శివసేన నేత రౌత్ విమర్శ
ముంబై : బిజెపియేతర రాష్ట్రాలలో కరోనా ఉధృతికి కేంద్రం పక్షపాత ధోరణినే కారణమని శివసేన నేత, ఎంపి సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశంలో మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్‌గఢ్‌లలో ఇప్పుడు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. కేంద్రం జారీ చేసిన ఆదేశాలన్నింటిని పాటించిందని , అయితే కేంద్రమే తమ పట్ల విచక్షణతో వ్యవహరించిందని విలేకరుల సమావేశంలో స్పందించారు. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పది రాష్ట్రాలలో మహారాష్ట్ర, యుపి, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్రాలు ఉన్నాయి. అయితే మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రస్థాయికి చేరుకుంది.
తాము ఓ వైపు అన్ని విధాలుగా కరోనాపై కేంద్ర సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటే, కేంద్రం తగు విధంగా సాయం చేయకుండా, పైగా రాష్ట్రాలపై నిందలకు దిగడం సముచితమేనా? అని ప్రశ్నించారు. కరోనా కట్టడిలో మహారాష్ట్ర, మరో రెండు రాష్ట్రాలు పంజాబ్, చత్తీస్‌గఢ్‌లు విఫలం చెందాయని అనుకుంటే ఇందులో తొలి వైఫల్య బాధ్యత కేంద్రంపైనే ఉంటుందని రౌత్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కరోనాపై పోరు ప్రధాని మోడీ నాయకత్వంలో సాగుతున్నదనే బ్రహ్మండమైన ప్రచారం జరుగుతున్నప్పుడు బిజెపియేతర రాష్ట్రాలలో పరిస్థితి దిగజారిందనే వాదన ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు. మంచి జరిగితే మోడీ బిజెపి ప్రతిష్ట, ఇతరత్రా అయితే శివసేన లేదా ఇతర ప్రతిపక్షల అసమర్థత నిందలా అని నిలదీశారు.