Friday, December 20, 2024

ముస్లిం వ్యతిరేక నిందలు, నిజాలు!

- Advertisement -
- Advertisement -

Muslim rally

‘2029 ఎన్నికలలో ఒక ముస్లిం దేశ ప్రధాని అవుతాడు” హిందువులారా బహుపరాక్, జాగ్రత్త పడండి, హిందూమతాన్ని రక్షించుకోండి ఇలాంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వీటిని చేసేది సంఘపరివార్ లేదా హిందూత్వ శక్తులు అన్నది స్పష్టం. వీరు ఇంకా చెప్పిందేమిటి? హిందువులు విశాల దృక్ప ధం కలిగినవారు కనుకనే ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారు రాష్ర్టపతులుగా ఎన్నికయ్యారు, అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో హిందువులెవరైనా ఉన్నత పదవులు అధిరోహించారా చూడండి అని ప్రచారం చేశారు. మరి వీరే 2029 లో ఒక ముస్లిం ప్రధాని అవుతారంటూ ఎందుకు రెచ్చగొడుతున్నట్లు ? ఈ ప్రచారానికి ప్రాతిపదిక, లక్ష్యం ఏమిటి? ఇప్పటికే దేశంలో జకీర్ హుసేన్, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, అబ్దుల్ కలావ్‌ు అజాద్ రాష్ర్టపతులుగా పని చేసినపుడు అదే సామాజిక తరగతికి చెందిన వారు ప్రధాని అయితే వచ్చే ముప్పు ఏమిటి? రాష్ర్టపతులుగా పని చేసిన వారు హిందూ మతానికి లేదా సమాజానికి చేసిన హాని ఏమిటో ఎవరైనా చెప్పగలరా?
మన దేశంలో రెచ్చగొడుతున్న హిందూత్వ జాతీయవాదం ముస్లిం, క్రైస్తవ వ్యతిరేకతను, ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నది. దాని లో భాగమే 2029లో ముస్లిం ప్రధాని అనే ప్రచారం. ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ డెమొగ్రాఫిక్ రిసర్చ్’ అనే సంస్ధ సర్వే లేదా విశ్లేషణ వెల్లడించిన సమాచారం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని సామాజిక మాధ్యమంలో వీడియోలు, పోస్టుల రూపంలో గత కొద్ది సంవత్సరాలుగా చూస్తున్నాము. వాటి ప్రకారం 2041 నాటికి దేశం లో ముస్లిం జనాభా 84 శాతానికి పెరుగుతుందట. ముస్లిం జనాభా పెరుగుదల తీరుతెన్నులను పేర్కొంటూ 1948లో 6, 1951లో 9.8, 2011లో 22.6, 2017లో 27.1 ఉందని, 2021లో 32.8, 2031లో 38.1, 2037లో 43.6, 2040లో 66.9, 2041లో 84.5 శాతానికి పెరుగుతుందని, అప్పటికి హిందువుల జనాభా 11.2 శాతంగా ఉంటుందని సదరు సంస్ధ అంచనా వేసినట్లు చెబుతూ ఇంకే ముంది హిందువులు అంతరించిపోతారంటూ రెచ్చగొడుతూ ప్రచారం సాగుతోంది.

Hindu nationalism could breakup india

గత వంద సంవత్సరాలుగా హిందూత్వ శక్తులు నాటుతున్న విషబీజాలు ఇప్పుడు మర్రి ఊడల్లా విస్తరిస్తున్నాయి. నిరంతరం అదే పనిగా ఇలాంటి ప్రచారం కొనసాగుతుండటంతో జనాల్లో ఏమో అనే అనుమానం తలెత్తి దాన్ని నివృ త్తి చేసుకోకుండానే అనేక మంది నిజమే అని నమ్ముతున్నారు. దాంతో విద్వేష ముఠాలు తమ ఉత్పత్తులతో వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాలను ముంచి వేస్తున్నాయి.

