Saturday, January 18, 2025

గుజరాత్‌లో సాగుతున్నదారుణం

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : గుజరాత్‌లో వివిధ ప్రాంతాలలో దాదాపు నెలరోజుల వ్యవధిలోనే ఎనమండుగురు వరకూ పారిశుధ్య కార్మికులు విధులలో ఉన్నప్పుడు ప్రమాదాలకు గురై మృతి చెందారు. మురికి కాలువలను , సెప్టిక్ ట్యాంకుల శుభ్రం పనికి వాటిలోకి దిగి విధులు నిర్వర్తించే పారిశుద్ధ కార్మికుల భద్రత లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశవ్యాప్తంగా ఇటువంటి పాకీపనిని అక్రమం చెల్లనేరదని అధికారికంగా ప్రకటించారు. అయితే దీనితో నిమిత్తం లేకుండా పనులు సాగుతున్నాయి. ఈ ఏడాది మార్చి 22 నుంచి ఎప్రిల్ 26 మధ్యలో గుజరాత్‌లో ఎనమండుగురు ఈ విధమైన పనుల్లో ఉండగా విషవాయువులు సోకి , స్పృహ తప్పిపడిపోయి విగతజీవులుగా మారిన ఘటనలు జరిగాయి. మార్చి 22న రాజ్‌కోట్‌లో ఇద్దరు, ఎప్రిల్ 3న దహేజ్‌లో ముగ్గురు, తరువాత ధోల్కాలో ఇద్దరు ఎప్రిల్ 23న మృతి చెందారు.

ఇటువంటి మరో మరణం రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతం అయిన థరాడ్‌లో ఎప్రిల్ 26న సంభవించింది. పొట్టకూటికోసం ఈ వృత్తికి దిగాల్సి వచ్చిన వీరు అమానుష రీతిలో ఉన్న పనివిధానాలకు ఊపిరాడని స్థితిలో మృతి చెందడం వారి కుటుంబాలు రోడ్డున పడటం గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఈ కార్మికులకు ఎటువంటి రక్షిత తొడుగులు, సాధనాలు అందుబాటులో లేకుండానే విధులలోకి దిగాల్సి వస్తోంది. ఈ మరణాల తరువాత పోలీసు వర్గాలు వీటిపై ప్రమాద మరణాల కేసులు పెట్టారు. దర్యాప్తు తంతు చేపట్టారు, కాగా దహెజ్ ఘటనకు సంబంధించి ఇప్పటికైతే ఓ ప్రైవేటు కాంట్రాక్టరుపై కేసు దాఖలు అయింది. భూగర్భ మురికికాలువల నిర్వహణకు సంబంధించి పనులు చేపట్టేందుకు పురపాలక సంస్థలు, ప్రభుత్వ విభాగాల ద్వారా ఎప్పటికప్పుడు పనుల అమలును ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. వీరు తమ ముందుకు వచ్చే పారిశుద్ధ పనులను చేయించేందుకు కార్మికులను రంగంలోకి దింపుతున్నారు.

అయితే ఈ క్రమంలో వారి ప్రాణాల రక్షణకు అవసరం అయిన జాగ్రత్త చర్యల గురించి ఏ మేరకు ఇక్కడ పట్టించుకుంటున్నారనేది ఇప్పటి మరణాలతో స్పష్టం అయింది. గత రెండేళ్లలో 11 మంది కార్మికులు పారిశుద్ధ పనులలో ఉన్నట్లు ఇటీవలే గుజరాత్ అసెంబ్లీలో సంబంధిత మున్సిపల్ మంత్రి వివరాలు అందించారు. అయితే ఈ ఏడాది ఒక్కనెల వ్యవధిలోనే ఎనమండుగురు మృతి చెందినట్లు నిర్థారణ అయింది. అయితే ఇటువంటి మరణాల సంఖ్యను అధికార వర్గాలు తక్కువ చేసి చూపుతున్నాయని సామాజిక కార్యకర్తలు, దళిత నేతలు విమర్శించారు. గుజరాత్‌లో 150 మందికి పైగా పారిశుద్ధ కార్మికులు ఈ విధంగా దుర్ఘటనలలో మృతి చెందారని , వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులే ఉన్నారని , ఓ వ్యక్తి మైనార్టీ వర్గానికి చెందిన వారని గుజరాత్ కాంగ్రెస్ ఎస్‌సి విభాగం ఛైర్మన్ హితేంద్ర పితదియా తెలిపారు.

గుజరాత్‌లో పారిశుద్ధ కార్మికుల దారుణ స్థితి , సరైన భద్రతలు లేని స్థితిలో అత్యధికంగా దళితులు గిరిజన కార్మికులు మృతి చెందిన వైనంపై , వారి దయనీయ పని పరిస్థితులపై గుజరాత్ కాంగ్రెస్ నేత హిరెన్ బంకెర్ స్పందించారు. ఈ ఘటనలపై వెంటనే జాతీయ హక్కుల సంస్థ చొరవ తీసుకుని దర్యాప్తు చేపట్టాలని కోరారు. దయనీయ స్థితిలో మురికికాలువల్లోనే సమాధి అవుతున్న వారి కుటుంబాలలో అత్యధికులకు ఇప్పటికీ ఎటువంటి పరిహారం దక్కడం లేదని నిరసనలు వ్యక్తం అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News