Monday, November 25, 2024

బ్యాలట్ పేపర్లతో మళ్లీ ఎన్నికలు జరపాలి: సంజయ్ రౌత్

- Advertisement -
- Advertisement -

ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో(ఇవిఎం) అక్రమాలు జరిగిన కారణంగా బ్యాలట్ పేపర్లను ఉపయోగించి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని శివసేన(యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. సోమవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇవిఎంల పనితీరుపై అనకు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల నిష్పాక్షితకపై ఆయన అనుమానాలు లేవనెత్తారు. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలలో 230 స్థానాలను బిజెపి నేతృత్వంలోని మహాయుతి గెలుచుకోగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కేవలం 46 సీట్లను మాత్రమే దక్కించుకుంది. ఎంవిఎలో భాగస్వామ్య పక్షమైన శివసేన(యుబిటి) పోటీ చేసిన 95 స్థానాలలో 20 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఇవిఎంల పనితీరుపై దాదాపు 450 ఫిర్యాదులు వచ్చాయని, పదేపదే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ ఎన్నికలను నిజాయితీగా నిర్వహించారని ఎలా చెప్పగలమని ఆయన ప్రశ్నించారు.

ఈ కారణంగా ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి బ్యాలట్ పత్రాలను ఉపయోగించడం ద్వారా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవిఎంల అక్రమాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలను వివరిస్తూ నాసిక్‌లో ఒక అభ్యర్థికి ఆయన కుటుంబానికి చెందిన ఓట్లే 65 ఉండగా కేవలం నాలుగు ఓట్లు మాత్రమే లభించాయని, డాంబివిలీలో ఇవిఎంలో పడిన ఓట్లలో తేడా ఉన్నప్పటికీ తప్పును గుర్తించడానికి అధికారులు నిరాకరించారని ఆయన చెప్పారు. కొందరు అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందడం పట్ల కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. లక్షన్నరకు పైగా ఓట్లు సాధించేంత ఘనకార్యాలు వారేం చేశారని ఆయన ప్రశ్నించారు. ఇటీవల పార్టీలు మారిన నాయకులు కూడా ఎమ్మెల్యేలుగా గెలుపొందారని, ఇవి అనుమానాలకు దారితీస్తోందని రౌత్ చెప్పారు. మొట్టమొదటిసారి శరద్ పవార్ లాంటి సీనియర్ నాయకుడు సైతం ఇవిఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారని, దీన్ని విస్మరించకూడదని ఆయన అన్నారు. ఎన్నికలలో ఎంవిఎ కూటమి వైఫల్యానికి ఏ ఒక్క వ్యక్తిని నిందించలేమని ఆయన స్పష్టం చేశారు.

ఐక్య ఎంవిఎ కూటమిగా తాము ఎన్నికల్లో పోరాడామని, మహారాష్ట్రలో అమిత గౌరవాన్ని పొందే శరద్ పవార్ లాంటి నాయకుడు సైతం ఓటమిని చవిచూశారని ఆయన అన్నారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఓటమి వెనుక ఉన్న కారణాలను అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఇవిఎంల అక్రమాలు, వ్యవస్థ దుర్వినియోగం, రాజ్యాంగ వ్యతిరేక విధానాలు వంటివి ప్రధాన కారణాలని ఆయన ఆరోపించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పరిష్కరించని న్యాయపరమైన నిర్ణయాలు కూడా తమ ఓటమికి కారణంగా ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News