దేశమాతృ గౌరవాన్నికాపాడే సమున్నత ఆశయ సాధనకోసం జీవితాలను త్యాగం చేసిన సమ్మక్క, సారలమ్మలను దైవాంశ సంభూతులుగా ఎంచి, ఉత్తర తెలంగాణ జానపదులు తమ ఆరాధ్యదైవాలుగా కొలవడం సదాచారంగా మారింది. దాదాపు 900 సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన వన దేవతల జాతర పూర్తిగా గిరిజన సాంప్రదాయంలోనే సాగుతుంది. అయితే గిరిజనులే కాక, గిరిజనేతరులు సైతం గద్దెలెక్కిన దేవతలను కొలవడం వంశపారంపర్య ఆచరణగా కొనసాగుతున్నది.
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సమ్మక్క- సారలమ్మ మేడారం జాతర ప్రతి రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల సంబంధిత జాతర వేడుకలు వరుసగా ఒక ఏడు పెద్ద, మరో ఏడు చిన్న జాతరల కార్యక్రమాలు ప్రతి ఏటా జరుగుతాయి. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతరలో అధిక సంఖ్యాకులయిన సాంప్రదాయ భక్తులు పాల్గొనడం వంశ పారంపర్య, సనాతన సంప్రదాయ ఆచరణ.
లక్షలాది మందిని ఆకర్షించే మేడారంలో గురువులు లేదా స్వామీజీల లాంటి వారు, మహిమాన్వితులుగా భావించబడే వారు ఎవరూ ఉండరు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కేవలం ఒకనాడు నిరక్షరాస్యులుగా, నేడు ప్రాపంచిక విషయాలపై అవగాహన ఉన్నట్లు కనిపించే గిరిజన పూజారులు మాత్రమే ఉంటారు. పరాధీనులు కావడానికి అంగీకరించక, తల ఒగ్గక, లక్ష్యం కోసం ఆత్మార్పణం గావించిన సమ్మక్క, సారలమ్మలను దైవాలకు ప్రతిరూపాలుగా భావించే గిరిజనులు, సంప్రదాయ ఆచారాసక్తులు వనదేవతల జాతరకు శతాబ్దాలుగా శ్రమకోర్చి పిల్లాపాపలతో తరలివెళ్ళడం వెనుక కోట్లాదిమంది భక్తుల మొక్కవోని విశ్వాసం ఉంది. మొదటిసారి మేడారంలో సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేవారు తప్పనిసరిగా మరుసటి జాతరకు వస్తారని, దీనికి కారణం ఒకసారి దర్శనం చేసుకున్న వారికి కోరిన కోర్కెలు తీరడం, అటుంచి మానసిక ప్రశాంతత, తమలో ఏదో తెలియని కొత్త చైతన్యం రావడమేనని అనుభవజ్ఞులైన భక్తుల భావన.
మేడారం జాతర గిరిజన సాంప్రదా యాలకు ప్రతీక. సంస్కృతి ప్రియు లకు నిజమైన పండుగ. సామూ హిక భాగస్వామ్యానికి వేదిక. పూన కాలతో ఊగిపోయే శివసత్తులు, సంప్రదాయ వంశపారంపర్య ఆచరణలో భాగంగా జాతరకు ముందునుండే ఏర్పాట్లలో నిమగ్నమై ఉండడం, ముందుగానే ఎన్ని అసౌకర్యాలున్నా గుడారాలు వేసుకొని వేచి ఉండడం, నిలువెత్తు బంగారం (బెల్లం) తో రావడం, జంపన్న వాగులో స్నానాలు, వాయిద్యాల విన్యాసాలు, నిరంతర జంతుబలులు, అమ్మవార్లకు మొక్కులు కలగలిపి మేడారం జాతర గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దమై నిలుస్తున్నది. దేశవిదేశీ సందర్శకులను, భక్తులను, యాత్రికులను, చారిత్రక పరిశోధకులను, ఫోటో గ్రాఫర్లను, జర్నలిస్టులను ఈ జాతర ఎంతగానో ఆకర్షిస్తున్నది.
