ముంబై: తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, జెడియు అధ్యక్షుడు నితీష్ కుమార్ ఒక నియంతతో చేతులు కలపాలా వద్ద అన్న విషయమై వారే నిర్ణయం తీసుకోవాలని శివసేన(యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఈ ఇద్దరు నాయకుల మద్దతు కీలకం కానున్న తరుణంలో బిజెపి నాయకత్వాన్ని ఉద్దేశించి రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఇండియా కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించి ప్రధాని పదవిని చేపట్టాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్ణయించుకుంటే తమ పార్టీ అభ్యంతరం తెలపదని అన్నారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీని బిజెపి సాధించనందుకు నైతికంగా తాను ఓటమి చెందినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ఒప్పుకోవాలని ఆయన కోరారు. మోడీ బ్రాండ్ కనుమరుగైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. నియంతతో చేతులు కలపాలా లేక ప్రజాస్వామిక వ్యవస్థలో పనిచేయాలా అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.
వారిద్దరూ ఒక నియంతతో చేతులు కలుపుతారని తాను భావించడం లేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మూడవసారి ప్రభుత్వాన్ని మోడీ ఏర్పాటు చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకారం బిజెపికి 240 సీట్లు లభించాయి. మెజారిటీకి 32 సీట్లు తగ్గాయి. ఎన్‌డిఎ మిత్రపక్షాలైన టిడిపికి 16 సీట్లు, జెడియుకు 12 సీట్లు లభించడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రెండు పార్టీల మద్దతు కీలకంగా మారింది.