Sunday, January 19, 2025

సంజయ్ గాంధీ ఆస్పత్రి లైసెన్స్ రద్దు..ఎంపి వరుణ్‌గాంధీ ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ అమేథీ లో తన తండ్రి సంజయ్ గాంధీ పేరున ఉన్న ఆస్పత్రి లైసెన్సును ఎలాంటి విచారణ లేకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడంపై బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ మండిపడ్డారు. ‘పేరు’ మీదున్న కోపం లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన పనిని పాడు చేయకూడదని ఆయన ధ్వజమెత్తారు. లైసెన్సు రద్దు నిర్ణయాన్ని పునరాలోచించాలని, క్షుణ్ణంగా ఎలాంటి దర్యాప్తు చేయకుండా తొందరపాటుతో నిర్ణయం తీసుకోవడం ఘోర అన్యాయంగా విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్) లో తన ఆవేదన పోస్ట్ చేశారు. ఇది కేవలం ఆస్పత్రిలోని 450 మంది ఉద్యోగుల సమస్య ఒకటే కాదని, వారి కుటుంబాలు, చికిత్సకు వచ్చే సామాన్య ప్రజలకు సంబంధించిందని పేర్కొన్నారు. మానవతా దృష్టి తప్ప వ్యవస్థ యొక్క ‘అహం’ ఈ విషయంలో న్యాయం చేయలేదని వ్యాఖ్యానించారు.

ఈ ఆస్పత్రి సౌకర్యాన్ని మూసివేయవద్దని ఆస్పత్రి ఉద్యోగులు, రోగులు వేడుకోవడాన్ని వీడియో ద్వారా వరుణ్‌గాంధీ ప్రదర్శించారు. గత వారం డిప్యూటీ సిఎం బ్రజేష్ పాథక్‌కు వరుణ్‌గాంధీ లేఖ రాశారు. లైసెన్సు రద్దు చేయడం వల్ల ఆప్రాంతం వైద్య సౌకర్యానికి, ఉద్యోగులకు , వైద్య విద్యకు తీరని నష్టం కలుగుతుందని లేఖలో పేర్కొన్నారు. వరుణ్‌గాంధీ తండ్రి సంజయ్ గాంధీ పేరున సంజయ్ గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఆస్పత్రికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ట్రస్ట్ ఛైర్‌పర్శన్ కాగా, సభ్యులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. జవాబుదారీతనం అనేది చాలా కీలకమని, నిష్పాక్షికత విలువలను పాటించాలని లేఖలో వరుణ్‌గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆస్పత్రి లైసెన్సును పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖను కూడా నిర్వహిస్తున్న డిప్యూటీ సిఎం పాథక్ వైద్యంలో నిర్లక్షం కారణంగా 22 ఏళ్ల మహిళ మృతి చెందడంతో పూర్తిగా దర్యాప్తు చేసి లైసెన్సును రద్దు చేయడమైందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News