రైతుకు బేడీలు వేసిన ఘటనలో సంగారెడ్డి జైలర్ సంజీవరెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డిజి సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై ఐజి సత్యనారాయణ విచారణలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో హుటాహుటిన సంగారెడ్డి వెళ్లి విచారణ జరిపిన ఐజి సత్యనారాయణ అక్కడ మీడియాతో మాట్లాడారు. విచారణ ఖైది హీర్యా నాయక్‌ను లగచర్ల రైతుగా పేర్కొనకుండా బాలానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఒక కేసులో నిందితుడిగా చూపడం వల్లనే అతనికి బేడీలు వేసినట్లు బయటపడిందని ఐజి తెలిపారు. ఈ ఘటనలో జైలు అధికారుల తప్పిదం అడుగడుగునా కనిపించిందని ఆయన పేర్కొన్నారు.
గుండెనొప్పి అని చెబితే బెయిల్ వస్తుందని హీర్యా నాయక్‌కు లగచర్ల ఘటనలో ఎ2 నిందితుడు సురేష్ తప్పుదోవ పట్టించినట్టు తేలిందని ఐజి తెలిపారు. సదరు సురేష్ ఇంకా ఎవరెవరితో మాట్లాడిన విషయంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా పొరపాటు చేశారా? లేక పొరపాటుగా ఇది జరిగిందా? అనే కోణంలో విచారణ జరపగా పై విషయాలు బయటపడ్డాయన్నారు. విచారణ ఖైదీలను ఆసుపత్రికి తీసుకెళ్లే సమాచారాన్ని అటు వికారాబాద్ పోలీసులకు గానీ, సంగారెడ్డి పోలీసులకు గానీ సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ పోలీసులకు తెలియజేయడం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరిపినప్పుడు పై విషయాలు బయటపడ్డాయని ఐజి సత్యనారాయణ వెల్లడించారు.