వాస్తవం ఏమిటి? మన జనాభా లెక్కల ప్రకారం 1951లో 84.1 శాతంగా ఉన్న హిందువులు 2011లో 78.35 శాతంగా ఉండగా, ఇదే కాలంలో ముస్లింలు 9.8 నుంచి 14.2 శాతానికి మాత్రమే పెరిగారు. నాలుగు దశాబ్దాల్లో పెరిగింది 5.4 కాగా, వచ్చే నాలుగు దశాబ్దాల్లో 70 శాతం ఎలా పెరుగుతారు? అమెరికా పరిశోధనా సంస్ధ ‘పూ’ వేసిన అంచనా ప్రకారం 2050 నాటికి మన దేశంలో ముస్లిం జనాభా 18.4 శాతం ఉంటుంది. ఇంతకీ అసలు విషయం ఏమంటే గజం మిథ్య అన్నట్లుగా అసలు సదరు ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ డెమోగ్రాఫిక్ రిసర్చ్’ అనే సంస్ధ ఉనికిలోనే లేదని గూగుల్ తల్లి చెప్పినట్లు 2019లోనే ఫాక్ట్‌లీ డాట్ ఇన్ అనే సంస్ధ ప్రతినిధి వెల్లడించారు.

అందువలన హిందూమతానికి వచ్చిన ముప్పు అన్నది కూడా అవాస్తవం.ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పట్టుకొని ప్రచారం చేసే సాధ్వులు, యోగులు చెప్పేది పచ్చి అబద్ధాలే. బిజెపి ఎంపిలు పార్లమెంటులో జనాభా నియంత్రణ బిల్లులను ప్రవేశపెట్టినా, వాటి గురించి ప్రచారం చేసినా ప్రచారదాడిలో భాగమే తప్ప మరొకటి కాదు. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేయకూడదనే ప్రచారం, ఉత్తరప్రదేశ్, అసోం బిజెపి ప్రభుత్వాల బిల్లులు ముస్లింలను లక్ష్యంగా చేసుకొనే అన్నది తెలిసిందే. ఒకవేళ అవి చట్టరూపం దాల్చితే 80 శాతంగా ఉన్న హిందువులే ఎక్కువ నష్టపోతారు. సాధ్వి రితంబర వంటి వారు ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కని ఇద్దర్ని ఆర్‌ఎస్‌ఎస్ లేదా భజరంగదళ్‌కు ఇవ్వాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దర్ని ఏం చేస్తారు, వారితో ఏమి చేయిస్తారు? బిజెపి విధానాలను, హిందూత్వను వ్యతిరేకించే వామపక్ష, లౌకిక వాదులు, ఇతర మతాలవారి మీద దాడి చేసే మూకలుగా తయారు చేస్తారా?

‘బిజెపి ఇంకొక దశాబ్దం దేశాన్నేలితే ఏదో ఒక రోజు చంద్రుడిపై త్రివర్ణ పతాకం, కానీ కాంగ్రెస్ వచ్చిందా జెండాపై రంజాన్ చంద్రు డే గతి, ఎప్పటికీ గుర్తుంచుకో!’ అంటూ మరొక ప్రచారం జరుగుతున్నది. ఇదీ ముస్లిం విద్వేష ప్రచారంలో భాగమే అన్నది స్పష్టం. ఒక వైపు దేశంలో ముస్లిం జనాభా పెరిగి హిందువులు మైనారిటీగా మారనున్నారనే ప్రచారం చేస్తూనే అదే శక్తులు మరోవైపు చేస్తున్న ప్రచారాన్ని చూద్దాం. ‘కొన్ని దశాబ్దాలుగా ఎన్నో విష జంతువులు ఉన్న కాంగ్రెస్ అనే పెద్ద మర్రి చెట్టును మోడీ పెకలించి వేస్తున్నాడు’ మార్క్‌తులి అనే బిబిసి మాజీ విలేకరి ఈ ప్రకటన ఇచ్చాడు అని అదే పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టు సారం ఏమంటే విష సర్పాలన్నింటికీ మోడీ పొగపెట్టారు గనుక అవి దేశం మీద పడ్డాయి. వాటిని జనాలకు చూపి మోడీ అప్రమత్తం గావించటం మంచిదైంది. లేకపోతే అవి ఈ భారత భూమిని, హిందువులను మింగివేసేవి. మోడీ భవిష్యత్ తరాల మత మార్పిడులకు అడ్డుకట్ట వేశారు. మోడీ చాలా కష్టపడాలి, పడతారు కూడా.అయితే ఈ దేశ ప్రజలంతా ముఖ్యంగా హిందువులంతా నరేంద్ర మోడీకి అండగా నిలవాలి అని పేర్కొన్నారు.

