ముంబై : ఎన్‌సిపి వెళ్లి ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం ఏక్‌నాథ్ షిండే తన ముఖ్యమంత్రి పదవిని చేజార్చుకోవడానికి దారితీస్తుందని శివసేన ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాలలో ఆకస్మిక పెనుమార్పుగా ఎన్‌సిపి సీనియర్ నేత అజిత్ పవార్ తన వర్గీయులతో కలిసి ప్రభుత్వంలో చేరడం, అజిత్‌కు కీలకమైన ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం వంటి పరిణామాలపై సంజయ్ రౌత్ ఆదివారం స్పందించారు. ఇక ఏక్‌నాథ్ పీఠం కదిలినట్లే అయిందని తెలిపారు. త్వరలోనే మహారాష్ట్రకు కొత్త సిఎం వస్తారనిఆయన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శివసేన షిండే, బిజెపిల సంయుక్త ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక షిండే పతనం ఆరంభమైనట్లే అని , ఆయన తరఫు ఎమ్మెల్యేలు త్వరలోనే అనర్హత వేటుకు గురవుతారని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని,
దీనిని పరిగణనలోకి తీసుకునే ఇప్పుడు బిజెపి అగ్రనేతలు వ్యూహాత్మకంగా ఎన్‌సిపిలో చీలిక తెచ్చి అజిత్ పవార్‌ను ఆయన మద్దతుదార్లు అయిన కొందరు ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకున్నారని రౌత్ తెలిపారు. ఇదీ బిజెపి మార్క్ రాజకీయం అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఇటీవల అజిత్ పవార్ భేటీ కావడం ఈ విధమైన రాజకీయ పెనుమార్పునకు దారితీసిందని తెలిపారు. అయితే ఎన్‌సిపి వర్గం వెళ్లి ప్రభుత్వంలో చేరడం, లేదా ఎన్‌సిపిలో తిరుగుబాటు వంటివి తమకైతే అనూహ్య పరిణామాలేమి కావని చెప్పారు. ఇది తాము ఊహించినవే కావడంతో ఇదేమి తమకు రాజకీయ భూకంపంగా అన్పించడం లేదని, అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. ఈ పరిణామాన్ని ట్రిపుల్ ఇంజిన ప్రభుత్వం ఏర్పాటుగా భావించుకోవల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండు ఇంజిన్లలో ఒకటి పట్టాలు తప్పుతుందని , ఇక కుంటుడు తప్పదన్నారు.
షిండే ఇంజిన్ దెబ్బతిన్నట్లే అన్నారు. అంతకు ముందు సిఎం షిండే ఇప్పుడు మహారాష్ట్రలోఉన్నది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదని , ట్రిపుల్ ఇంజిన్ సర్కారు అని వ్యాఖ్యానించడంపై రౌత్ ఎదురుదాడికి దిగారు. ఎన్‌సిపి నేత శరద్ పవార్‌కు ఈ పరిణామాల గురించి ముందుగానే తెలుసునని రౌత్ చెప్పారు. పరిణామాలపై ఆయనకు పూర్తి అవగావహన ఉందన్నారు. ప్రతిరోజూ అవినీతి గురించి ఎన్‌సిపి నేతలను తిట్టిపోస్తూ వచ్చిన బిజెపి నేతలు ఇప్పుడు ఎందుకు ఎన్‌సిపి వారిని మంత్రులుగా చేశారనేది విలేకరులు బిజెపి వారిని అడిగితే మంచిదని సంజయ్ రౌత్ చెప్పారు.