1996 నాటి మాదకద్రవ్యాల స్వాధీనం కేసులో మాజీ ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్‌ను గుజరాత్ బనస్కాంత జిల్లా పాలన్‌పూర్ పట్టణంలోని ఒక సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. భట్ శిక్షా కాలాన్ని కోర్టు గురువారం మధ్యాహ్నం ప్రకటించవచ్చు. రాజస్థాన్‌కు చెందిన ఒక న్యాయవాదిని తప్పుగా కేసులో ఇరికించినందుకు భట్‌ను దోషిగా సెషన్స్ కోర్టు పేర్కొన్నది. న్యాయవాది 1996లో పాలన్‌పూర్‌లో బస చేసిన ఒక హోటల్ గదిలో మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని భట్ తెలిపారు. భట్‌కు 2015లో ఐపిఎస్ నుంచి ఉద్వాసన పలికారు. 1996లో భట్ బనస్కాంత జిల్లా ఎస్‌పిగా పని చేస్తున్నారు.
రాజస్థాన్ న్యాయవాది సుమేర్‌సింగ్ రాజ్‌పురోహిత్ పాలన్‌పూర్‌లో బస చేసిన ఒక హోటల్ గదిలో నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెబుతూ భట్ అజమాయిషీలోని జిల్లా పోలీసులు 1996లో ఎన్‌డిపిఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఆయనను అరెస్టు చేశారు. అయితే, రాజస్థాన్‌లోని పాలిలో గల వివాదాస్పద ఆస్తి బదలీకి రాజ్‌పురోహిత్‌ను బలవంతం చేయడానికి బనస్కాంత పోలీసులు ఆయనను తప్పుగా ఇరికించారని రాజస్థాన్ పోలీసులు ఆ తరువాత వెల్లడించారు. ఈ కేసులో కూలంకష దర్యాప్తు కోరుతూ మాజీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఐబి వ్యాస్ 1999లో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.