ఒక పోస్టులోనేమో ముస్లింలు మెజారిటీగా మారనున్నారని భయపెడతారు, మరో పోస్టులో హిందూమత రక్షకుడుగా నరేంద్రమోడీ వచ్చినట్లు, ముప్పు తప్పించినందుకు మద్దతు ఇవ్వాలని చెబుతారు. ముస్లిం జనాభా పెరుగుదల గురించి ఉనికిలో లేని సంస్ధ పేరు చెప్పి జనాలను తప్పుదారి పట్టించినట్లుగానే మార్క్‌తులి పేరు చెప్పి మరో పచ్చి అబద్ధం ప్రచారంలో పెట్టారు. నరేంద్ర మోడీకి అనుకూలంగా కొన్ని అంశాలను రాసి అవి మార్క్‌తులి పుస్తకంలోనివిగా పేర్కొంటూ గత 5 సంవత్సరాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక దేశంలో ముస్లింల జనాభా పెరుగుతోందన్న ప్రచారం గురించి నిజానిజాలేమిటో చూద్దాం. 2002 గుజరాత్ మారణ కాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య ఏమిటి? ‘నేనేం చేయాలి?వారికి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలి, పిల్లల్ని కనాలని మనం కోరుకుందామా?’2017లో బిజెపి ఎంపి సాక్షి మహరాజ్ మీరట్ సభలో మాట్లాడుతూ ‘నలుగురు భార్యలు, 40 మంది పిల్లలను కలిగి ఉండేవారే దేశంలో జనాభా పెరుగుదలకు కారకులు, హిందువులను నిందించకూడదు. మన మతాన్ని సంరక్షించుకొనేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి’ అని చెప్పారు.

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడిగా పని చేసిన ప్రవీణ్ తొగాడియ గుజరాత్‌లోని హరుచ్ జిల్లా జంబుసర్‌లో మాట్లాడుతూ ఇలా సెలవిచ్చారు.“హిందూ పురుషులూ ఇంటికి వెళ్లి మీ పురుషత్వాన్ని ఆరాధించండి. అప్పుడు హిందువుల జనాభా పెరుగుతుంది. హిందువులందరూ ఎక్కువ మంది పిల్లల్ని కనండి.’ ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ మాట్లాడుతూ ముస్లింలు, హిందూ డిఎన్‌ఎ ఒకటే అని చెప్పారు.కానీ అదే పెద్ద మనిషి అంతకు ముందు ఒకసారి ఏమన్నారు. “ఇతరుల జనాభా పెరుగుతున్నపుడు హిందువుల జనాభా పెరగకూడదని ఏ చట్టం చెప్పింది’ అని ప్రశ్నించారు. ఆరెస్‌ఎస్ మరో నేత దత్తాత్రేయ హో సబలే ‘చిన్న కుటుంబం నియమాలు హిందువులకు పెద్ద ముప్పుగా ఉన్నాయి. కనుక ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలి. ఒక సమాజం గుడ్డిగా కుటుంబ నియంత్రణ పాటిస్తే దేశానికి జరిగే మంచేమీ ఉండదు. అది దేశంలో తీవ్ర అసమానతలకు దారితీస్తుంది.’ అన్నారు. 2018లో రాజస్తాన్ బిజెపి ఎంఎల్‌ఎ బన్వారీలాల్ సింగ్ సింఘాల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ 2030 నాటికి ముస్లింల జనాభా పెరిగి హిందువులు ప్రమాదంలో పడతారని రెచ్చగొట్టారు. హిందువులు ఒకరిద్దరికి పరిమితం అవుతుంటే ముస్లింలు 12 14 మందిని కంటున్నారని ఆరోపించారు.

