నిధులు కేటాయించిన బీహార్ స్కూల్
పాట్నా: యుక్త వయసుకు వచ్చిన బాలికలకు శానిటరీ నాప్‌కిన్స్ అందించే సదుద్దేశంతో బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్ పథకం కింద బాలురకు శానిటరీ నాప్‌కిన్స్, ఇతర దుస్తుల కోసం నిధులు మంజూరు చేసిన ఘటన శరన్ జిల్లా హల్‌కోరీ షా హైస్కూలులో వెలుగు చూసింది. పాఠశాల హెడ్మాస్టర్ ఈ విషయాన్ని గుర్తించి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత మూడేళ్ల రికార్డుల్లో ఇలాంటివి అనేకం గుర్తించానని ఆయన పేర్కొన్నారు. కాగా తనకు హెడ్మాస్టర్‌నుంచి లేఖ అందిన విషయాన్ని శరన్ జిల్లా విద్యాధికారి అజయ్ కుమార్ సింగ్ శనివారం ధ్రువీకరించారు. అంతేకాకుండా ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపేందుకు ఇద్దరు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన చెప్పారు. కాగా ఈ వింత ఘటనపై బీహార్ విద్యాశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్‌ను సంప్రదించడానికి పిటిఐ అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. ‘ముఖ్యమంత్రి కిశోరి స్వాస్థ కళ్యాణ్’ పేరుతో ప్రారంభించిన ఈ పథకం కింద ప్రతి బాలికకు శానిటరీ నాప్‌కిన్స్ కొనుగోలు చేయడానికి ఏటా రూ.150 అందజేస్తారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఇందు కోసం సుమారుగా రూ.60 కోట్లు ఖర్చు చేస్తుంది.