertisement -

తమ తమ వృత్తి పనుల్లో తలమునకలయ్యే శ్రామిక జాతులు, వ్యవసాయ, కూలీ పనులతో తీరిక లేని జనసమూహాలు సేద తీరే చెలిమెలు జాతరలు. జనం మొక్కులు తీర్చుకొనే చిన్న గుడికి ఆనుకొని విశాలమైన మైదానాలున్న చోటల్లా జాతర స్థలాలుగా రూపుదిద్దుకున్నాయి. జంతువులను మేపుకుంటూ పొట్ట చేత బట్టుకొని తిరిగే సంచార జాతులు ఏడాదికో, రెండేళ్లకో ఓసారి కలుసుకొని తమ సాధకబాధకాలను, సుఖదుఃఖాలను పంచుకోవడానికి ఇవి నెలవులయ్యాయి. మూటాముల్లె సర్దుకొని, ఎడ్ల బండ్లపైనో, కాలినడకనో, కిక్కిరిసిన బస్సుల్లోనో అరకొర సౌలతులుండే జాతరకు వెళ్లడం ఇప్పటికీ ఓ సాంప్రదాయిక ఆచారంగా కొనసాగుతోంది. ఎక్కడివారక్కడే ఉండకుండా అప్పుడప్పుడైనా ఇలా ఒక చోట కలుసుకోవడం వల్ల మానవ ఆది సంస్కృతి నిలుస్తోంది అనవచ్చు. మన దేశంలో జరిగే వందలాది జాతరలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణకు సమ్మక్క జాతర ఒక అస్తిత్వ పతాక.మహారాష్ట్ర విషయానికొస్తే మాలేగాం జాతర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అన్ని జాతరల్లాగే గుడి, అటుగా వెళ్లే నాలుగు దారుల్లో చిన్న వ్యాపారాలే కాకుండా భారీ ఎత్తున రకరకాల పశువుల, జంతువుల ప్రదర్శన, అమ్మకాలు దీనికి వైవిధ్యాన్ని తెచ్చిపెట్టాయి.

వేల సంఖ్యలో గుర్రాలు, ఒంటెలు ఈ జాతరకు రావడం ఓ విశేషం. ఒకప్పుడు దక్షిణాది నుండి ఏనుగులు కూడా వచ్చేయట. ప్రతి సంవత్సరం మార్గశిర అమావాస్య నాడు మొదలై వారం పది రోజుల పాటు జాతర సాగుతుంది. ఈ రోజులు మామూలుగా డిసెంబర్ జనవరి మాసాల్లో వస్తుంటాయి. ఈ సంవత్సరం జనవరి 10 న మొదలై 14 వ తేదీన ముగిసింది. పేరుకు నాలుగు రోజులే అయినా జాతర మరింత కాలం కొనసాగుతూనే ఉంటుంది. మాలేగాం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోహ తాలూకాలో ఉంది. నాందేడ్ నుండి 60 కి.మీ. దూరంలో లాతూర్ హైవేపై ఉంటుంది. ఆ గ్రామంలో ఖండోబా దేవాలయం ఉంది. జనం ఖండోబా దర్శనం చేసుకొని జాతరలో పాల్గొంటారు. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్ నుండి యాత్రికులు అక్కడికి చేరుకుంటారు. తెలంగాణ గొల్లలు ఖండోబాను తమ మల్లన్న దేవుడిగా కొలుస్తారు. ఏటా లక్షకు తగ్గని సందర్శకుల తాకిడి ఉంటుంది. ప్రత్యేకంగా వైదు, కైకారి, పోతరాజు, మాసంజోగి, వడ్డెర, పార్థీ జాతుల ప్రజలు తెలంగాణ, మరట్వాడా, కర్ణాటక నుండి తప్పక వస్తుంటారు. రాజస్థాన్‌లోని పుష్కర్ మేళా తరవాత దేశంలో పశువుల ప్రదర్శన గల పెద్ద జాతర ఇదే.

మొదట పశుపెంపక సంచార జాతుల విడిదిగా మాలే గాం మైదానం ఉపయోగపడింది. అన్ని ఋతువుల్లో పచ్చగడ్డి లభించే ఆ ప్రాంతంలో వారికి కోరినంత కాలం గడిపే అవకాశం దొరికింది. ఒకసారి కదిలాక మళ్ళీ ఎప్పుడు అక్కడికి వచ్చేది ముందే అనుకునేవారు. గొల్లవాళ్ళు మేకలను, గొర్రెలను, ఒడ్డెరలు తమ గాడిదలకు, గుర్రాలకు కడుపారా మేత పెట్టేందుకు ఈ చోటును ఎంచుకొనేవారు. అలా కొంత కాలం అక్కడ గడిపే కుటుంబాలు కుల పంచాయతీలను కూడా అక్కడే నిర్వహించుకొనేవారు. అలా జన తాత్కాలిక నివాసాలు అక్కడ పెరిగిపోయాయి. అక్కడ అందుబాటులో ఉండే జంతువుల కొనుగోలు కోసం పరిసర గ్రామాల వాళ్ళు రావడం జరిగేది. అలా పెరుగుతూ వచ్చిన జంతువుల అంగడి సమీపాన ఖండోబా గుడి ఉండడంతో జాతరగా రూపుదిద్దుకుంది. సుమారు 300 ఏళ్ల చరిత్ర గల ఈ జాతర సమీప గ్రామంలోంచి పల్లకి ఊరేగింపు రాకతో మొదలవుతుంది. ఘనంగా సాగే ఈ ఊరేగింపును జనం పసుపు చల్లుతూ స్వాగతిస్తారు. పూర్తిగా ప్రభుత్వ నిర్వహణలో సాగే ఈ జాతర తొలి రోజు ఇలా మొదలై వివిధ ధాన్యాల, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనతో ముగుస్తుంది. రెండో రోజు జంతువుల ప్రదర్శన ఉంటుంది. ఇదే ఈ జాతరకు ప్రత్యేక ఆకర్షణ. గుర్రాలు, ఎద్దులు, ఆవులు,

