Friday, April 25, 2025

ఇసుక దళారులకు ప్రభుత్వం చెక్

- Advertisement -
- Advertisement -

ధరలు పెంచకుండా టిజిఎండిసి పక్భందీగా చర్యలు
ఓఆర్‌ఆర్‌కు దగ్గరలో నాలుగు ఇసుకబజార్‌లు
అందుబాటులో 1,78,000 మెట్రిక్ టన్నుల ఇసుక
సన్న ఇసుకకు రూ.1800లు, దొడ్డు ఇసుకకు రూ.1,600లు
10 రోజుల్లో సుమారుగా 5 వేల మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయం

మనతెలంగాణ/హైదరాబాద్: ఇసుక దళారులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. దళారులు ధరలు పెంచకుండా టిజిఎండిసి పక్భందీగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఓఆర్‌ఆర్‌కు దగ్గరలో నాలుగు ఇసుకబజార్‌లను అండుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నాలుగు ఇసుకబజార్‌లలో ప్రస్తుతం 1,78,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఈ ఇసుకబజార్‌లలో సన్న ఇసుక రూ.1,800లు (ఒక మెట్రిక్ టన్నుకు), దొడ్డు ఇసుకకు రూ.1,600లు (ఒక మెట్రిక్ టన్ను) ధరను నిర్ణయించడంతో బిల్డర్‌లు, ప్రజలు ఇక్కడి నుంచి ఇసుకను కొనుగోలు చేయడానికి ఆస్తకి చూపుతున్నారు. ఈ ఇసుక బజార్‌లను ప్రారంభించిన 10 రోజుల్లోనే సుమారుగా 5 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను టిజిఎండిసి విక్రయించడం విశేషం.

గతంలో ఇసుకను కొనాలంటే వేరే జిల్లాల నుంచి లారీల్లో ఇసుకను తెప్పించుకునేవారు. 25 టన్నుల ఇసుక లారీకి రూ.25 వేల నుంచి రూ.30 వేల ధర చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఇసుకబజార్‌లు అందుబాటులోకి రావడంతో ప్రజలకు, బిల్డర్‌లకు రవాణా చార్జీలు మిగలడంతో పాటు దళారులు ధరలు పెంచకుండా కట్టడి చేసినట్టయ్యింది. మాములుగా ప్రతి వర్షాకాలంలో కొన్ని ఇసుకరీచ్‌లను మూసివేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మెట్రిక్ టన్ను ఇసుకను దళారులు రూ.2 వేల నుంచి రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇసుకబజార్‌లను అందుబాటులోకి తీసుకురావడంతో చాలావరకు దళారులకు చెక్ పడినట్టుయ్యిందని ప్రజలు పేర్కొంటున్నారు.

ఆదిభట్లలో అధికంగా ఇసుక

ప్రస్తుతం అబ్ధుల్లాపూర్‌మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేట, ఆదిభట్లలో ఇసుక బజార్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం అబ్ధుల్లాపూర్‌మెట్‌లో 5 ఎకరాల్లో ఈ ఇసుకబజార్‌ను అందుబాటులోకి తీసుకురాగా, ఇక్కడ ప్రస్తుతం సన్న ఇసుక (13,950 మెట్రిక్ టన్నులు) దొడ్డు ఇసుక (21,662 మెట్రిక్ టన్నులు) అందుబాటులో ఉంది. ఇక, వట్టినాగులపల్లిలో 5 ఎకరాల్లో ఇసుక బజార్‌ను ఏర్పాటు చేయగా ప్రస్తుతం ఇక్కడ సన్న ఇసుక (19,721 మెట్రిక్ టన్నులు) దొడ్డు ఇసుక (21,000 మెట్రిక్ టన్నులు) అందుబాటులో ఉంది. దీంతోపాటు బౌరంపేటలో 8.13 ఎకరాల్లో బజార్‌ను ఏర్పాటు చేయగా ఇక్కడ సన్న ఇసుక (20,736 మెట్రిక్ టన్నులు), దొడ్డు ఇసుక (18,621 మెట్రిక్ టన్నులు), ఆదిభట్లలో 5.13 ఎకరాల్లో ఈ బజార్‌ను ఏర్పాటు చేయగా ఇక్కడ సన్న ఇసుక (30,580 మెట్రిక్ టన్నులు), దొడ్డు ఇసుక (31,958 మెట్రిక్ టన్నులు) అందుబాటులో ఉందని టిజిఎండిసి అధికారులు తెలిపారు.

త్వరలోనే శామీర్‌పేట్, ఘట్‌కేసర్‌లలో ఇసుక బజార్‌లు

దీంతోపాటు త్వరలో శామీర్‌పేట్, ఘట్‌కేసర్‌లలో కూడా ఇసుకబజార్‌లను టిజిఎండిసి త్వరలోనే ప్రారంభించనుంది. ఇక్కడ కలెక్టర్‌లు భూమి కేటాయించగానే అవి ప్రజలకు అందుబాటులో రానున్నాయని టిజిఎండిసి అధికారులు తెలిపారు. ఈ నాలుగు ఇసుక బజార్‌లలో విక్రయించే ఇసుకను నల్లగొండ, కొత్తగూడెం రీచ్‌ల నుంచి టిజిఎండిసి అధికారులు ఇక్కడకు తరలిస్తున్నారు. ప్రతిరోజు 200 వాహనాలు ఆయా రీచ్‌ల నుంచి ఇసుకబజార్‌లకు ఇసుకను తీసుకొస్తుంటాయి. ఈ వాహనాలను జిపిఎస్ సిస్టంను అమర్చడంతో పాటు వాహనాలు రీచ్‌ల దగ్గర బయలుదేరే సమయం, ఇక్కడకు వచ్చే సమయాన్ని కచ్చితంగా నమోదు చేసి అవినీతి జరగకుండా టిజిఎండిసి అధికారులు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News