ముంబై: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతుల విడాకులకు సంబంధించి సోషల్ మీడియాలో వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ప్రేమించి పెళ్లు చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఇజాన్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా, షోయబ్‌తో సానియా విడాకులు తీసుకోనుందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. ఇక తాజాగా సానియాతో పాటు ఆమె స్నేహితురాలు, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా విడాకుల వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇటీవలే సానియాషోయబ్ దంపతుల కొడుకు ఇజాన్ జన్మదినాన్ని దుబాయిలో ఘనంగా నిర్వహించారు. కాగా, షోయబ్ తన భార్య సానియా, కుమారుడు ఇజాన్‌తో జన్మదిన వేడుకలో పాల్గొన్న ఫొటోను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అయితే సానియా మాత్రం తాను కొడుకు ఇజాన్‌తో కలిసి ఉన్న ఫొటోను మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సానియా చేసిన పోస్ట్ పలు అనుమానాలకు తావిస్తోంది.
అంతేగాక ఇటీవలే సానియా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వేదాంత ధొరణిలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను పెట్టింది. ప్రస్తుతం తాను ఎంతో మనోవేదనకు గురవుతున్నానని, జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు సానియాషోయబ్ మాలిక్‌లు విడిపోతున్నారనే వార్తలు పాకిస్థాన్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారని వార్తలు ప్రచురితమవుతున్నాయి. దీనికి తోడు కొంతకాలంగా సానియాషోయబ్‌లు విడిగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు కొడుకు కోసం ఇద్దరు దుబాయిలో కలుసుకుంటున్నారు. ఇక తాజాగా సానియా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె స్నేహితురాలు ఫరా ఖాన్ చేసి ట్విట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. నీ జీవితంలో ఉన్న ఒకే ఒక నిజమైన ప్రేమ ఇజాన్‌తో నిన్ను చూసినప్పుడల్లా నాకిలాగే అనిపిస్తుందని ఫరా కామెంట్ చేశారు. మరోవైపు సానియా కూడా ఇటీవలే కొడుకు ఇజాన్‌తో అప్యాయంగా ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు సానియా పెట్టిన క్యాప్షన్ కూడా వైరల్‌గా మారింది. కఠిన పరిస్థితులు నుంచి నన్ను బయటకు తీసుకెళ్లే క్షణాలు అంటూ సానియా క్యాప్షన్ జతచేసింది. అంతేగాక ముక్కలైన హృదయం ఎక్కడికి వెళ్తుందో అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాయడం విడాకుల అనుమాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇక చాలా రోజులగా సానియాషోయబ్‌ల మధ్య సఖ్యత లేదని, అందుకే నెలల తరబడి ఇద్దరు దూరంగా ఉంటూన్నరని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఇద్దరు త్వరలోనే విడాకులు తీసుకునున్నారని వార్తలు వినవస్తున్నాయి. ఇంత జరుగుతున్న ఇటు సానియా కానీ అటు షోయబ్‌కానీ నోరు మెదపకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. అయితే త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Sania and Shoaib Malik getting divorce?