Monday, December 23, 2024

‘పది’ శుద్ధ్యం

- Advertisement -
- Advertisement -

సీజనల్ వ్యాధులపై
సమరం
మంత్రి కెటిఆర్ పిలుపుమేరకు
ప్రతి ఆదివారం పరిసరాల శుభ్రత
ముందుకొచ్చిన మంత్రులు,
ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు,
అధికారులు భాగస్వాములు
కావాలని ప్రజలకు పిలుపు

మనతెలంగాణ/ హైదరాబాద్ : సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందస్తుగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చింది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, డెంగ్యూ నివారణతో పాటు రోగాల బారిన పడకుండా పారిశుద్ధంపై శ్రద్ధ వహించాలన్న మంత్రి కెటిఆర్ సైతం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల పరిశుభ్రతపై దృష్టి సారించారు. మంత్రులు, హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డిలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా పారిశుద్ధ్య నిర్వహణకు ముందుకొచ్చారు. దీంతోపాటు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, సిఎస్‌తో వివిధ శాఖల అధికారులు తమవంతు బాధ్యతగా తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఆదివారం 10 గంటలకు, 10 నిమిషాలు, 10 వారాల పాటు దీనిని కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది.

రోగాలు రాకుండా ఉమ్మడిగా నివారణ చర్యలు: మంత్రి హరీష్‌రావు

డెంగ్యూ నివారణలో భాగంగా తన ఇంటి పరిసరాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్వయంగా పారిశుద్ధం పనులను నిర్వహించారు. ప్రజలంతా ప్రతి ఆదివారం 10 నిమిషాలు తమ ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల పరిశుభ్రతకు కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మొక్కల తొట్ట్టీలను క్లీన్ చేశారు. పగటిపూట దోమలు కుట్టడమే డెంగ్యూకి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. రోగాలు రాకుండా ఉమ్మడిగా అందరూ నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. మంత్రి హరీష్ రావు ఆదివారం తన నివాస ప్రాంగణంలో పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి హరీష్‌రావు తన ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాలను స్వయంగా ఆయనే శుభ్రం చేసుకున్నారు. దోమలు రాకుండా నిల్వ ఉన్న నీటిని తొలగించారు.

ప్రతిఒక్కరూ బాధ్యతగా పరిసరాలు శుభ్రం చేసుకోవాలి: మంత్రి వేముల

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ప్రతి ఆదివారం 10 నిమిషాలు ఇంటి పరిసరాలు శుభ్రం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రజలకు సూచించారు. సీజనల్ వ్యాధులను నివారణను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక నివాసంలో పరిసరాలను పరిశుభ్రం చేసుకున్నారు. నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జిహెచ్‌ఎంసి సిబ్బందితో కలిసి తన ఇంటి పరిసరాలను స్వయంగా మంత్రి పరిశుభ్రం చేశారు. మంత్రితో పాటు నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి మల్లారెడ్డి

సీజనల్ అంటువ్యాధులను అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డెంగీ, మలేరియా లాంటి విష జ్వరాలకు కారణమయ్యే దోమలను లార్వా దశలోనే నియంత్రించే చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మంత్రి కెటిఆర్ పిలుపు మేరకు ఇంటి పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని కూకట్‌పల్లి సర్కిల్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లిలోని తన నివాసంలో మంత్రి మల్లారెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు జోనల్ కమిషనర్ వి.మమత, సర్కిల్ ఉప కమిషనర్ పి.రవీందర్‌కుమార్, ఎంటమాలజీ సీనియర్ అసిస్టెంట్ లచ్చిరెడ్డిలు పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి సమక్షంలో ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను పరిశీలించి, నీటిలో దోమ వృద్ధిచెందే విధానాన్ని అధికారులు వివరించారు. ఇంటి ఆవరణలోని ఖాళీగా ఉన్న టైర్లలో నీటి ఆవాసాలను గుర్తించి రసాయనాలను పిచికారీ చేశారు. అనంతరం పరిశుభ్రత కార్యక్రమం అవగాహన కరపత్రాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేస్తూ సకల సదుపాయాలను కల్పిస్తుందన్నారు.

ప్రచార సామగ్రి, కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్ విడుదల

మంత్రి కెటిఆర్ పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ సైతం తన ఇంటి పరిసరాలను పరిశుభ్రం చేసుకున్నారు. సిఎస్ అనంతరం స్పెషల్‌డ్రైవ్ నిర్వహణకు సంబంధించి ప్రచార సామగ్రి, కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్, బ్యానర్స్, షార్ట్‌ఫిల్మ్‌లను విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు కూడా సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో మేయర్…

నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మేతె శ్రీలత శోభన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, వివేకానంద, కౌసర్ మొయినుద్దీన్, జోనల్ కమిషనర్‌లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News