ముంబయి: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న శివ సేన అభ్యర్థులను బిజెపోళ్లు బెదిరిస్తున్నారని శివసేన సీనియర్ నేత, ఎంపి సంజయ్ రౌత్ ఆరోపణలు గుప్పించారు. శివ సేన పార్టీ అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బిజెపి అభ్యర్థులు బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. శివ సేన పార్టీని చూసి బిజెపి భయపడుతోందని ఎద్దేవా చేశారు. మా వాళ్లను బెదిరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. శివ సేన అభ్యర్థులు నామినేషన్ దాఖలు వేసినప్పటికి ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. ఈ వివాదంపై చర్య తీసుకోవాలని యుపి ఎన్నికల సంఘాన్ని కోరామని, వాళ్లు రాజకీయంగా ఒత్తిడిలో ఉండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సంజయ్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని సంజయ్ తెలిపారు. తొలి సారి ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో శివసేన పోటీ చేస్తుందన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఎన్‌సిపితో కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు.