Monday, December 23, 2024

ఆ ఐదు స్థానాల్లో ఎవరు?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్‌లో వలసలు ఎక్కువ కావడంతో అభ్యర్థులు కూడా మారే అవకాశం ఉందని పార్టీ వర్గా లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే 13 స్థానాల ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరో నాలు గు స్థానాలను (ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్) పెండింగ్‌లో పెట్టడంతో అక్కడ బలమైన అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగింది. ప్రస్తుతం ఈ నాలుగు స్థానాలకు తోడు సికింద్రాబాద్ అభ్యర్థిని సైతం మార్చవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ప్రకటించగా ఆయన స్థానంలో మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానం నాగేందర్ ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ట్‌లో చేరే సమయంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ఎంపి టికెట్‌ను ఆశించినట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ ఎంపిగా పోటీ చేస్తానని పేర్కొంటుండడంతో కాంగ్రెస్ పార్టీ అలా కుదరదని చెప్పినట్టుగా తెలిసింది.

దీంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే ఆయన స్థానంలో సికింద్రాబా ద్ నుంచి మాజీ మేయర్ బొంతు రాంమ్మోహన్‌ను పోటీలో నిలబెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈనెల 31వ తేదీన ఢిల్లీలో సీఈసీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఈ 5 స్థానాల అభ్యర్థుల ఎంపికపై మరోమారు చర్చించి వారి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి జాబితాలో నలుగురిని, రెండో జాబితాలో ఐదుగురిని, మూడో జాబితాలో నలుగురి అభ్యర్థుల పేర్లను ఏఐసిసి ప్రకటించగా ఇక నాలుగో జాబితాలో మిగిలిన ఐదు స్థానాల అభ్యర్థుల (ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, (సికింద్రాబాద్ ఒకవేళ దానం నాగేందర్ ఒప్పుకోకపోతే) పేర్లను వెల్లడించాలని ఏఐసిసి నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇప్పటికే ఈ స్థానాల్లో టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఆశావహుల నుంచి ఒత్తిడి నేపథ్యంలో అధిష్ఠానం నిర్ణయం సస్పెన్స్‌గా మారింది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా తాజాగా బుధవారం నలుగురి పేర్ల ప్రకటనతో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 13కు చేరింది. మిగిలిన ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికి వినపడని పేర్లు సైతం తెరపైకి వస్తుండడంతో అభ్యర్థుల పేర్లను ప్రకటించే వరకు సస్పెన్స్ వీడే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వేరే పార్టీ వ్యక్తి..!
కాంగ్రెస్ కంచుకోటగా కనిపిస్తున్న ఖమ్మం సీటు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఖమ్మం అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ స్థానం నుంచి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరితో పాటు తుమ్మల సైతం తన కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఖమ్మంలో కమ్మ ఓట్లు కీలకంగా మారడంతో ప్రస్తుతం వేరే పార్టీ ప్రకటించిన అభ్యర్థిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి ఆయనకు సీటు ఇచ్చే విషయమై కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఖమ్మం సీటు కోసం ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్న నేపథ్యంలో బయటి వాళ్లను పార్టీలోకి తీసుకొచ్చి ఈ సీటును అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

హైదరాబాద్ బరిలో సానియామీర్జా
ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాల్లో పాపులారిటీతో పాటు కుల సమీకరణాలు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోనూ బలమైన అభ్యర్థులను నిలపాలని పార్టీ నిర్ణయించినట్టుగా తెలిసింది. ఇక హైదరాబాద్ ఎంపి టికెట్ విషయంలోనూ క్రీడాకారిణి సానియామీర్జాతో పాటు షెహనాజ్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తుండగా అందులో సానియా పేరు ప్రముఖంగా వినిపించడం విశేషం.
వరంగల్ సీటు కడియం కుటుంబ సభ్యులకే….!
అలాగే, వరంగల్ టికెట్ కోసం దమ్మాటి సాంబయ్యతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పసునూరి దయాకర్ పోటీ పడుతున్నారు. వారి స్థానంలో కొత్తగా కడియం శ్రీహరి లేదా ఆయన కూతురికి టికెట్ కన్‌ఫం అన్న సంకేతాలను కేడర్‌కు అధిష్టానం చేరవేసినట్టుగా తెలిసింది. అయితే ఇప్పటికే మాలలకు రెండు టికెట్‌లను కాంగ్రెస్ కేటాయించగా మాదిగలకు ఇప్పటివరకు టికెట్‌ను కేటాయించలేదు. రాష్ట్రంలో 60 లక్షల జనాభా ఉన్న మాదిగలకు ఒక్క సీటును కేటాయించ కపోవడం 18 లక్షలున్న మాలలకు పెద్దపల్లి సీటు (గడ్డం వంశీ, మాల), నాగర్‌కర్నూల్ సీటును మల్లు రవి (మాల దాసరి) కేటాయించడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున అధిష్టానానికి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వరంగల్ సీటునైనా తమకు కేటాయించాలని మాదిగలు డిమాండ్ చేస్తుండగా కొత్తగా కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్యలు బైండ్ల (మాల ఉపకులం) టికెట్‌ను ఆశిస్తుండడం విశేషం.

కరీంనగర్‌లో తీన్మార్ మల్లన్న..!
అలాగే కరీంనగర్‌లో వెలమ, బిసి సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్‌కుమార్‌ను బరిలోకి దింపగా బిజెపి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కుమార్‌ను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు పోటీ పడుతున్నప్పటికీ ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కబోతున్నది అనేది చర్చగా మారింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయనకంటే బలమైన అభ్యర్థి కోసం రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసినట్టుగా సమాచారం. ఆయన స్థానంలో బిసి అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును కూడా అధిష్టాన పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News