రుజువుకు అందనంత ప్రాచీనకాలం నుండి మేడారం జాతరకు ఎడ్లబండ్లపై రాకపోకలు ప్రధానంగా జరిగేవి. ఎడ్ల బండ్ల ద్వారా జంపన్న వాగులో నుండి మేడారం చేరుకోవాలనేది స్థానిక గిరిజనుల సాంప్రదాయ ఆచరణ.
అయితే, 1996 నుండి జంపన్న వాగుపై భక్తుల స్నానాలకు అనువుగా స్నాన ఘట్టాలు వాగు పొడవునా నిర్మించడంతో జంపన్న వాగు దాటడానికి అనువుగా లేకపోవడం కారణంగా ఎడ్లబండ్ల సంఖ్య 90% తగ్గింది. అయినా కొందరు పాత పద్ధతిలోనే, ప్రస్తుతం వందల సంఖ్యలో మాత్రమే ఎడ్ల బండ్లపై జాతరకు వస్తున్నారు. మొట్ట మొదటి సారిగా 1998లో నాటి అవిభక్త రాష్ట్ర ప్రభుత్వం మేడారంతో పాటు పరిసర గ్రామాలలో కూడా అంతర్గత బిటి, సిసి రోడ్ల నిర్మాణాలను చేపట్టడంతో దుమ్ములేసే అవకాశం గణనీయంగా తగ్గింది. ఇటీవలి కాలం లో కోట్లాది రూపాయల నిధులతో సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వ కృషి జరిగిన క్రమంలో, రెండేళ్ల కోసారి జరిగే జాతర సమయంలో వచ్చే భక్తులు మేడారానికి రవాణా మార్గాలు కూడా మెరుగవడంతో తాము అనుకున్నపుడు, ఎప్పుడంటే అప్పుడు వెళ్లి సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనాలు చేసుకుంటున్నారు. గోదావరిపై వంతెనల నిర్మాణంతో పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
విస్తృతమైన సోషల్ మీడియా ద్వారా మేడారం జాతర ప్రపంచ వ్యాపితం అయింది. గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరను ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నిర్వహించేందుకు కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ఘనంగా జరుగనుంది. జాతరలో భాగంగా నాలుగు రోజులపాటు వివిధ కార్యక్రమాలను అర్చకులు నిర్వహించనున్నారు.
నాలుగు రోజులలో ఏరోజు ప్రత్యేకత ఆ రోజుకు ఉంది. ఉత్తర తెలంగాణ నుండి అధిక సంఖ్యాకులైన భక్తులు ఈ జాతరకు సనాతన సంప్రదాయ వారసత్వ ఆచారంలో భాగంగా క్రమం తప్పకుండా వెళ్లడం పరిపాటి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. ఈసారి ఫిబ్రవరి 12, 13, 14, 15వ తేదీలలో సమ్మక్క సారక్క మినీ మేడారం జాతర నిర్వహించేందుకు ఆదివాసీ పూజారులు వారం రోజుల ముందే ఆదివాసీల ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ కుంభమేళ మేడారం మహా జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది.
అయితే మహా జాతర జరిగిన మరుసటి యేట ఆదివాసీలు పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆదివాసీల పండుగ మినీ జాతరగా ప్రాశస్త్యంలోకి వచ్చింది. బుధవారం రోజున మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు, ఆలయాలతో ఊరుకట్టు నిర్వహించి, ఆలయాలను శుద్ధి చేసి సంప్రదాయబద్ధంగా పూజలు చేయడం ఆనవాయితీ. ఫిబ్రవరి 12న మండ మెలిగే పండుగ, 13వ తేదీన సారలమ్మ అమ్మవారి గద్ద్దె, 14వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి చేసి సమ్మక్క -సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు. మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు. కానీ, గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. దీంతో మహా జాతర సమాప్తమవుతుంది.
రామకిష్టయ్య సంగనభట్ల 9440595494