మంగోలియాలో 341 మంది గల్లంతు
బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్‌లో సోమవారం ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. దాదాపు దశాబ్దం తరువాత ఇంత తీవ్రమైన తుపాన్‌ను ప్రజలు చూస్తున్నారు. ఉత్తర చైనాలో చాలా ప్రాంతాలు ఇసుక తుపాన్‌తో ఆవరించాయి. కిలోమీటరు దూరంలో ఏమీ కనిపించడం లేదు. దాంతో అనేక విమాన సర్వీసులను రద్దు చేశారు. దీనికి వాయు కాలుష్యం తోడవడంతో కాలుష్య రేణువులు క్యూబిక్ మీటరుకు 2000 మైక్రోగ్రాముల వంతున పెరిగాయి. తుపాన్లు, పెనుగాలుల వల్ల ఉత్తర చైనా లోని మంగోలియా రీజియన్‌లో ఈ ఇసుక తుపాన్ ప్రారంభమై హెబెయి ప్రావిన్‌కు అక్కడ నుంచి బీజింగ్‌కు విస్తరించిందని నేషనల్ మెటెయొరలాజికల్ సెంటర్ వెల్లడించింది. ఇసుక తుపాను కారణంగా స్కూళ్లు, క్రీడాకార్యక్రమాలు రద్దు చేశారు. మంగోలియాలో కనీసం 341 మంది గల్లంతయ్యారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. వారి కోసం అధికార యంత్రాంగం గాలింపు చేపట్టింది. శ్వాసకోశ సమస్యలున్న వారు ఇల్లు విడిచి బయటకు రాకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. ఈశాన్య ప్రాంతంలోని ఆల్‌క్సా లీగ్, ఆర్డోస్, బావోటొవో నగరాలు కూడా దెబ్బతిన్నాయని ప్రభుత్వ సమాచారం తెలియ చేసింది.