దేశంలో ఇప్పుడున్న స్ధితి ఏమిటి? 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29 చోట్ల హిందువులే మెజారిటీ. లక్షద్వీప్‌లో లక్ష మంది, జమ్ముకశ్మీరులో కోటీ 30క్షల మంది ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ముస్లింలు మెజారిటీగా ఉన్నారు. దేశ జనాభాలో వీరు 5 శాతమే, 95 శాతం మిగతా రాష్ట్రాలలో ఉన్నారు. పంజాబ్‌లో సిక్కులు, నాగాలాండ్(20లక్షలు), మిజోరం (పది లక్షలు), మేఘాలయ (30లక్షలు)లో క్రైస్తవులు మెజారిటీగా ఉన్నారు. ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించరు అన్నదొక ప్రచారం. గణాంకాల ప్రకారం ముస్లింలలో 45.3, హిందువుల్లో 54 శాతం మంది నియంత్రణ పాటిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం హిందువుల్లో జననాల రేటు 19912001 కాలంలో 19.92 నుంచి 16.76కు తగ్గగా, ముస్లింల్లో 29.52 నుంచి 24.6కు తగ్గింది. వీటి ఆధారంగా వేసిన అంచనా ఏమిటి? 2011-21కాలంలో హిందువుల జననాల రేటు 15.7, ముస్లింలో 18.2కు తగ్గనుందని అంచనా. దీని అర్ధం ఏమిటి కుటుంబ నియంత్రణ పాటించటం ముస్లింలలో పెరిగిందనే కదా? లెక్కలు తెలియని వారికి చెప్పవచ్చు, తెలియనట్లు నటించే వారికి చెప్పగలమా? దేశంలో పురుషులు స్త్రీల నిష్పత్తి 1000: 940, అదే పిల్లల్లో చూస్తే 1000: 916 మాత్రమే ఉంది.

ఇలా ఉన్న దేశంలో బహుభార్యలను కలిగి ఉండటం సాధ్యమా? ముస్లింలు ఎక్కువగా ఉన్న లక్షద్వీప్‌లో 946, 911గానూ జమ్మూకశ్మీరులో 889,862 గా ఉన్నారు. దేశ సగటు కంటే తక్కువ ఉన్న చోట అది జరిగేదేనా? చిత్రం ఏమంటే దేశంలో అనుమతి ఉన్న ముస్లింల్లో బహు భార్యాత్వం 5.7 శాతం ఉంటే నిషేధం ఉన్న హిందువుల్లో 5.8 శాతం ఉంది. దీన్నేమంటారు ? మేకిన్ ఇండియా (భారత్‌లో తయారీ), మేక్ ఇండియా(భారత్ తయారీ) పిలుపులతో ఇప్పటి వరకు ఎగుమతికి అవసరమైన వస్తువుల కంటే జనాన్ని చీకట్లో ఉంచేందుకు అవసరమైన అవివేకం పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతోంది. దాని వినియోగం విపరీతంగా పెరుగుతోంది. “ ఒక ప్రధానమైన అంశాన్ని మరోవైపు ఆలోచించకుండా జోరీగలా బుర్రల్లోకి ఎక్కించకుండా అత్యంత ప్రతిభావంతులైన ప్రచార నిపుణుల మెళకువలు కూడా విజయ వంతం కావు.ఆ ప్రచారం కొన్ని అంశాలకే పరిమితం కావాలి, దాన్ని పదే పదే పునశ్చరణ చేయాలి. ఈ ప్రపంచంలో విజయం సాధించాలంటే మొట్టమొదటిదీ, ముఖ్యమైనదీ దేనికైనా హఠం వేయటమే” తన మీన్ కాంఫ్ గ్రంధంలో నరహంతకుడు నాజీ హిట్లర్ రాసిన అంశమిది. హిట్లర్‌ను, వాడి మంత్రి గోబెల్స్‌ను ఎవరు ఆదర్శంగా తీసుకున్నదీ వేరే చెప్పాలా !

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News