బర్రెలు, గాడిదలు, ఒంటెలు, కుక్కలు, కోతులు, కోళ్లు, ఉడుతలు ఇలా రకరకాల ప్రాణులను ప్రదర్శిస్తారు. ఖరీదైన, అరుదైన జంతు జాతులను యజమానులు సొంత ఖర్చులతో ప్రదర్శనలో ఉంచుతారు. లక్షల రూపాయలు విలువ చేసే గుర్రాలను దూరదూరాల నుంచి ప్రదర్శన నిమిత్తం తెస్తుంటారు. హైదరాబాద్ నుండి కూడా గుర్రాలు ఈ ప్రదర్శనకు వెళుతుంటాయి. జంతువుల మధ్య పరుగు తదితర పందేలు ఉంటాయి. వీటికి నేర్పిన విద్యను ప్రదర్శిస్తారు. మూడో రోజు కుస్తీ పోటీలుంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల మల్లయోధులు ఇందులో పాల్గొంటారు.విజేతలకు బహుమతుంటాయి. చివరి రోజు సంప్రదాయిక కళలకు కేటాయించారు. మరాఠి సాంప్రదాయ నృత్యమైన లావని ఈ జాతరకు ఓ ప్రత్యేక ఆకర్షణ. లావని డ్యాన్సులో మహిళలే పాల్గొంటారు. తొమ్మిది గజాల చీర కట్టి చేసే ఈ నృత్యం సంగీత ప్రధానమైనది. వేగంగా మోగించే డోలు వాద్యానికి సరిపోయేలా నృత్యం చేయవలసి ఉంటుంది. మరాఠి నాటకాలు ప్రదర్షింపబడతాయి. సంగీత వాద్యాల కచేరి ఉంటుంది. చివరగా వివిధ పోటీల్లోని విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందజేస్తారు. ఇన్ని విధాల కార్యక్రమాలతో మాలేగాం జాతర ఓ సాంస్కృతిక ఉత్సవంగా నిర్వహింపబడుతోంది.

ఒంటెలు, గుర్రాలు, గాడిదల అమ్మకాలకు ఈ జాతర ప్రధాన కేంద్రం. వాటిని కొనాలనుకొనేవారు ఈ జాతరకు తప్పకుండ వస్తారు. రాజస్థాన్ నుండి రోజుల తరబడి నడిచి ఈ జాతరకు ఒంటెలు తెస్తారు. ఊర్లో పది వేలు పలికే ఒంటె ఇక్కడ పాతికవేల దాక అమ్ముడుపోతుంది. ఆగ్రా, జైపూర్, మథుర, బరేలి, పంజాబ్ ప్రాంతాల నుండి గుర్రాలు వస్తాయి. ఒక్కో వ్యాపారి వందకు పైగా గుర్రాలు తీసుకొస్తారు. గుర్రాలపైనే సుమారు 3 కోట్ల వ్యాపారం జరుగుతుంది. కథియవార్, మార్వారీ, అరేబియన్ తదితర జాతుల గుర్రాలు రావడం విశేషం. దేశ వ్యాప్తంగా ఉన్న అశ్వప్రియులు ఇక్కడికి వస్తుంటారు. జంతువుల కొనుగోలు సొమ్మును వాయిదాలుగా కూడా చెల్లించవచ్చు.వివిధ ప్రాంతాల నుండి భారీగా గ్రామీణ జనం రావడంతో ఈ జాతరలో చేతివృత్తుల ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది. విశ్వకర్మలు చేసే అన్ని రకాల వ్యవసాయ పని ముట్ల వ్యాపారానికి అనువైన స్థలమిది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బాసటగా నిలిచే ఈ జాతర ఎన్నో కుటుంబాలకు ఏడాది గ్రాసం సంపాదించి పెడుతుంది. జాతర అంటేనే ఎన్నో ఆటపాటల, ఉల్లాసాల, ఆనందాల కోలాహలం, ఏడాది పాటు సరిపోయే సంబరాల జ్ఞాపకం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News