న్యూఢిల్లీ: పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం భారత్‌కు సరఫరా చేసే ఎస్-400 క్షిపణి వ్యవస్థలపై మాత్రం ఉండబోదని రష్యా బుధవారం స్పష్టం చేసింది. రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ బుధవారం నాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ జాతీయ కరెన్సీల ద్వారా వ్యాపారం జరుపుకోవడానికి గతంలో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాన్ని ప్రస్తావించారు. ఎస్-400 ఒప్పందానికి సంబంధించి ఎటువంటి ప్రభావం ఉండబోదని, అది నూరు శాతం అమలవుతుందని ఆయన చెప్పారు. ఇక ఇతర వాణిజ్య, ఆర్థిక సహకారానికి సంబంధించి రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం ఎలా ఉండబోతుందో వేచి చూడాలని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌పై సైనిక చర్య చేపట్టిన రష్యాపై పశ్చిమ దేశాలు గత కొద్ది రోజుల్లో అనేక ఆంక్షలను విధించాయి. కాగా..2018 అక్టోబర్‌లో ఐదు యూనిట్ల ఎస్-400 డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్స్ కొనుగోలు కోసం రష్యాతో భారత్ 5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు.