Sunday, January 19, 2025

టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (36) టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించింది. అయితే సోమవారం ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా మీర్జా పాల్గొంటోంది. కొడుకు బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ఆటకు వీడ్కోలు పలకడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు సానియా వివరించింది. రిటైర్మెంట్ నిర్ణయం చాలా కఠినమే అయినా ఏదో ఒక సమయంలో ఇది తీసుకోక తప్పదని పేర్కొంది. చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. మరి కొన్నేళ్ల పాటు ఆటలో కొనసాగే ఫిట్‌నెస్ తనకు ఉందని అయితే కొడుకు ఇజాన్ బాధ్యతల నేపథ్యంలో టెన్నిస్ ఆడడం తనకు సాధ్యం కాదని వివరించింది.

ఇక సుదీర్ఘ కాలం పాటు టెన్నిస్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నానని సానియా వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు, మరెన్నో చేదు అనుభవాలను తాను చవిచూశానని తెలిపింది. అయితే ఆటలో ఇది ఒక భాగం అనే విషయాన్ని తాను మరచి పోలేదని చెప్పింది. ఇక తాను టెన్నిస్‌లో ఈ స్థాయికి చేరుకున్నానంటే దానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రులేనని స్పష్టం చేసింది. తనను మెరుగైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దేందుకు వారు పడిన శ్రమను మాటల్లో వర్ణించలేనని తెలిపింది. అంతేగాక తన ఎదుగుదలలో కోచ్‌లు, స్పాన్సర్లు, కుటుంబ సభ్యులు, మీడియా సహకారం కూడా ఎంతో ఉందని అభిప్రాయపడింది. వీరందరికి తాను సదా రుణపడి ఉంటానని సానియా పేర్కొంది. కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా మహిళల డబుల్స్ డబుల్స్ విభాగంలో కజకిస్థాన్ క్రీడాకారిణి అనా డానిలినాతో కలిసి బరిలోకి దిగనుంది.

భారత టెన్నిస్‌పై తనదైన ముద్ర

భారత టెన్నిస్‌పై తెలుగుతేజం సానియా మీర్జా తనదైన ముద్ర వేసింది. తన అసాధారణ ఆటతో అంతర్జాతీయ టెన్నిస్‌లో భారత ఖ్యాతిని ఇనుమడింప చేసింది. అంతేగాక ఎంతో మంది టెన్నిస్ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌లో సానియా ఎన్నో చారిత్రక విజయాలను సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానానికి చేరుకుని కొత్త రికార్డును నెలకొల్పింది. అంతేగాక మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో పలు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను గెలుచుకుంది. అంతేగాక డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకుని అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇక సానియా పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో సానియా వివాహం చేసుకుంది. వీరికి ఇజాన్ అనే కొడుకు ఉన్నాడు. కొంతకాలంగా సానియాషోయబ్‌ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఇద్దరి విడాకుల అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇలాంటి స్థితిలో సానియా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News