హైదరాబాద్: అర్జున్ రెడ్డి వంటి సెన్సెషనల్ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్‌ను ఏర్పర్చుకున్నారు సందీప్ రెడ్డి వంగా. ఇక 2023లో వచ్చిన యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకన్నారు. అయితే సందీప్‌కి కాంట్రవర్సీలు కొత్తేం కాదు. ఆయన చాలా సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకున్నారు.
తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. యానిమల్ సినిమాపై కామెంట్ చేసిన ఓ ఐఎఎస్ అధికారికి ఆయన సవాల్ విసిరారు. వికాస్ దివ్యకీర్తి అనే ఐఎఎస్ అదికారి యానిమల్ సినిమాపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి సినిమాలు మనల్ని పది సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్తాయంటూ ఆయన అన్నారు. సినిమాలో హీరో జంతువులా ప్రవర్తించడాన్ని ఆయన తప్పుబట్టిన ఆయన కేవలం డబ్బు కోణంలోనే ఆలోచిస్తూ.. విలువలను పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు.
అయితే దీనిపై సందీప్ ధీటుగా స్పందించారు. ఐఎఎస్ అధికారి తానేదో నేరం చేసినట్లు మాట్లాడారని సందీప్ తెలిపారు. ఇలా ఎవరైనా అనవసరంగా తన సినిమాపై దాడి చేస్తే కోపం వస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లి.. ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేరి రెండు, మూడు సంవత్సరాలు కష్టపడితే ఐఎఎస్ కావొచ్చు కానీ.. దర్శకుడి, రచయితగా మారడం అంత సులువు కాదని సందీప్ పేర్కొన్నారు. 1500 పుస్తకాలు చదివితే ఐఎఎస్ అవుతారేమో కానీ, దర్శకుడు, రచయిత కావాలంటే.. ఏ కోర్సు, ఏ టీచర్ ఉండదని ఆయన తెలిపారు.